Share News

ప్రభుత్వ ఉపాధ్యాయుల బాహాబాహీ

ABN , Publish Date - Feb 06 , 2024 | 11:26 PM

ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠశాల తరగతిలోనే బాహాబాహీకి దిగిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది.

ప్రభుత్వ ఉపాధ్యాయుల బాహాబాహీ

- ఇరువురూ పోలీసులకు ఫిర్యాదు

- పెద్దరోకళ్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాల టీచర్ల తీరు

టెక్కలి రూరల్‌: ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠశాల తరగతిలోనే బాహాబాహీకి దిగిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వాగ్వాదంతో ప్రారంభమై చివరికి పోలీస్‌ స్టేషన్‌లో ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు దిగిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. పెద్ద రోకళ్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఆమదాలవలస ప్రాంతానికి చెందిన తమ్మినేని శ్రీనివాసరావు, టెక్కలికి చెందిన జి.శివానంద్‌ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహి స్తున్నారు. మంగళవారం పాఠశాల పనివేళల సమయంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి శ్రీనివాసరావుపై దాడి చేశారు. తనపై దాడి సహచర ఉపాధ్యాయుడు శివానంద్‌ ప్రోద్బలంతోనే జరిగిందని ఆరోపిస్తూ టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ నిమిత్తం శివానంద్‌ను స్టేషన్‌కు పిలిపించగా వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనపై శ్రీనివాసరావుతో పాటు కుటుంబసభ్యులు భౌతిక దాడికి పాల్పడ్డారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. శివానంద్‌ వారి నుంచి తప్పించుకుని పోలీస్‌స్టేషన్‌ లోపలకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో అప్పటికే ఫిర్యాదు చేసిన శ్రీనివాసరావు వర్గీయులు స్టేషన్‌లో పెద్ద కేకలు వేస్తూ సర్దిచెబుతున్న పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగారు. ఉద్దేశ పూర్వకంగానే శివానంద్‌.. పాఠశాలలో శ్రీనివాసరావుపై దాడి చేసేలా ప్రేరేపించాడని ఆరోపిస్తూ శ్రీనివాసరావు వర్గీయులు కొద్దిసేపు స్టేషన్‌లో హడావిడి చేశారు. అక్కడే ఉన్న ఎస్‌ఐ-1 కె.లక్ష్మితో పాటు సిబ్బంది వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా శ్రీనివాసరావు, ఆయన వర్గీయులు వాగ్వాదాన్ని కొనసాగించారు. ఇదిలా ఉండగా విచారణ నిమిత్తం స్టేషన్‌కు వచ్చిన తనపై శ్రీనివాసరావు వర్గీయులు దాడి చేశారని శివానంద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్టేషన్‌కు చేరుకున్న టెక్కలి రూరల్‌ సీఐ ఎస్‌.సూర్యచంద్రమౌళి ఘటనపై పూర్తిస్థాయిలో సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పరిశీలన చేపట్టి కేసు నమోదు చేయాలని ఎస్‌ఐకి సూచించారు. ఇరువురు ఉపాధ్యాయుల పరస్పర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ కె.లక్ష్మి తెలిపారు. ఇదిలా ఉండగా ఇటీవల పాఠశాలలో విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టి పలు అంశాలను పరిశీలించారు. ఇదే విషయమై టెక్కలి ఎంఈవో డి.చిన్నారావు వద్ద ప్రస్తావించగా.. ఎన్నికల విధులకు సంబంధించి శ్రీకాకుళంలో శిక్షణ హాజరవుతున్నామని, శిక్షణ అనంతరం పాఠశాలలో చోటుచేసుకున్న ఘటనపై విచారణ చేపడతామన్నారు. కాగా ఇరువురు ఉపాధ్యా యులు బుధవారం నుంచి విధులకు సెలవు పెట్టినట్టు సమాచారం.

Updated Date - Feb 06 , 2024 | 11:26 PM