Share News

అడుగుకోగొయ్యి

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:36 PM

జిల్లాలోని ఇచ్ఛాపురం, సోంపేట, నందిగాం మండలాల్లో రహదారులు దారుణంగా ఉన్నాయి. రోడ్లపై అడుగుకో గొయ్యి దర్శనమిస్తోంది. రోడ్ల నిర్వహణను వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది. ఐదేళ్లుగా కనీస మరమ్మతులకు నోచుకోలేదు. దీంతో కనీసం నడవడానికి కూడా వీలులేని విధంగా రోడ్లు తయారయ్యాయి. వీటిపై ఎలా ప్రయాణించేదని సీఎం జగన్‌ను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో గ్రామీణ ప్రాంతాలకు పక్కారోడ్లు వేస్తామన్న హామీని విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అడుగుకోగొయ్యి
రాళ్లు తేలిన ఉయ్యాలపేట రహదారి

జిల్లాలోని ఇచ్ఛాపురం, సోంపేట, నందిగాం మండలాల్లో రహదారులు దారుణంగా ఉన్నాయి. రోడ్లపై అడుగుకో గొయ్యి దర్శనమిస్తోంది. రోడ్ల నిర్వహణను వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది. ఐదేళ్లుగా కనీస మరమ్మతులకు నోచుకోలేదు. దీంతో కనీసం నడవడానికి కూడా వీలులేని విధంగా రోడ్లు తయారయ్యాయి. వీటిపై ఎలా ప్రయాణించేదని సీఎం జగన్‌ను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో గ్రామీణ ప్రాంతాలకు పక్కారోడ్లు వేస్తామన్న హామీని విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇచ్ఛాపురం

ఇచ్ఛాపురం మునిసిపాలిటీ, మండలం పరిధిలో పలు రహదారులు పెద్ద పెద్ద గోతులతో ప్రమాదాలకు నిలయంగా మారాయి. మునిసిపాలిటీలోని పలు వీధుల్లో దశాబ్దాల కిందట నిర్మించిన రోడ్లే నేటికీ దర్శనమిస్తున్నాయి. 14, 15వ ఆర్థిక సంఘ నిధులు సకాలంలో వినియోగించుకోక పోవడంతో వెనక్కి మళ్లి పోయాయి. అలాగే పలుచోట్ల రోడ్లపనులు చేపట్టినా బిల్లులు సకాలంలో అందడం లేదు. దీంతో మిగతాచోట్ల పనులను చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకురావడం లేదు.

ఫ మునిసిపల్‌ వైస్‌చైర్‌పర్సన్‌ ఉలాల భారతిదివ్య ఉంటున్న పకీర్‌పేట రహదారి గోతులమయమై అత్యంత ప్రమాదకరంగా మారింది. ఐదేళ్లుగా కనీస మరమ్మతులకు నోచుకోవడంలేదు.

ఫ కోర్టు జంక్షన్‌ నుంచి పకీరుపేట మీదుగా రైల్వేస్టేషన్‌కు వెళ్లే రోడ్డు అధ్వానంగా మారింది. ఈ రహదారి గుండా ప్రతిరోజూ వందలాది వాహనాలతోపాటు పాదచారులు, అధి కారులు, కార్మికులు, పరసర ప్రాంతాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. గోతులమయం కావడంతో రాత్రిపూట రైల్వేస్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు.

ఫ పట్టణ పరిధిలోని రత్తకన్నలో పలు వీధుల్లోని రోడ్లు ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోవడంలేదు. కస్పావీధి, కండ్రవీధి, గౌడ వీధి, కండ్రకాలనీ, అచ్చెంపేట రోడ్లు రాళ్లు తేలాయి.

ఫ డొంకూరు కాజ్‌వే బ్రిడ్జి రోడ్డు గోతులమయమై ప్రమాదకరంగా మారింది. ఇక్కడ గోతులు ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా కనీస మరమ్మతులు చేపట్టడంలేదు. ఇటీవల వాహన చోదకుల అవస్థలను గుర్తించిన జనసేన కార్యకర్తలు శ్రమదానం చేసి గోతులు పూడ్చారు.

ఫ పురుషోత్తపురం నుంచి కేదారిపురం, ముచ్చింద్ర, బెనుగానిపేట వరకు రోడ్డు అడుగడుగునా గోతులతో దర్శనమిస్తోంది. ఈ మార్గంలో ఇచ్ఛాపురంలోని కళాశాలలకు సైకిళ్లపై రాకపోకలు సాగిస్తున్న విద్యార్థులు, ద్విచక్రవాహన చోదకులు అవస్థలకు గురవుతున్నారు. గోతులతో సైకిళ్లు పంక్చర్లు కావటంతో కొన్నిసార్లు నడిపించుకుని పాఠశాలలకు వెళ్తున్నామని, తాతాల్కికంగా చేసిన రోడ్డు ప్యాచ్‌వర్క్‌ల్లో కూడా నాణ్యత లేకపోవడంతో వారంరోజులకే రాళ్లుఊడి పోతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు.

ఫ మండలంలోని కేదారిపురం, ముచ్చింద్ర, మండపల్లి, టి.బరంపురం, శాసనం, డొంకూరు, రహదారులు దారుణంగా ఉన్నాయి. ఈదుపురం నుంచి బూర్జపాడు వరకు ఉన్న రోడ్డు టీడీపీ ప్రభుత్వం హయాంలో అభివృద్ధి చేశారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఈ రోడ్డులో చిన్న చిన్న మరమ్మతులు సైతం చేయకపోవడంతో అవస్థలు తప్పడం లేదని వాహన చోదకులు చెబుతున్నారు.

ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోరా?

సోంపేట: జాతీయరహదారి నుంచి బేసిరామ చంద్రాపురం నుంచి బాతుపురం వరకు సుమారు 16 కిలోమీటర్ల రహదారి అడుగడుగునా గోతులతో దర్శనమిస్తోంది. బాతుపురం నుంచి సోంపేటకు నిత్యం వందలాది మంది రాకపోకలు సాగి స్తుంటారు. ప్రధాన రహదారిగా ఉన్న ఈ మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా కనీస మరమ్మతులకు చర్యలు తీసుకోవడంలేదు. గోతులతో ఒళ్లు హూనమవుతుందని, వాహనాలు పల్టీలు కొడుతున్నాయని వాహన చోదకులు వాపోతున్నారు. జాతీయ రహదారి నుంచి బేసిరామచంద్రాపురం మీదుగా బాతుపురం వరకు ఉన్న 15.8 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి రూ.30కోట్లతో ప్రతిపాదనలు పంపించినట్లు ఆర్‌అండ్‌బీ జేఈ మోహనరావు తెలిపారు.

శిలాఫలకాలు వేసి..పనులు మరచి..

(నందిగాం)

నందిగాంకు సుదూర ప్రాంతంలో ఉన్న ఉయ్యాలపేటకు పక్కా రహదారి కలగానే మిగిలింది. వరదలొస్తే ముంపు నకు గురయ్యే ఈ గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో ఇక్కట్లు తప్పడంలేదు. ముంపు సమయంలో బిక్కుబిక్కుమని బాహ్య ప్రపంచానికి దూరంగా కాలం గడుపుతున్న తమకు పాలకుల హామీలే తప్ప రోడ్డు నిర్మాణానికి నోచుకోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. రహదారి నిర్మాణానికి శిలాఫలకాలు ఆవిష్కరించి గ్రామస్థుల సత్కారాలు పొందిన తర్వాత మరిచిపోతున్నారు. పుష్కరకాలంలో మూడు శిలాఫలకాలు ఈ రహదారి నిర్మాణానికి మంత్రులు వేసినా పనులు జరగలేదు. 2012లో వరదల సమయంలో రెవెన్యూ సిబ్బందిని గ్రామస్థులు రహదారి కోసం నిర్బంధిస్తే అప్పటి కేంద్రమంత్రి డాక్టర్‌ కిల్లి కృపారాణి, అప్పటి రాష్ట్రమంత్రి ధర్మాన ప్రసాదరావు తుఫాన్‌ నిధులు మంజూరుచేసి శిలా ఫలకాలు వేశారు. కానీ పనులు జరగకపోవడంతో రహదారి కష్టాలు తప్పడంలేదు. 2018లో అప్పటి రాష్ట్రమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మరోసారి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసినా ప్రభుత్వం మారిపోవడంతో పనులు ముందుకుసాగలేదు. రహదారికి రక్షణగోడతో పాటు మెటల్‌ పరిచి పనులు చేశారు. తర్వాత పనులు పూర్తికాకపోవడంతో రాళ్లుతేలి వాహన చోదకులు, పాదచారులకు అగచాట్లు తప్పడంలేదు. దీంతో స్థానిక యువత ఈనెల ఏడో తేదీన దీపాలతో నిరసన ర్యాలీ చేపట్టి రహదారి నిర్మించే వరకు ఎన్నికలను బహిష్కరిద్దామని పిలుపునిచ్చారు.

Updated Date - Apr 26 , 2024 | 11:36 PM