Share News

ధరల స్థిరీకరణ ఏదీ?

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:12 PM

‘అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వమే మద్దతు ధరకు పంట ఉత్పత్తులు కొనుగోలు చేస్తుంది. దళారుల ప్రమేయం ఉండదు. వ్యాపారుల కృత్రిమ కొరత ఉండదు. రైతులు, వినియోగదారులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.’ అని గత ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నాయకుని హోదాలో సీఎం జగన్‌ ప్రకటించారు. అయితే పాలనా పగ్గాలు చేపట్టి ఐదేళ్లు గడిచినా.. ఇంతవరకు ఆ దిశగా ప్రయత్నాల్లేవు. దీంతో రోజురోజుకూ నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

ధరల స్థిరీకరణ ఏదీ?

-(నరసన్నపేట)

ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పోలాకి గ్రామానికి చెందిన గడ్డెయ్య. ఓ విద్యాసంస్థలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. గతంలో నెలకు రూ.10వేలు ఆదాయం వస్తే ఇంటిల్లాపాది గడిచేది. ప్రస్తుతం జీతం రూ.13వేలు అయినా కుటుంబాన్ని పోషించేందుకు చాలడం లేదు. నిత్యావసరాల ధరలతో పాటు పెట్రోలు, గ్యాస్‌, విద్యుత్‌ చార్జీలు పెరగడంతో ఇళ్లు గడవడమే కష్టంగా మారిందని గడ్డెయ్య వాపోతున్నాడు. ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలకు కళ్లెం వేస్తే.. తనలాంటి సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు కడుపు నిండా బువ్వ తినవచ్చునని గడ్డెయ్య చెబుతున్నాడు.

మింగుడుపడని మెతుకులు

బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. నాణమైన బియ్యం కిలో రూ. 60 నుంచి రూ.70 చెల్లిస్తే గాని దొరికే పరిస్థితి లేదు. ఐదేళ్లుగా బియ్యం ధరలు పెరుగుతున్నా కళ్లెం వేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. దీంతో పేదలు అటు రేషన్‌ బియ్యం పొందలేక, ఇటు మార్కెట్‌లో కొనుక్కోలేక అన్నమో... రామచంద్రా.! అంటూ అర్ధాకలితో అలమట్టిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బియ్యం (సామాన్య రకం) కిలో రూ.25 ఉండేది. అప్పట్లో రైతుల నుంచి సామాన్య రకం ధాన్యం క్వింటా రూ.1680కు కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం బియ్యం (సామాన్య రకం) కిలో రూ.45 ఉండగా, రైతుల నుంచి ధాన్యం క్వింటా రూ.2,100కు కొనుగోలు చేస్తున్నారు. రైతుల నుంచి ధాన్యం తక్కువ ధరకు కొనుగోలు చేసినా బయట మార్కెట్‌లో బియ్యం ధరలు 80శాతం మేరకు పెరిగాయి. ఇక సన్న బియ్యం అయితే ఐదేళ్ల కిందట రూ. 40 ఉండగా ప్రస్తుతం రూ. కిలో 60కు చేరింది. 26 కిలోల సోనా మసూరీ బియ్యం బస్తా ధర రూ.1100 నుంచి ఏకంగా రూ. 1600కు పెరిగింది.

ఉడకని పప్పులు

పప్పుల ధరలు ప్రస్తుతం మార్కెట్లో మోతెక్కిస్తోన్నాయి. ఐదేళ్ల కిందట రూ.120 ఉన్న కిలో కందిపప్పు ఇప్పుడు రూ.180కు చేరింది. ఇది మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. మినప్పప్పు గతంలో కిలో రూ.90కు లభ్యమయ్యేది. ఇప్పుడది మార్కెట్‌లో రూ.160 పలుకుతోంది. రైతుల నుంచి వ్యాపారులు మినుములను కిలో రూ.67 కొనుగోలు చేస్తున్నా.. పప్పు ధరలు మాత్రం కిలో రూ.180కు చేరింది. ఇక సామాన్యులకు ఎప్పుడూ అందుబాటులో ఉండేది శనగపప్పు ధరలు కూడా ప్రస్తుతం అమాంతం పెరిగాయి. కిలో శనగపప్పు గతంలో రూ.65కు విక్రయించేవారు. ప్రస్తుతం రూ.120కు చేరింది.

కాగుతున్న నూనెలు

వంట నూనెల ధరలు సలసల కాగుతున్నాయి. మార్కెట్‌లో అత్యధికంగా వినియోగించే ఫామాయిల్‌ ధర భగ్గుమంటోంది. ఆయిల్‌ ప్యాకెట్‌ రూ.100కు చేరింది. గతంలో అదే నూనె మార్కెట్‌లో రూ.80కు లభ్యమయ్యేది. దీని ప్రభావం ఇతర వంట నూనెలపైనా పడింది. సన్‌ ఫ్లవర్‌ ప్యాకెట్‌ రూ.100 నుంచి రూ.120కు, వేరుశెనగ రూ.190 నుంచి రూ.240కు చేరింది. నువ్వుల నూనె కిలో రూ.400 వరకు పలుకుతుండడంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు.

కూరగాయలదీ అదే దారి

పప్పు దినుసుల ధరలతో కూరగాయల ధరలు పోటీపడుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో బీర కాయలు కిలో రూ.40, వంకాయిలు రూ.60, దొండకాయలు రూ.30, క్యారెట్‌ రూ.50, టామాటో రూ.30, బంగాళదుంప రూ.30, ఆకుపచ్చ బటానీలు రూ.70, క్యాప్సికమ్‌ రూ.80, పచ్చిమిర్చి రూ.50, అల్లం రూ.80, వెల్లుల్లి రూ.200, పిక్కతీసిన చింతపండు రూ.170, ఎండుమిర్చి రూ.220 పలుకుతున్నాయి. బెల్లం, ఆవాలు, జీలకర్ర, చిలగడదుంప, గుమ్మడికాయ, తదితర ధరలు వేడెక్కాయి.

కొండెక్కిన కోడి

కోడి ధరలు కొండెక్కాయి. గతేడాది ఇదే సీజన్‌లో చికెన్‌ కిలో రూ.150 ఉండగా ఈ ఏడాది రూ.220కు చేరింది. స్కిన్‌లెస్‌ రూ.250 పలుకుతోంది. చేపలు ధరలు కూడా ఇలాగే ఉన్నాయి. కిలో రూ.200కు విక్రయిస్తున్నారు. సముద్రపు చేపలు మార్కెట్‌లోకి తక్కువుగా రావడంతో చెరువు చేపలకు గిరాకీ ఏర్పడింది. గతంలో బంగారుపాప రకం కిలో రూ.140 ఉండగా ప్రస్తుతం రూ.200కు చేరింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బియ్యం ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.

ధరలను నియంత్రించాలి

పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను ప్రభుత్వమే నియంత్రించాలి. సామాన్యులకు అందనంత ఎత్తుకు నిత్యావసరాల ధరలు పెరగుతున్నాయి. ధరల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.

-బమ్మిడి పద్మావతి, గృహిణి, నరసన్నపేట

ప్రభుత్వం విఫలమైంది

నిత్యావసరాల ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైంది అందుకు ధరలు పెరుగుదలే నిదర్శనం. పేద, మధ్యతరగతి కుటుంబాలకు బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు, శనగలను ప్రభుత్వమే రేషన్‌ డిపోల ద్వారా పంపిణీ చేయాలి

-జల్లు చంద్రమౌళి, ఉర్లాం

Updated Date - Apr 25 , 2024 | 11:13 PM