Share News

పథకం ప్రకారమే..

ABN , Publish Date - May 25 , 2024 | 11:55 PM

సారవకోట మండలం ధర్మలక్ష్మీ పురం వద్ద ఈ నెల 18న స్థలాల పేరిట బురిడీ కొట్టించి రూ.10లక్షలతో ఉడాయించిన ఘటనపై నమోదైన కేసును పోలీసులు ఛేదించారు.

పథకం ప్రకారమే..
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ

- ధర్మలక్ష్మీపురం వద్ద దోపిడీ

- కేసును ఛేదించిన పోలీసులు

- 12 మంది నిందితుల గుర్తింపు

- ఆరుగురి అరెస్టు.. రూ.4.80 లక్షలు స్వాధీనం

నరసన్నపేట, మే 25: సారవకోట మండలం ధర్మలక్ష్మీ పురం వద్ద ఈ నెల 18న స్థలాల పేరిట బురిడీ కొట్టించి రూ.10లక్షలతో ఉడాయించిన ఘటనపై నమోదైన కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 12 మంది నిందితులను గుర్తించారు. వీరిలో ఆరుగురిని అరెస్టు చేసి వారి నుంచి రూ.4.80 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను టెక్కలి డీఎస్పీ బాలచంద్రరెడ్డి శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. డీఎస్పీ చెప్పిన వివరాల మేరకు.. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన నక్కళ్ల మణికంఠ అనే కాంట్రాక్టర్‌కు సారవకోట మండలం ధర్మలక్ష్మీపురం వద్ద భూములు అమ్మకానికి ఉన్నాయని పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం నూలకజోడు గ్రామానికి చెందిన నిమ్మల మనోజ్‌కుమార్‌ అలియాస్‌ శ్రీధర్‌ నమ్మబలికాడు. ఈ భూముల కోసం ముందుస్తుగా రూ.10లక్షలు టోకెన్‌ అడ్వాన్స్‌ చెల్లించాలని ఈనెల 18న మణికంఠతో పాటు శ్రీధర్‌ ధర్మలక్ష్మీపురానికి మణికంఠకు చెందిన కారులో వచ్చారు. ధర్మలక్ష్మీపురం వద్ద భూములు చూస్తున్న సమయంలో ముందుగా వేసుకున్న పథకం ప్రకారం పోలీసు డ్రస్‌ వేసుకున్న కొందరు వ్యక్తులు కారులో అక్కడకు వచ్చారు. తాము పోలీసులమని.. ఇక్కడ ఏమి చేస్తున్నారో చెప్పండని మణికంఠ, శ్రీధర్‌ను ప్రశ్నించారు. వారి కారును తనిఖీ చేసి అందులో ఉన్న రూ.10లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సమయంలో అంత డబ్బులు ఉండరాదని చెప్పి శ్రీధర్‌ను దుండగులు తమ కారులో ఎక్కించుకున్నారు. మణికంఠకు శ్రీకాకుళం డీఎస్పీ కార్యా లయానికి రావాలని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీంతో మణికంఠ శ్రీకాకుళం డీఎస్పీ కార్యాలయానికి చేరుకుని శ్రీధర్‌కు ఫోన్‌ చేశాడు. ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉండడంతో అనుమానం వచ్చి సారవకోట పోలీసులకు అదే రోజు మణికంఠ ఫిర్యాదు చేశాడు. దీంతో నరసన్నపేట సీఐ ప్రసాదరావు కేసు నమోదు చేశారు. సారవకోట ఎస్‌ఐ అప్పారావు, కానిస్టేబుళ్లు దాలినా యుడు, జగ్గారావు, గోపాలరావు, జి.సత్యనారాయణ విచా రణ చేపట్టారు. ప్లాన్‌ ప్రకారమే ఇది చేశారని, ఇందులో 12 మంది ఉన్నారని పోలీసులు గుర్తించారు. వీరిలో సస్పెండ్‌కు గురైన ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా ఉన్నట్లు తేలింది. ఈ మేరకు ఏ-1 నిందితుడు శ్రీధర్‌తో పాటు నులకజోడు గ్రామానికి చెందిన బిడ్డిక యువరాజు, ఒడిశాకు చెందిన సాలిమన్‌ కెరోడో, జిబెంట లీమా, హిరమండలం మండలం రేగుడకు చెందిన పసుపురెడ్డి తవుడు, పాతపట్నం మండలం గంగువాడకు చెందిన అజ్జల రాజేష్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ బాలచంద్రరెడ్డి తెలిపారు. వారి నుంచి రూ.4.80 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పరారీలో ఉన్న మరో ఆరుగురిని త్వరలో అరెస్టు చేస్తామన్నారు. దోపిడికి ఉపయోగించిన కారు, ద్విచక్ర వాహనాలను సీజ్‌ చేసినట్లు తెలిపారు. సీఐ ప్రసాదరావు, ఎస్‌ఐ అప్పారావు, కానిస్టేబుళ్లను డీఎస్పీ అభినందించారు. ఎస్పీ జీఆర్‌ రాధిక ఆదేశాల మేరకు కానిస్టేబుళ్లకు రివార్డు ఇచ్చేందుకు ప్రతిపాదనలు పంపించామని తెలిపారు.

Updated Date - May 25 , 2024 | 11:55 PM