Share News

ఆదిత్యా.. పట్టించుకునేదెవరు?

ABN , Publish Date - May 20 , 2024 | 12:07 AM

జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.. అరసవల్లిలోని ఆదిత్యుడి ఆలయంలో భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. వైశాఖమాసాన్ని పురస్కరించుకుని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు ఆదిత్యుడి దర్శనానికి పోటెత్తారు.

ఆదిత్యా.. పట్టించుకునేదెవరు?
అరసవల్లిలో భక్తుల రద్దీ

- అరసవల్లిలో భక్తులకు తప్పని ఇక్కట్లు

- బురదనీటిలోనే పుణ్యస్నానాలు

- ట్రాఫిక్‌ రద్దీతో అవస్థలు

అరసవల్లి, మే 19: జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.. అరసవల్లిలోని ఆదిత్యుడి ఆలయంలో భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. వైశాఖమాసాన్ని పురస్కరించుకుని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు ఆదిత్యుడి దర్శనానికి పోటెత్తారు. ఆదివారం ఒక్కరోజే సూర్యనారాయణస్వామికి రూ.19,31,975 ఆదాయం లభించింది. టిక్కెట్ల విక్రయం ద్వారా రూ.13,04,100, విరాళాల ద్వారా రూ.1,21,675, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.3,27,720, కేశఖండన ద్వారా రూ.1,78,480 లభించినట్టు ఈవో ఎస్‌.చంద్రశేఖర్‌ తెలిపారు. కాగా.. ఇంత ఆదాయం వస్తున్నా.. భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభివృద్ధి పేరుతో ఇంద్రపుష్కరిణిలో నీటిని ఎండగట్టిన అధికారులు.. పవిత్ర స్నానాలకు సంబంధించి చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహించారని భక్తులు ఆరోపిస్తున్నారు. బురదనీటిలోనే స్నానం చేయాల్సిన దుస్థితి నెలకొందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఆలయ పరిసర ప్రాంతాలతోపాటు.. సింహద్వారం వెలుపలా ట్రాఫిక్‌ రద్దీని పట్టించుకునేవారు లేరు. ఓ వైపు ఎండలు మండుతుండగా.. గంటల తరబడి క్యూలో ఉన్నా.. కనీసం మంచినీళ్ల ప్యాకెట్లు కూడా పంపిణీ చేయలేదు. రద్దీ నేపథ్యంలో క్యూలో తోపులాట జరిగినా పట్టించుకున్న నాథులు లేర’ని వాపోయారు.

- అనధికార వ్యక్తులదే హవా

ఆదిత్యుడి ఆలయంలో అనధికార వ్యక్తుల హవా సాగుతోంది. ఆదిత్యుడి ప్రత్యేక దర్శనం కావాలంటే ఆలయంలో పాతుకుపోయిన కొంతమంది ప్రైవేటు వ్యక్తులను సంప్రదించాల్సిందే. ప్రత్యేక దర్శనాల పేరుతో గతంలో హోంగార్డులు, ఆలయ సిబ్బంది చేతివాటం ప్రదర్శించిన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం కూడా పలువురు చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలు ఉన్నాయి. మంగువారితోటకు చెందిన ఓ వ్యక్తి సమాచార కేంద్రం వద్ద సేవ పేరుతో భక్తులను అధిక సంఖ్యలో దర్శనాలకు పంపించారు. దీనిపై క్యూలో ఉన్న భక్తులు నిలదీయడంతో ఆలయం ఎదుట గందరగోళం నెలకొంది. ఇప్పటికైనా ఆలయ అధికారులు స్పందించి ప్రైవేటు వ్యక్తుల జోక్యాన్ని నివారించాలని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై ఆలయ సూపరింటెండెంట్‌ కృష్ణమాచార్యులు వద్ద ప్రస్తావించగా.. ఈవో దృష్టికి సమస్యను తీసుకెళ్లి అనధికార వ్యక్తుల హవాపై చర్యలు తీసుకుంటామన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడించారు.

Updated Date - May 20 , 2024 | 12:07 AM