Share News

రాత్రంతా నేలబావిలోనే..

ABN , Publish Date - Jan 03 , 2024 | 11:17 PM

టెక్కలి ఆదిఆంధ్రావీధికి చెందిన ఉర్జాన శంకర్‌రావు(బుడ్డు) అనే 40 ఏళ్ల వ్యక్తి ప్రమాదవశాత్తు వీరరామకృష్ణాపురం గ్రామంలోని నేలబావిలో జారిపడ్డాడు. మంగళవారం రాత్రంతా నేలబావిలోనే బిక్కుబిక్కుమంటూ గడిపాడు.

రాత్రంతా నేలబావిలోనే..
నేలబావిలో పడిన శంకర్‌రావు

- ప్రమాదవశాత్తు నూతిలో పడిన వ్యక్తి

- బిక్కుబిక్కుమంటూ గడిపిన వైనం

- 17 గంటల తర్వాత క్షేమంగా బయటకు..

టెక్కలి రూరల్‌, జనవరి 3: చుట్టూ చీకటి. ఓ వైపు విపరీతమైన మంచు. మరోవైపు ఎముకలు కొరికే చలి. అంతటా నిశ్శబ్దం. కాపాడండి.. కాపాడండి అని కేకలు వేస్తున్నా.. ఎవరికీ వినిపించని వైనం. ప్రాణాలతో బయటపడతానో లేదోనన్న కలవరం. ఇదీ.. ప్రమాదవశాత్తు నేలబావిలో పడిన ఓ వ్యక్తి భయాందోళన. సుమారు 17 గంటల పాటు బావిలోనే బిక్కుబిక్కుమంటూ గడిపి.. చివరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహకారంలో ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలివీ.

టెక్కలి ఆదిఆంధ్రావీధికి చెందిన ఉర్జాన శంకర్‌రావు(బుడ్డు) అనే 40 ఏళ్ల వ్యక్తి ప్రమాదవశాత్తు వీరరామకృష్ణాపురం గ్రామంలోని నేలబావిలో జారిపడ్డాడు. మంగళవారం రాత్రంతా నేలబావిలోనే బిక్కుబిక్కుమంటూ గడిపాడు. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో వీరరామకృష్ణాపురంలోని తోటల్లోకి వెళ్లగా.. అక్కడ నేలబావిని గమనించకపోవడంతో ప్రమాదవశాత్తు అందులో జారిపడ్డాడు. అప్పటికే చీకటి పడడంతో గ్రామస్థులు ఎవరూ సమీపంలో లేరు. నేలబావిలో పడిపోయిన శంకర్‌రావు.. కాపాడండి.. కాపాడండి అని కేకలు వేసినా ఎవరికీ వినిపించలేదు. దీంతో మంగళవారం రాత్రి అంతా ఆ నేలబావిలోనే చలికి వణుకుతూ.. గజగజలాడిపోయాడు. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో నేలబావి నుంచి కేకలు వినిపించడంతో అటుగా వెళ్లిన గ్రామస్థులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి టెక్కలి ఎస్‌ఐ-2 కె.రమేష్‌బాబు చేరుకుని స్థానిక అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అతికష్టం మీద తాళ్ల సహాయంలో శంకర్‌రావును బయటకు తీశారు. ఆయనకు స్వల్పగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నేలబావిలో పడిపోయిన వ్యక్తిని బయటకు తీసిన సిబ్బందిని స్థానికులు అభినందించారు. చుట్టూ రాళ్లు ఉన్న నేలబావిలో పడి.. క్షేమంగా బయటకు వచ్చిన శంకర్‌రావును మృత్యుంజయుడుగా స్థానికులు వ్యాఖ్యానించారు.

Updated Date - Jan 03 , 2024 | 11:17 PM