Share News

ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , Publish Date - May 17 , 2024 | 12:00 AM

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జేసీ నవీన్‌తో కలిసి.. ఆర్వోలు, నోడల్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు
మాట్లాడుతున్న కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌

- ఎన్నికల నిర్వహణలో ప్రజల సహకారం మరువలేనిది

- జిల్లా ఎన్నికల అధికారి మన్‌జీర్‌ జిలానీ సమూన్‌

కలెక్టరేట్‌, మే 16: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జేసీ నవీన్‌తో కలిసి.. ఆర్వోలు, నోడల్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. అంకితభావం, సమన్వయంతో పనిచేయడం వలన జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందంటూ అధికారులను, సిబ్బందిని అభినందించారు. ఎన్నికల నిర్వహణలో జిల్లా ప్రజల సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. జేసీ నవీన్‌ను ప్రత్యేకంగా అభినందిస్తూ.. ఆయన సేవలను కొనియాడారు. అనంతరం ఓట్ల లెక్కింపునకు సంబంధించి పలు ఆదేశాలు జారీచేశారు. ‘జూన్‌ 4న శివానీ కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నాం. స్ర్టాంగ్‌రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత.. పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశాం. కౌంటింగ్‌కు సంబంధించి సిబ్బంది ఎంపిక, శిక్షణ పూర్తిచేయాల్సి ఉంది. కౌంటింగ్‌ కేంద్రాల్లో టేబుళ్ల ప్లాన్‌ పక్కాగా నిర్వహించాలి. ఎన్నికల కమిషన్‌ సూచన మేరకు ప్రతీ టేబుల్‌లో మైక్రో అబ్జర్వర్‌, కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌, ఇద్దరు అసిస్టెంట్లు ఉండాలి. సిబ్బందికి, ఏజెంట్లకు ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించాలి’ అని కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో ఎం.గణపతిరావు, ఆర్వోలు నూరుల్‌ కమర్‌, భరత్‌నాయక్‌, సీహెచ్‌.రంగయ్య, లక్ష్మణమూర్తి, రామ్మోహన్‌, సుదర్శన దొర, అప్పారావు, జడ్పీ సీఈవో వేంకటేశ్వరరావు, సీపీవో ప్రసన్నలక్ష్మి, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ సూర్యకిర్‌ణ్‌, జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి కె.చెన్నకేశవరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 17 , 2024 | 12:00 AM