Share News

ఎలుగుబంట్ల దాడి

ABN , Publish Date - Feb 01 , 2024 | 11:50 PM

వజ్రపుకొత్తూరు మండలం చీపురుపల్లి పంచాయతీలో ఎలుగుబంట్లు బీభత్సం సృష్టించాయి. గురువారం వేర్వేరు గ్రామాల్లో నలుగురిపై దాడి చేయగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

ఎలుగుబంట్ల దాడి
పలాసలో క్షతగాత్రులకు చికిత్స అందజేస్తున్న వైద్యులు

- నలుగురికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం

- చికిత్స పొందుతున్న క్షతగాత్రులు

- కుక్కల సహకారంతో తప్పించుకున్న మరో యువకుడు

వజ్రపుకొత్తూరు, ఫిబ్రవరి 1: వజ్రపుకొత్తూరు మండలం చీపురుపల్లి పంచాయతీలో ఎలుగుబంట్లు బీభత్సం సృష్టించాయి. గురువారం వేర్వేరు గ్రామాల్లో నలుగురిపై దాడి చేయగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కుక్కలు బిగ్గరగా అరవడంతో ఓ యువకుడు ఎలుగుల దాడి నుంచి తప్పించుకున్నాడు. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

- చీపురుపల్లి పంచాయతీ గడూరు గ్రామానికి చెందిన పిన్నాసి కుమారస్వామి(60), పిన్నాసి చలపతి గురువారం ఉదయం చేపలవేటకు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో జీడితోట వద్ద తల్లీ పిల్ల ఎలుగుబంట్లు కుమారస్వామిపై దాడిచేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సమయంలో చలపతితో పాటు అక్కడే ఉన్న కుక్కలు బిగ్గరగా అరవడంతో కుమారస్వామిని విడిచి ఎలుగుబంట్లు పారిపోయాయి. తర్వాత పిన్నాసి చలపతిరావు.. స్థానికుల సహకారంతో కుమారస్వామిని చికిత్స నిమిత్తం ఆటోలో పలాసలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తనతోపాటు కుక్కలు కూడా అరవడంతో తాను ఎలుగుబంట్ల దాడి నుంఇ బయటపడ్డానని చలపతిరావు తెలిపారు.

- డెప్పూరుకు చెందిన లైశెట్టి నారాయణమ్మ(65) తన జీడితోటలో కంచె వేస్తుండగా ఎలుగుబంట్లు దాడి చేశాయి. ఆమె తలపై తీవ్రంగా గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆమెను పలాస ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆమెను విశాఖ తరలించారు.

- డెప్పూరుకు చెందిన శీలం తాతారావు, పోకల ఊర్మిళ కూలి పనులకు వెళ్తుండగా ఎలుగుబంట్లు దాడి చేసేందుకు ప్రయత్నించాయి. వారు బిగ్గరగా అరుపులు పెట్టడంతో అవి జీడితోటల్లోకి పారిపోయాయి. దాడి నేపథ్యంలో వారి చేతులపై స్వల్పగాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి వెళ్లిపోయారు. జీడితోటలకు కంచె వేసేందుకుగానూ తాము చేతులకు గ్లౌజ్‌లు పెట్టుకుని వెళ్లడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డామని తాతారావు, ఊర్మిళ తెలిపారు. ఎస్‌ఐ మధుసూదనరావు, పారెస్టు అధికారులు ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. ఎలుగుదాడి ఘటనపై కేసు నమోదు చేశారు.

ఉద్దానంలో.. భయం.. భయం!

ఉద్దానం వాసులు ఎలుగుబంట్ల దాడులతో భయం భయంగా జీవనం సాగిస్తున్నారు. ఒకప్పుడు కొండలు, గుట్టలు అడవులకే పరిమితమైన ఎలుగుబంట్లు.. ఇప్పడు గ్రామాల్లోకి చొరబడి ప్రజలపై దాడి చేస్తున్నాయి ఇప్పటికే చాలామంది మృతి చెందగా.. కొందరు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉంది. గత ఏడాది వజ్రపుకొత్తూరు, కిడిసింగి గ్రామాల్లో ఎలుగు దాడి చేయగా ఐదుగురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవల అక్కుపల్లికి చెందిన లోకనాథం కూడా ఎలుగుబంటి దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. ఇలా తరచూ దాడులు జరుగుతూనే ఉన్నాయి. అటవీశాఖ అధికారులు అప్పుడప్పుడు మొక్కుబడిగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు తప్ప.. శాశ్వత పరిష్కారం చూపడం లేదని ఉద్దానం వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీరప్రాంతాల్లో మరింత పర్యవేక్షణ చేపట్టాలని, ఎలుగుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

కారణమేమిటంటే..

కొంతమంది నాయకులు తమ స్వార్థం కోసం కొండలను ఆక్రమించి.. అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. మరికొందరు రియల్‌ఎస్టేట్‌ పేరుతో తోటలు నరికించేస్తున్నారు. దీంతో కొండలు, తోటల్లో నివాసాలు కరువై.. ఎలుగుబంట్లు గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు. ఇటీవల బాతుపురంలో అటవీశాఖాధికారులు ఏర్పాటు చేసిన సమావేశంలోనూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే బాతుపురం పరిధిలో ఆరు ఎలుగుబంట్లు సంచరిస్తున్నట్టు సర్పంచ్‌ లక్ష్మీనారాయణ వెల్లడించారు. వాటి నుంచి తమకు రక్షణ కల్పించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. సిబ్బంది కొరత వల్ల పూర్తిస్థాయి పర్యవేక్షణ చేపట్టలేకపోతున్నామని అటవీ అధికారులు పేర్కొంటున్నారు.

Updated Date - Feb 01 , 2024 | 11:50 PM