వైసీపీ నాయకుడి వద్ద.. సచివాలయం తాళాలు
ABN , Publish Date - Jul 08 , 2024 | 11:43 PM
జి.సిగడాం మండలం పెంట గ్రామంలోని సచివాలయంలో స్థానిక వైసీపీ నాయకుడు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

- పట్టించుకోని అధికారులు
జి.సిగడాం, జూలై 8: జి.సిగడాం మండలం పెంట గ్రామంలోని సచివాలయంలో స్థానిక వైసీపీ నాయకుడు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వాస్తవానికి సచివాలయ తాళాలు.. అధికారులు, లేదా సిబ్బంది వద్ద ఉండాలి. కానీ, వైసీపీ నాయకుడి వద్దే సచివాలయ తాళాలు ఉండడంతో.. నిబంధనలకు విరుద్ధంగా అనధికార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వైఎస్ జయంతిని పురస్కరించుకుని సోమవారం ఉదయం అధికారులు రాకముందే సచివాలయంలో అనధికారికంగా వేడుకలు నిర్వహించారని పేర్కొంటున్నారు. వైసీపీ నాయకుడి వద్ద ఉన్న సచివాలయ తాళాలు తీసుకోవాలని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. అధికారులు పట్టించుకోకుండా మిన్నకుండిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై సచివాలయ సిబ్బందిని అడగ్గా.. తాము విధులకు వచ్చేసరికే వైఎస్సార్ చిత్రపటానికి నివాళి అర్పించినట్టు ఉందని తెలిపారు. ఎంపీడీవో వెంకన్నబాబు వద్ద ప్రస్తావించగా.. వైసీపీ నాయకుడి నుంచి సచివాలయ తాళాలు తీసుకునేలా చర్యలు చేపడతామన్నారు.