Share News

మలేరియాతో ఆశ్రమ విద్యార్థిని మృతి

ABN , Publish Date - Jul 08 , 2024 | 12:13 AM

మండలంలోని వెన్నెలవలస గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న బిడ్డిక రిస్మిత (8) మలేరియా జ్వరంతో శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందింది.

 మలేరియాతో ఆశ్రమ విద్యార్థిని మృతి
విద్యార్థులను ఆస్పత్రికి తీసుకెళ్తున్న దృశ్యం ఇన్‌సెట్లో రిస్మిత(ఫైల్‌)

-రిమ్స్‌లో చికిత్స పొందుతున్న మరో నలుగురు

-ఆందోళనలో తల్లిదండ్రులు

- సిబ్బంది నిర్లక్ష్యంపై డీఎంహెచ్‌వో ఆగ్రహం

సరుబుజ్జిలి, జూలై 7: మండలంలోని వెన్నెలవలస గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న బిడ్డిక రిస్మిత (8) మలేరియా జ్వరంతో శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందింది. మరో నలుగురు విద్యార్థినులు ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం అచ్చెబ గ్రామానికి చెందిన రిస్మిత మూడో తరగతిలో కొత్తగా చేరింది. ఇటీవల ఇంటికి వెళ్లి పాఠశాలకు వచ్చిన రిస్మితతో పాటు ఆరో తరగతి చదువుతున్న సవర ప్రభావతికి కూడా ఈ నెల 5న తీవ్ర జ్వరం వచ్చింది. దీంతో సిబ్బంది వారిని స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. వైద్య సిబ్బంది రక్తనమూనాలు సేకరించారు. మలేరియా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో వైద్యాధికారి సంతోష్‌కుమార్‌ సకాలంలో స్పందించి బాలికలను మెరుగైన చికిత్స కోసం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రిస్మిత మృతి చెందింది. ప్రభావతికి చికిత్స అందిస్తున్నారు. ఈ పాఠశాలలో చదువుతున్న 250 మంది విద్యార్థినులకు ఆదివారం రక్త పరీక్షలు చేశారు. వీరిలో ఆరో తరగతి విద్యార్థినులు సవర స్వప్న, కొండగొర్రె రిబి, సవర అంజలికి మలేరియా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో వైద్యులు వెంటనే రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పిల్లలు జ్వరాల బారినపడుతుండడంతో తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు.

డీఎంహెచ్‌వో ఆగ్రహం

గిరిజన బాలిక రిస్మిత మృతితో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి బొడ్డేపల్లి మీనాక్షి ఆదివారం ఉదయం ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. ఆ సమయంలో హెచ్‌ఎం, వార్డెన్‌, అధ్యాపకులు విధులకు హాజరుకాలేదు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వహించిన హెచ్‌ఎం, వార్డెన్‌, ఏఎన్‌ఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికలు అల్పాహారం మాత్రమే తీసుకున్నారు. అనంతరం విధులకు హాజరైన సిబ్బందిని ప్రశ్నించారు. పిల్లల అల్పాహారం సమయంలో కూడా లేకపోవడం మీ బాధ్యతరాహిత్యానికి నిదర్శనమన్నా రు. రాత్రివేళల్లో పూర్తిగా రక్షణ కొరవడినట్టు తెలుస్తుందన్నారు. పాఠశాల ఆవరణలో పారిశుధ్య లోపంపై ఆగ్రహించారు. పిల్లలు ప్లేట్లు, చేతులను శుభ్రం చేసుకొనే ప్రదేశంలో వ్యర్థాలను డ్రమ్ముల్లో నిల్వ చేయడం మంచి పద్ధతి కాదన్నారు. పిల్లలందరికీ వేడినీరు అందించాలని ఆదేశించారు. రిస్మిత మృతిపై కలెక్టర్‌కు నివేదిక అందిస్తానని తెలిపారు. ఆమె వెంట జిల్లా మలేరియా అధికారి సత్యనారాయణ, స్థానిక వైద్యులు సంతోష్‌కుమార్‌, సాహితీ, ప్రియ దర్శిని ఉన్నారు.

Updated Date - Jul 08 , 2024 | 12:13 AM