Share News

కదం తొక్కిన అంగన్‌వాడీలు

ABN , Publish Date - Jan 03 , 2024 | 11:57 PM

అంగన్‌వాడీ కార్యకర్తలు మరోసారి కదంతొక్కారు. 23 రోజులుగా సమ్మె చేస్తున్నా, ప్రభుత్వం మొండివైఖరి వీడడం లేదు. మరోవైపు అధికారుల బెదిరింపులకు నిరసనగా అంగన్‌వాడీలు వేలాదిగా తరలివచ్చి బుధవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు.

కదం తొక్కిన అంగన్‌వాడీలు
కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు

- వేలాదిగా తరలివచ్చి కలెక్టరేట్‌ ముట్టడి

- బెదిరింపులకు భయపడం

- డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాడతామని స్పష్టం

కలెక్టరేట్‌, జనవరి 3: అంగన్‌వాడీ కార్యకర్తలు మరోసారి కదంతొక్కారు. 23 రోజులుగా సమ్మె చేస్తున్నా, ప్రభుత్వం మొండివైఖరి వీడడం లేదు. మరోవైపు అధికారుల బెదిరింపులకు నిరసనగా అంగన్‌వాడీలు వేలాదిగా తరలివచ్చి బుధవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. బెదిరింపులకు భయపడేది లేదని, డిమాండ్లు పరిష్కరించే వరకూ పోరాడతామని స్పష్టం చేశారు. హామీల అమలుకు, సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్‌ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు కె.కళ్యాణి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీలకు వేతనాలు పెంచాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని తదితర డిమాండ్లతో వేలాదిమంది కలెక్టరేట్‌ వద్ద రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రాలను తెరవకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని అధికారులు బెదిరించడం తగదని పేర్కొన్నారు. కేంద్రాల తాళాలు పగులకొట్టడం, నోటీసులు ఇవ్వడం, నిర్బంధాలకు పాల్పడడం దారుణమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న 164 సూపర్‌వైజర్‌ పోస్టులను భర్తీ చేయాలని, లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులను సరఫరా చేయాలని, మెనూ ఛార్జీలను పెంచాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి చౌదరి రవీంద్ర, ఎస్‌.కిషోర్‌కుమార్‌, పి.అప్పారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌.ప్రసాద్‌, జి.సింహాచలం, ఎస్‌ఎఫ్‌ఐ పలు సంఘాలు అంగన్‌వాడీలకు మద్దతు తెలిపాయి. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు భవిరి కృష్ణమూర్తి, కె.శ్రీనివాసు, అల్లు మహాలక్ష్మి, ఎన్‌వీ.రమణ, ఎస్‌.లక్ష్మీనారాయణ, అల్లు సత్యనారాయణ, ఎన్‌.గణపతి, ఈశ్వరరావు, ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఎన్‌.హైమవతి, పి.లతాదేవి, జె.కాంచన, కె .సుజాత, ఆదిలక్ష్మి, శాంతామణి, మాధురి, లక్ష్మి, హేమ, బి.సింహాచలం, సరోజిని, భాగ్యలక్ష్మి, జ్యోతి, రాణి, ఎం.శారద, రాజేశ్వరి, జ్యోతిలక్ష్మి, విజయలక్ష్మి, బి.రాధిక, కె.లలిత పాల్గొన్నారు.

Updated Date - Jan 03 , 2024 | 11:57 PM