Share News

ఆదిత్యా.. ఇవేం కష్టాలు?

ABN , Publish Date - Feb 17 , 2024 | 12:32 AM

అరసవల్లిలోని రథసప్తమి ఏర్పాట్లలో ఆలయ అధికారుల లోపాల కారణంగా భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. గురువారం అర్ధరాత్రి 12 గంటల నుంచి స్వామిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

ఆదిత్యా.. ఇవేం కష్టాలు?
ఆలయం వద్ద డోనర్లు, వీఐపీలను తోసేస్తున్న పోలీసులు

- ఏర్పాట్లలో అధికారుల వైఫల్యం

- తీవ్ర ఇబ్బందులు పడిన భక్తులు

- రూట్‌మ్యాప్‌ కూడా చేయని వైనం

- టికెట్ల వ్యవహారంలోనూ ఆరోపణలు

- పోలీసుల అత్యుత్సాహంపై విమర్శలు

శ్రీకాకుళం క్రైం, ఫిబ్రవరి 16: అరసవల్లిలోని రథసప్తమి ఏర్పాట్లలో ఆలయ అధికారుల లోపాల కారణంగా భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. గురువారం అర్ధరాత్రి 12 గంటల నుంచి స్వామిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. క్యూలైన్లలో సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో వీఐపీ, వీవీఐపీ, డోనర్‌ పాస్‌లు, రూ.500 టికెట్‌ కొనుగోలు చేసిన భక్తులు ఎటువెళ్లాలో తెలియక అవస్థలు పడ్డారు. మరోవైపు వీఐపీల తాకిడి కూడా పెరగడంతో ఆలయ సింహద్వారం తోపులాట జరిగింది. భక్తులకు దిక్సూచి చూపే రూట్‌మ్యాప్‌లను కూడా ఆలయ అధికారులు ఏర్పాటు చేయలేదు. దీంతో సింహద్వారం వద్దకు పెద్ద ఎత్తున భక్తులు చేరుకోవడంతో గందరగోళం నెలకొంది. అర్ధరాత్రి 2 గంటల నుంచి 4 గంటల వరకు అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో తోపులాట చోటుచేసుకుంది.

- రథసప్తమి వేడుకల్లో భాగంగా ఆదిత్యుడ్ని దర్శించుకునేందుకు వీఐపీలు, వీవీఐపీల కోసం సుమారు 3వేల టిక్కెట్లు ముద్రించారు. వీటిలో కొన్ని టిక్కెట్లను యూనియన్‌ బ్యాంకు ద్వారా విక్రయించి భక్తులకు వీఐపీ దర్శనం కల్పించేలా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. ఆర్డీవో నుంచి లేఖ తీసుకున్నవారికి యూనియన్‌ బ్యాంకులో ఈ టిక్కెట్లు విక్రయించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఈ టికెట్ల వ్యవహారం వెనుక పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

- అలాగే క్షీరాభిషేకం కోసం వీఐపీలు తీసుకున్న టిక్కెట్లపై నిర్ణీత సమయం ముద్రించడంతో వారంతా అవస్థలు పడ్డారు. కొంతమంది భక్తులు టిక్కెట్లు పట్టుకుని రాగా పోలీసులు, ఆలయ సిబ్బంది అడ్డుకున్నారు. టికెట్‌పై కేటాయించిన సమయంలోనే రావాలంటూ వారికి స్పష్టం చేశారు. దీంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సమయపాలనపై ముందు అవగాహన కల్పించలేదని వాపోయారు.

- ఆలయానికి వచ్చిన దాతలు, వీఐపీలను పోలీసులు రద్దీ పేరుతో తోసేశారు. రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పీఏ భవానిని సైతం నెట్టేశారు. పోలీసు అధికారులు, సిబ్బంది కుటుంబసభ్యులకు ఎటువంటి పాసులు లేకపోయినా సింహద్వారం గుండా దర్శన అవకాశాలు కల్పించడంపై భక్తులు విమర్శలు గుప్పిస్తున్నారు.

దాతలను అవమానించడం సరికాదు

ఆలయ అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చే భక్తులకు డోనర్‌ పాసులు ఇచ్చి.. రథసప్తమి రోజు క్షీరాభిషేకం దర్శనానికి అవకాశం కల్పిస్తారు. ఈ ఏడాది దాతలకు క్యూలైన్లు ఎక్కడ ఏర్పాటు చేశారో తెలియని పరిస్థితి నెలకొంది. ఆలయంలో పనిచేసే ఉద్యోగులు ఒక్కొక్కరూ పదుల సంఖ్యలో బయటవారిని తీసుకెళ్లి దర్శనం చేయించారు. దాతలను మాత్రం పట్టించుకోకపోవడం దారుణం. ఇలా దాతలను అవమానపరచడం సరికాదు.

- డబ్బీరు శ్రీనివాసరావు(వాసు), శ్రీకూర్మం పాలక మండలి సభ్యుడు

Updated Date - Feb 17 , 2024 | 12:32 AM