Share News

అంగన్‌వాడీలపై ఎస్మాను రద్డు చేయండి

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:11 AM

అంగన్‌వాడీలపై ఎస్మాను రద్దు చేసి వారి జీతాలు వెంటనే పెంచాలని అఖిలపక్ష నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

అంగన్‌వాడీలపై ఎస్మాను రద్డు చేయండి
నినాదాల చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు

- తక్షణమే జీతాలు పెంచాలి

- అఖిలపక్ష నాయకుల డిమాండ్‌

అరసవల్లి, జనవరి 11: అంగన్‌వాడీలపై ఎస్మాను రద్దు చేసి వారి జీతాలు వెంటనే పెంచాలని అఖిలపక్ష నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు అధ్యక్షతన నగరంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో అంగన్‌వాడీలకు మద్దతుగా గురువారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌, సీపీఐ(ఎంఎల్‌) జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, జనసేన పార్టీ జిల్లా నాయకుడు పేడాడ రామ్మోహనరావు పాల్గొని మాట్లాడారు. అంగన్‌వాడీలకు కనీస వేతనం, పీఎఫ్‌, గ్రాట్యుటీ ఇవ్వకుండా, కార్మిక చట్టాలు అమలు చేయకుండా ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతుందని విమర్శించారు. తక్కువ వేతనాలతో అంగన్‌వాడీలు తమ కుటుంబాలను ఎలా పోషించుకోగలరని ప్రశ్నించారు. వారిని భయబ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. సంక్రాంతి లోగా అంగన్‌వాడీల డిమాండ్లను పరిష్కరించకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎస్మాను రద్దు చేసి, అంగన్‌డీల వేతనాలు పెంచాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సమావేశంలో సీపీఐ నాయకుడు సుందరలాల్‌, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, కోశాధికారి అల్లు సత్యనారాయణ, ఎం.ఆదినారాయణమూర్తి, ఎం.శంకరనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న సమ్మె

తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీ కార్యకర్తలు సమ్మెను కొనసాగిస్తున్నారు. కలెక్టరేట్‌ సమీపం లోని జ్యోతిబాపూలే పార్కువద్ద చేపడుతున్న 24 గంటల రిలే నిరాహార దీక్షలు గురువారం 6వ రోజుకు చేరుకున్నాయి. అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు కె.కళ్యాణి, కోశాధికారి ఎన్‌.హైమవతి మాట్లాడుతూ.. పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వీరికి సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్‌ అమ్మ న్నాయుడు, పి.తేజేశ్వరరావు, ఉపాధ్యక్షుడు ఎం.ఆదినారా యణమూర్తి సంఘీభావం తెలిపారు. అంగన్‌వాడీలకు ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకోవాలని, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేదంటే నిరవధిక నిరాహార దీక్షలు, చలో విజయవాడ చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

సొమ్మసిల్లిన అంగన్‌వాడీ సహాయకురాలు

ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం బస్టాండ్‌ జంక్షన్‌ వద్ద గురువారం అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మెలో పాల్గొన్న బలరాంపురం గ్రామానికి చెందిన సహాయకురాలు లండ మహాలక్ష్మి ఎండ తీవ్రతకు సొమ్మసిల్లి పోయింది. వెంటనే కార్యకర్తలు ఆమెను ఆటోలో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం సాయంత్రం ఇంటికి తీసుకెళ్లారు. మహాలక్ష్మి గత 31 రోజులుగా సమ్మెలో పాల్గొంటుందని యూనియన్‌ సభ్యులు హైమా, సుబ్బలక్ష్మి తెలిపారు. అయితే, సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఆమె తీవ్ర ఒత్తిడికి లోనై అనారోగ్యానికి గురై సొమ్మసిల్లి పోయిందని వాపోయారు. ప్రాణాలు పోతేగానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించదా అని మండిపడుతున్నారు.

Updated Date - Jan 12 , 2024 | 12:11 AM