Share News

సంస్కృతి, సంప్రదాయాలకు ఆలవాలం జానపదం

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:15 AM

‘సంస్కృతి, సంప్రదాయాలకు ఆలవాలం జానపదం. మన అలవాట్లు, అభిరుచులు జానపద గీతాల్లో వినిపిస్తా’యని తెలంగాణకు చెందిన కళాకారుడు, బహుజన యుద్ధనౌక ఏవురి సోమన్న అన్నారు.

సంస్కృతి, సంప్రదాయాలకు ఆలవాలం జానపదం
తెలంగాణ గాయకుడు ఏవూరు సోమన్న గీతాలాపన

- తెలంగాణ ప్రజాగాయకుడు ఏవూరి సోమన్న

- ఘనంగా సిక్కోలు జానపద కళాజాతర

పలాసరూరల్‌, జనవరి 11: ‘సంస్కృతి, సంప్రదాయాలకు ఆలవాలం జానపదం. మన అలవాట్లు, అభిరుచులు జానపద గీతాల్లో వినిపిస్తా’యని తెలంగాణకు చెందిన కళాకారుడు, బహుజన యుద్ధనౌక ఏవురి సోమన్న అన్నారు. మండలంలోని గురుదాసుపురంలో సిక్కోలు జానపద కళా జాతరను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోమన్న మాట్లాడుతూ.. జానపదాలు ప్రస్తుత కాలంలో రూపాంతరం చెందినా వాటి ఉనికి మాత్రం మారలేదన్నారు. ఉద్దానం పోరు గడ్డ అని, నాటి సాయుధ పోరాటంలో పలికిన పలుకులను నేడు పలుకుతుంటే శరీరం ఉప్పొంగుతుందన్నారు. ఇటువంటి వేడుకలు కచ్చితంగా నిర్వహించి జానపద కళలకు జీవం పోయాలన్నారు. అనంతరం ఆయనతో పాటు ప్రజాగాయకుడు రాంబాబు జానపద గీతాలను ఆలపించారు. మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ.. ఉద్దానంలో జానపద గీతాలు, ఆటాపాటల కోసం వేదిక నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష మాట్లాడుతూ.. ప్రతి ఏటా సంక్రాంతికి ముందు జానపద గీతాలు, ఆటాపాటలతో ఇటువంటి బృహత్తర కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయమన్నారు. అనంతరం సారంగపురం గంగిరెద్దుల ఆటలు, పీత గంగయ్య తప్పెటగుళ్లు, చెక్కభజన, అసిరయ్య, గువ్వాడ మల్లేసుల బోనెల పాట, మాకన్నపల్లి, చిననీలావతి జట్ల కోలాటం, చినబహడాపల్లి అమ్మవారి ఆట, పట్టులోగానికి చెందిన గిరిజన విద్యార్థినుల థింసా నృత్యాలతో పాటు శాస్త్రీయ, అంజాట, కాళీకావేషధారణ, అత్తాకోడలు గేయం, బుడగజంగాల గీతాలు అలరించాయి. కార్యక్రమంలో సిక్కోలు కళాజాతర నిర్వాహకులు కుత్తుమ లక్ష్మణరావు, రాపాక ధనరాజు, కుత్తుమ వినోద్‌, డాక్టర్‌ కుమార్‌ నాయక్‌, బత్తిన శాంతారావు, ఎం.నారాయణ, ఉప్పరపల్లి ఉదయ్‌కుమార్‌, సర్పంచ్‌ కుత్తుమ రూపవతి , ఎం.దేవరాజు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 12:15 AM