Share News

Bankers Cooperation జిల్లా ప్రగతికి బ్యాంకర్ల సహకరించాలి

ABN , Publish Date - Dec 27 , 2024 | 12:05 AM

Bankers loan target జిల్లా ఆర్థిక ప్రగతిలో బ్యాంకర్ల భాగస్వామ్యం, సహకారం ఎంతో అవసరమని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాస్థాయి సమీక్ష మండలి సమావేశం నిర్వహించారు.

Bankers Cooperation జిల్లా ప్రగతికి బ్యాంకర్ల సహకరించాలి
మాట్లాడుతున్న జెసి ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌

  • జిల్లా ప్రగతికి బ్యాంకర్ల సహకరించాలి

  • రుణాల లక్ష్యాలు అధిగమించేలా చర్యలు

  • కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

    శ్రీకాకుళం కలెక్టరేట్‌, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): జిల్లా ఆర్థిక ప్రగతిలో బ్యాంకర్ల భాగస్వామ్యం, సహకారం ఎంతో అవసరమని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాస్థాయి సమీక్ష మండలి సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. వివిధ స్వయం ఉపాధి పథకాల అమలు, రుణాల మంజూరు, గత త్రైమాసికంలో సాధించిన ప్రగతిపై బ్యాంకులు, ప్రభుత్వ శాఖల వారీగా సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అర్హులకు రుణాలు మంజూరు చేసేలా బ్యాంకులు ప్రణాళికలు రూపొందించాలి. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్‌ లావాదేవీలు మరింత బలోపేతం చేయాలి. బడుగు, బలహీనవర్గాల ప్రజలు ఆర్థికంగా బలపడేందుకు ప్రభుత్వ పథకాలతోపాటు పంట రుణాలు, విద్యా రుణాలు లక్ష్యం మేరకు పూర్తి చేయాలి. ముఖ్యంగా జిల్లా జీడీపీ అభివృద్ధికి పారిశ్రామిక రంగ అభివృద్ధే కారణం. ఇందుకు బ్యాంకర్లు పూర్తి సహకారం అందించాలి. రానున్న మూడు నెలల్లో కచ్చితమైన ప్రగతిని చూపించాల’ని ఆదేశించారు. జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ మాట్లాడుతూ ‘కౌలు రైతులు నష్టపోకుండా వీలైనంత వేగంగా గుర్తింపు కార్డులను పంపిణీ చేయాలి. అర్హులందరికీ కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు జారీ చేయాలి. పీఎం సూర్యఘర్‌ పథకానికి సంబంధించి ఎటువంటి ఆలస్యానికి తావు లేకుండా రుణాలు మంజూరు చేయాల’ని ఆదేశించారు. లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ సూర్యకిరణ్‌ మాట్లాడుతూ.. ‘జిల్లాలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రెండవ త్రైమాసికం, ఆగస్టు 30 నాటికి క్రెడిట్‌ ప్లాన్‌ లక్ష్యం రూ.12586.45కోట్లకుగాను రూ.9681.68 కోట్ల రుణాలు మంజూరు చేశాం. వ్యవసాయ రంగానికి సంబంధించి రూ.7744కోట్ల లక్ష్యానికిగాను, రూ.5878కోట్ల రుణాలు అందజేసి 75.9శాతం ఆర్థిక ప్రగతిని సాధించామ’ని తెలిపారు. పీఎం విశ్వకర్మ, పీఎం సూర్యఘర్‌, లక్‌పతి, దీదీ ఎడ్యుకేషన్‌ లోన్స్‌ మంజూరు తదితర అంశాలపై చేపడుతున్న పనులను వివరించారు. కార్యక్రమంలో లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ ఎం.సూర్యకిరణ్‌, రీజనల్‌ మేనేజర్‌ ఎంవీ తిలక్‌, ఆర్బీఐ ఏపీ రీజియన్‌ ఎల్డీవో గిరిధర్‌ బెహరా, డీసీసీబీ సీఈవో డి.వరప్రసాద్‌, నాబార్డు డీడీఎం కె.రమేష్‌కృష్ణ, ఉద్యాన, వ్యవసాయ, పశు సంవర్థక, మత్స్యశాఖ, డీసీసీబీ, వివిధ బ్యాంకులకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2024 | 12:05 AM