Share News

మరో చెరవు!

ABN , Publish Date - May 23 , 2024 | 11:42 PM

అది పోరంబోకు స్థలమని అధికారులు నిర్ధారించారు. హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేశారు. అధికార పార్టీ నేతలు కదా.. ఆ దర్పంతో వారు బోర్డును తొలగించారు.

మరో చెరవు!
94 సర్వే నెంబర్‌లో చేపట్టిన అక్రమ నిర్మాణాలు

అది పోరంబోకు స్థలమని అధికారులు నిర్ధారించారు. హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేశారు. అధికార పార్టీ నేతలు కదా.. ఆ దర్పంతో వారు బోర్డును తొలగించారు. ఆ స్థలం ఆక్రమించేందుకు యత్నించారు. అధికారులు మళ్లీ జోక్యం చేసుకోవడంతో అప్పటికి మిన్నకుండిపోయారు. ఇప్పుడంతా యంత్రాంగం ఎన్నికల విధుల్లో నిమగ్నమైంది. అంతే.. అక్రమార్కులు ఇదే అదనుగా భావించారు. 20 సెంట్ల స్థలంలో గదుల నిర్మాణం చేపట్టారు. మరికొందరు ఎకరా పది సెంట్ల చెరువు గర్భాన్ని చదును చేసి ఆక్రమణకు సిద్ధమయ్యారు.
- శ్రీకాకుళం క్రైం


ఖాళీ స్థలం కనిపిస్తే చాలు.. కొందరు వైసీపీ నేతలు అక్కడ వాలిపోతున్నారు. కబ్జాకు తెగబడుతున్నారు. తమ అనుచరులనో... బంఽధువులనో రంగంలోకి దింపుతున్నారు. చెరువు గర్భంలో ఉన్న భూమైతే ఇంక అడగనవసరం లేదు. మొన్న సింగుపురం చెరువు అన్యాక్రాంతం ఉదంతం మరువక ముందే.. తండేంవలస గ్రామంలో ఉన్న చెరువు గర్భాన్ని ఆక్రమించిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం రూరల్‌ మండలం తండేంవలసలోని సర్వే నెంబర్‌ 94లో చెరువు గర్భం (డి-పట్టా) భూమిని స్థానిక వైసీపీ నేత అండదండలతో ఆక్రమణలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ భూమిని గత ఏడాది కొంతమంది ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో గ్రామస్థులు దీనిపై తహసీల్దార్‌కు, సచివాలయ అధికారులకు, కలెక్టర్‌ స్పందనకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. తహసీల్దార్‌ వెంకటరావు, అప్పటి ఆర్డీవో శాంతి తండేంవలసలో పర్యటించి.. చెరువు గర్భం ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. అది పోరంబోకు స్థలమని.. ఎవరూ ఆక్రమించకూడదని హెచ్చరిస్తూ 2023 జూన్‌లో బోర్డును ఏర్పాటు చేశారు. అదే ఏడాది నవంబరు నెలలో ఆ హెచ్చరిక బోర్డును కొందరు తొలగించి.. మరోసారి ఆక్రమణకు ఉపక్రమించారు. అప్పుడు అధికారులు కలుగజేసుకోవటంతో ఆక్రమణలు నిలిచిపోయాయి. ఇటీవల సచివాలయ సిబ్బంది, రెవెన్యూ అధికారులు ఎన్నికల విధులలో ఉండడాన్ని గమనించి అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు సర్వే నెంబర్‌ 94లో 10 నుంచి 20 సెంట్ల స్థలంలో గదుల నిర్మాణం చేపట్టారు. మరికొందరు అదే సర్వే నెంబర్‌లో ఎకరా పది సెంట్లు చెరువు గర్భాన్ని చదును చేసి ఆక్రమణకు సిద్ధమయ్యారు. దీంతో గ్రామస్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

లీజు పేరుతో...
సర్వే నెంబర్‌ 94లో కొంత భూమి దళితుల సాగులో ఉంది. ఆ భూమిని కొందరు వారి నుంచి 99 ఏళ్లకు లీజు పేరుతో తీసుకుంటూ ఒప్పందం చేసుకున్నారు. వారి నుంచి కొనుగోలు చేసినట్లు పత్రాలు సిద్ధం చేసుకున్నారు. దళితుల సాగులో ఉన్న భూమి అమ్మకానికి గానీ లీజుకు తీసుకోవ డానికీ కానీ చెల్లదు. కానీ కొందరు లీజు ఒప్పందం రాయిం చుకున్నారు. ఇలా కొంత భూమి ఆక్రమణకు గురైంది.

నోటీసులు అందినా...
తండేంవలసలో 94 సర్వే నెంబర్‌లో భూ ఆక్రమణకు పాల్పడిన బెండి నిర్మల, సాధు చిన్నారావు, సాధు మల్లేసులకు సచివాలయ సెక్రటరీ సుప్రజ ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. వారు ఆ నోటీసులను భేఖాతరు చేస్తూ ఆక్రమ నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. స్థానికంగా ఉన్న వైసీపీ నేత ప్రోత్సాహంతో భూ ఆక్రమణ కొనసాగుతోంది.


వాస్తవమే..
తండేంవలసలో సర్వే నెంబర్‌ 94లో ఉన్న పోరంబోకు, చెరువు గర్భం భూములను కొందరు ఆక్రమించుకోవడం వాస్తవమేనని ఈవో పీఆర్‌డీ ప్రకాశరావు తెలిపారు. గతం లో తహశీల్దారు సహకారంతో అక్కడ నోటీ సు బోర్డు పెట్టామని చెప్పారు. ఇప్పటికే ఆక్రమణ దారులకు నోటీసులు జారీ చేశామని తెలిపారు. న్యాయస్థానం పరిధిలో ఉన్నప్పటికీ కొందరు ఆక్రమణదా రులు భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని వివరించా రు. రెవెన్యూ అధికారులు గ్రామంలో పోరంబోకు, శ్మశాన స్థలం, చెరువు గర్భాలను గుర్తించి... వాటి వివరాలు అందించాల్సి ఉందని చెప్పారు.

చెరువు గట్టుపై అక్రమ నిర్మాణాలు..
- పట్టని ఈవో, పంచాయతీ కార్యాలయ సిబ్బంది
- తొలగించకుంటే ఉద్యమిస్తాం: టీడీపీ నాయకులు
నరసన్నపేట, మే 23: స్థానిక సంతతోట పల్లిపేట రోడ్డులో స్నానాలు రేవు వద్ద చెరువు గట్టును కొందరు ఆక్రమించారు. రాత్రి సమయంలో భవనాల నిర్మాణం చేపడుతున్నారు. అధికార పార్టీ నాయకులు అండదండలతోనే ఈ వ్యవహారం నడుస్తోందన్న విమర్శలు ఉన్నాయి. అక్కడ కొందరు పేదలు గుడిసెలు వేసుకుని ఉంటే.. వారి నుంచి ఆ ప్రాంతాన్ని కొందరు అధికారపార్టీ నాయకులు బలవంతంగా తీసుకుని నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈవో, పంచాయతీ అధికారులకు ఈ నిర్మాణాలపై ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. స్నానాల రేపు వద్ద అక్రమ నిర్మాణాలను తొలగించకుంటే ఉద్యమిస్తామని తెలుగుయువత నాయకులు రావాడ గణపతిరావు, చలపాక మల్లేశ్వరరావు హెచ్చరించారు. కొందరు అధికారులు అధికారపార్టీ నాయకులకు కొమ్ముకాస్తున్నారని టీడీపీ నాయకుడు గణపతిరావు అన్నారు. ఈవిషయమై తహసీల్దార్‌ కనకరావు వద్ద ప్రస్తవించగా అక్రమ నిర్మాణాల విషయం తన దృష్టికి రాలేదన్నారు.

Updated Date - May 23 , 2024 | 11:42 PM