Arasavalli: ఆదిత్యా.. చూసితివా?
ABN , Publish Date - Dec 28 , 2024 | 11:52 PM
Arasavalli is not development అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం అభివృద్ధికి నోచుకోవడం లేదు. దేవస్థానానికి రూ.కోట్లలో ఆదాయం వస్తున్నా ఆ స్థాయిలో సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా మాస్టర్‌ప్లాన్ అంటూ హడావుడి చేయడమే తప్ప.. అభివృద్ధికి మాత్రం అడుగులు పడడం లేదు. ఇక్కడ కనీస సదుపాయాలు కరువయ్యాయి.

ఆదాయం ఉందిగానీ అభివృద్ధి లేదు
ప్రసాదాల తయారీలో తగ్గుతున్న నాణ్యత
కేశఖండన శాల వద్ద అక్రమ వసూళ్లు
భక్తులకు తప్పని అవస్థలు
అరసవల్లి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి):
ఎచ్చెర్ల మండలం భగీరథపురం పంచాయతీ ఓ అగ్రహారం గ్రామానికి చెందిన వనుము కృష్ణ ఇటీవల తన కుటుంబంతో సహా అరసవల్లికి వచ్చాడు. తలనీలాలు సమర్పించేందుకు కేశఖండన శాలలో ఇద్దరికి టిక్కెట్లు తీసుకున్నాడు. ఒక్కొక్కరికి రూ.40 చొప్పున రూ.80 తీసుకోవాలి. కానీ అతని వద్ద రూ.100 తీసుకుని రెండు టిక్కెట్లు ఇచ్చారు. అనంతరం క్షురకులు కూడా ఇద్దరికి గుండు చేసేందుకు రూ.100 వసూలు చేశారు. అతను మొత్తంగా రూ.200 చెల్లించాల్సి వచ్చింది. దీంతో ఎంతో ఆవేదనకు గురయ్యాడు. ఎప్పుడు ఈ పరిస్థితులు మారతాయో అని ఆవేదన వెలిబుచ్చాడు.
...........................
అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం అభివృద్ధికి నోచుకోవడం లేదు. దేవస్థానానికి రూ.కోట్లలో ఆదాయం వస్తున్నా ఆ స్థాయిలో సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా మాస్టర్‌ప్లాన్ అంటూ హడావుడి చేయడమే తప్ప.. అభివృద్ధికి మాత్రం అడుగులు పడడం లేదు. ఇక్కడ కనీస సదుపాయాలు కరువయ్యాయి. స్నానాల గదులు లేకపోవడంతో ఆరుబయటే కుళాయిల కింద చేయాలి. దుస్తులు సైతం బయటే మార్చుకోవాలి. మరుగుదొడ్లు ఉన్నా లోపల దుర్వాసన భరించలేం. అన్న ప్రసాదం, లడ్డూ, పులిహోరలో నాణ్యత కొరవడింది. ఈ ప్రసాదం కూడా ఉదయం ఒక్క పూటే దొరుకుతుంది. మధ్యాహ్నం వెళ్లేవారికి నిరాశే. కేశఖండన శాలకు వెళ్తే నిలువు దోపిడీ. దీంతో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఆదివారం వచ్చిందంటే నరకం చూస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా పరిస్థితిలో మార్పురావడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇరుకు మార్గం..
ప్రతీ ఆదివారం వేల సంఖ్యలో భక్తులు ఆదిత్యుడి దర్శనానికి వస్తుంటారు. వారు దర్శనానికి వెళ్లేందుకు, తిరిగి వచ్చేందుకు ఆలయం ఎదురుగా ఇరుకు మార్గం ఒక్కటే ఉంది. ఆ ఇరుకు మార్గంలోనే యాచకుల హడావుడి. దానికితోడు భక్తులు ద్విచక్ర వాహనాలపై అదే దారిలో ముందుకు వెళ్లి అక్కడే పార్కు చేస్తున్నారు. దీనివల్ల ఇబ్బందులు తప్పడం లేదు. తలనీలాల ప్రదేశం వద్ద, భక్తులు స్నానాలు ఆచరించే చోట కుక్కల బెడద అధికంగా ఉంది. గతంలో పలువురు భక్తులను కుక్కలు గాయపరిచాయి. మరుగుదొడ్ల పరిస్థితి అయితే చెప్పనక్కరలేదు. లోపల అధ్వానంగా ఉండి దుర్వాసన వెదజల్లుతున్నాయి. దీంతో భక్తులు ముక్కు మూసుకుని వినియోగించాల్సి వస్తోంది.
తగ్గుతున్న అన్నప్రసాదం నాణ్యత
కొంత కాలంగా స్వామి అన్నప్రసాదం నాణ్యత తగ్గుతోందని, భోజనాలు బాగోవడం లేదని భక్తులు వాపోతున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన జూనియర్ అసిస్టెంట్ ఆధ్వర్యంలో రుచికరంగా అన్నప్రసాదం తయారు చేసేవారు. బియ్యం, పప్పులు నాణ్యతమైనవి వినియోగించేవారు. ప్రస్తుతం నాశిరకం బియ్యం, పప్పులే వినియోగిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. నిజానికి ఒక భక్తుడి భోజనం కోసం రూ.50చొప్పున కేటాయిస్తున్నారు. ఈ డబ్బులతో నాణ్యమైన భోజనం అందించవచ్చు. కానీ, సిబ్బంది చేతివాటంతో నాణ్యత లోపిస్తుందని భక్తులు ఆరోపిస్తున్నారు. గతంలో భోజనంలో పప్పు, రసం ఉండేవి. ఇప్పుడు ఒక్క సాంబారు మాత్రమే వడ్డిస్తున్నారని పేర్కొంటున్నారు.
లడ్డూలో నెయ్యి, జీడిపప్పు మాయం
లడ్డూ తయారీలో నాణ్యత పూర్తిగా దిగజారిపోయిందని భక్తులు వాపోతున్నారు. గతంలో నెయ్యి, జీడిపప్పు, కిస్‌మిస్ వేసి చేసిన లడ్డూలు ఎంతో రుచిగా ఉండేవి. ప్రస్తుతం లడ్డూలో నెయ్యి, జీడిపప్పు ఆనవాళ్లు పెద్దగా కనిపించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. పులిహోర ప్రసాదం కూడా రుచి తగ్గింది. నిజానికి పులిహోర ఒక్కో ప్యాకెట్ 150 గ్రాముల పరిమాణంతో ఉండాలి. కానీ, తక్కువ పరిమాణంలో తయారుచేస్తున్నారు. ఈ ప్రసాదాలు కూడా సరిపడినంత తయారుచేయడం లేదు. మధ్యాహ్నం పూట వచ్చిన భక్తులకు ప్రసాదాలు అందుబాటులో ఉండడం లేదని పలువురు వాపోతున్నారు.
కేశఖండన శాలలో నిలువు దోపిడీ
కేశఖండన శాలలో భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ఇద్దరు భక్తులు గుండు గీయించుకోవాలంటే రూ.200 ఖర్చు చేయాల్సి వస్తోంది. టిక్కెట్ల కోసం రూ.100, క్షురకులకు రూ.100 చెల్లిస్తేనే తలనీలాలు తీస్తారు. భక్తుల ఫిర్యాదుతో అధికారులు పలుమార్లు క్షురకులు, సిబ్బందిని హెచ్చరించినా.. వారి పనితీరులో మార్పులేదు. ఆదివారం ఈ అక్రమ వసూళ్ల దందా యథావిధిగా కొనసాగుతోంది. ఆలయ సమస్యలపై అధికారులకు ఫిర్యాదులు చేసినా పరిస్థితుల్లో ఎటువంటి మార్పు లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.