Share News

అచ్చెన్నకే చాన్స్‌

ABN , Publish Date - Jun 12 , 2024 | 11:34 PM

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడుకు అమాత్య పదవి లభించింది.

అచ్చెన్నకే చాన్స్‌

-జిల్లా నుంచి ఒక్కరికే అవకాశం

-కేశరపల్లిలో మంత్రిగా ప్రమాణం

-నేడో రేపో శాఖ కేటాయింపు

-హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లావాసులు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి/టెక్కలి)

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడుకు అమాత్య పదవి లభించింది. తన అన్న ఎర్రన్నాయుడు స్ఫూర్తితో అచ్చెన్నాయుడు రాజకీయాల్లోకి వచ్చారు. తండ్రి దాలినాయుడు ఉపాధ్యాయుడు. విశాఖప ట్నంలో బీఎస్సీ చదువును మధ్యలో ఆపివేసి అచ్చెన్నాయుడు రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999, 2004 ఎన్నికల్లో కూడా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2009లో టెక్కలి నియోజకవర్గం నుంచి పోటీచేసి తొలిసారిగా ఓటమి చవిచూశారు. అనంతరం 2014 నుంచి ఇప్పటివరకు వరుసగా టెక్కలి నుంచే గెలుపొందుతున్నారు. 2014లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా, ఆ తర్వాత కార్మిక శాఖ మంత్రిగా పని చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఆయనకు చంద్రబాబు అవకాశం కల్పించారు. జిల్లా నుంచి ఈ దఫా అచ్చెన్నాయుడుకు మాత్రమే మంత్రి పదవి లభించింది. నేడో రేపో శాఖను కేటాయించనున్నారు. ఇదిలా ఉండగా మంత్రి పదవిని ఆశించినవారిలో ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ కూడా ఉన్నారు. ఆయనకు చీఫ్‌ విప్‌ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అచ్చెన్నకు మంత్రి పదవి రావడంతో జిల్లాలో హర్షాతీరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన స్వగ్రామం నిమ్మాడలో ప్రజలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. గ్రామస్థులు అచ్చెన్నాయుడు ఇంటికి వచ్చి సందడి చేశారు.

పులకించిన టెక్కలి

‘కింజరాపు అచ్చెన్నాయుడు అను నేను’ అంటూ బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో టెక్కలి నియోజకవర్గం పులకించింది. జై చంద్రబాబు.. జై అచ్చెన్న అంటూ ప్రజలు నినాదాలు చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అచ్చెన్నపై కక్షసాధింపు చర్యలకు దిగింది. కేసులపై కేసులు నమోదుచేస్తూ ఆయన్ను బెదిరించేందుకు యత్నించింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అవినీతి జరిగిందంటూ 78 రోజుల పాటు జైలులో పెట్టారు. పంచాయతీ ఎన్నికల్లో దౌర్జన్యం చేశారంటూ 10 రోజులు జైలుకు తరలించారు. వివిధ రీతుల్లో అనేక అవమానాలకు గురిచేసినా వాటన్నింటిని ఎదురొడ్డి పోరాడారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకోవడంతో ఆయన గ్రాఫ్‌ ఒక్కసారి భారీగా పెరిగింది.

‘కింజరాపు’ కుటుంబానికి కలిసొచ్చిన వేళ

2024 సార్వత్రిక ఎన్నికలు కింజరాపు కుటుంబానికి కలిసొచ్చాయి. టెక్కలి నుంచి బాబాయ్‌ అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా ప్రమాణం చేయడం, అబ్బాయి రామ్మోహన్‌ నాయుడు ఎంపీగా గెలుపొంది కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖా మంత్రిగా ప్రమాణం చేశారు. వీటిని గమనించిన సిక్కోలు ప్రజలు అక్కడ అబ్బాయి, ఇక్కడ బాబాయి అంటూ చర్చించుకుంటున్నారు. దీనిబట్టి కింజరాపు కుటుంబంపై టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉన్న అభిమానం అర్థమవుతోంది.

టెక్కలిని వరించిన మంత్రి పదవులు

టెక్కలి నియోజకవర్గాన్ని మంత్రి పదవులు వరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ ఇదే నియోజక వర్గం నుంచి 1994లో గెలుపొంది ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. అలాగే, కింజరాపు అచ్చెన్నాయుడు రెండు పర్యాయాలు కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. ఇదే నియోజకవర్గానికి చెందిన డాక్టర్‌ కిల్లి కృపారాణి 2009-14 మధ్య ఎంపీగా ఎన్నికై కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా వ్యవహరించారు. దీంతో మంత్రి పదవులు టెక్కలికి వరించడం ఆనవాయితీగా మారిందన్న చర్చ సాగుతోంది.

చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని వీక్షించిన ప్రజలు

కలెక్టరేట్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రివర్గ సహచరుల ప్రమాణస్వీకారాన్ని జిల్లా ప్రజలు ఉత్సాహంగా వీక్షించారు. టీవీలు, సెల్‌ఫోన్లతో పాటు బిగ్‌ స్ర్కీన్‌లపై తిలకించి సందడి చేశారు. శ్రీకాకుళం బాపూజీ కళామందిర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసారాన్ని జిల్లా మహిళా సమాఖ్య ప్రతినిధులతో కలిసి జిల్లా రెవెన్యూ డివిజనల్‌ అధికారి సిహెచ్‌.రంగయ్య, ఇతర జిల్లా అధికారులు తిలకించారు.

Updated Date - Jun 12 , 2024 | 11:34 PM