సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ
ABN , Publish Date - Mar 06 , 2024 | 11:55 PM
సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలు నమ్మి ప్రజలు ఎక్కువగా మోసపోతున్నారని, సైబర్ నేరాలపై ప్రజలు ఆప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాధిక బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

శ్రీకాకుళం క్రైం: సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలు నమ్మి ప్రజలు ఎక్కువగా మోసపోతున్నారని, సైబర్ నేరాలపై ప్రజలు ఆప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాధిక బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొందరు నేరస్థులు నేరుగా మీ నెంబరుకు ఫోన్ చేసి మీరు కొరియర్ రూపంగా డ్రగ్స్ బుక్ చేశారని, లేదంటే మీ చిరునామాకు మాదకద్రవ్యాలు వచ్చాయని తాము ముంబాయి, ఢిల్లీ, నార్కోటిక్స్ పోలీసులమంటూ వీడియో కాల్ చేస్తుంటారు.. మీపై కేసు లేకుండా చేస్తామంటూ డబ్బులు డిమాండ్ చేస్తుంటారని ఇలాంటి ఫోన్ కాల్స్‌కు స్పందించవద్దని, అలాంటి వారి వివరాలు మీ సమీపంలోని పోలీసులకు తెలియజేయాలని ఎస్పీ సూచించారు. ఆన్‌లైన్ జాబ్స్ పేరిట ఉద్యోగపు ఆశ చూపే మోసగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని వారి ని నమ్మి మీ వ్యక్తిగత వివరాలు ఎవరితో కూడా షేర్ చేయకుండా చూసుకోవాల న్నారు. పార్ట్ టైం జాబ్స్ పేరిట వచ్చే లింక్స్‌ను క్లిక్ చేసి మోసపోవద్దన్నారు. తక్కువ పెట్టుబడులతో అధిక లాభాలు వస్తాయని ఆశ చూపే వారిని నమ్మోద్దని ఎస్పీ వివరించారు. ఇంటర్నెట్, గూగుల్ వంటి వాటిలో ఏదైనా ఆన్‌లైన్ ఫిర్యాదు చేద్దామని కంపెనీ పేర్లు, కస్టమర్ కేర్ నెంబర్స్‌ను వెతికే క్రమంలో మోసగాళ్ల ఫోన్ నెంబర్లను నిజమైనవిగా భావించి, ఆ మోసగాళ్లకు మీరు ఫోన్ చేసి మీ వ్యక్తిగత వివరాలు చెప్పడం వల్ల వారు మీ ఫోన్‌ను హ్యాక్ చేసి గోప్య సమాచారాన్ని, ఫొటోలను దొంగిలించి బ్లాక్‌మెయిల్ చేసే నగదు డిమాండ్ చేసే ప్రమాదముందని హెచ్చరించారు. గుర్తుతెలియని అపరిచిత నెంబర్ల నుంచి వచ్చే మెస్సేజ్‌లను, లింకులను క్లిక్ చెయొద్దని ఎస్పీ రాధిక వివరించారు.
1930 ఫిర్యాదు చేయండి
ఇటువంటి మోసాలకు గురైనప్పుడు తక్షణం సైబర్ హెల్ప్‌లైన్ నెంబరు 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చెయాలని ఎస్పీ రాధిక సూచించారు. సైబర్ పోలీసులు వెంటనే ప్రజల ఫిర్యాదును తీసుకుని మోసగాళ్లను పట్టుకునే చర్యలు చేపడతారన్నారు. అలాగే పోయిన నగదును కూడా రికవరీ చేసే అవకాశం ఉందని తెలిపారు. 1930కి చేలేకపోతే సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. సైబర్‌క్రైం.జీవోవీ. ఇన్‌లో ఫిర్యాదు చేయాలని స్పష్టం చేశారు.