దడ పుట్టిస్తున్న డీజే
ABN , Publish Date - Mar 04 , 2024 | 12:17 AM
శుభకార్యాల్లో ఇటీవల ఎక్కడ చూసినా డీజేలతో అధిక ధ్వని పుట్టిస్తున్నారు. పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, రజస్వల వేడుకలు.. ఇలా ఏ కార్యక్రమమైనా డీజేలు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో పండుగలు, శుభకార్యాల్లో చిన్న మైక్‌సెట్లు వినియోగించేవారు.
- శుభకార్యాల్లో పరిమితికి మించి ధ్వని
- అవస్థలు పడుతున్న ప్రజలు
(ఇచ్ఛాపురం)
శుభకార్యాల్లో ఇటీవల ఎక్కడ చూసినా డీజేలతో అధిక ధ్వని పుట్టిస్తున్నారు. పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, రజస్వల వేడుకలు.. ఇలా ఏ కార్యక్రమమైనా డీజేలు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో పండుగలు, శుభకార్యాల్లో చిన్న మైక్‌సెట్లు వినియోగించేవారు. వీటివల్ల ఎవరికీ పెద్దగా ధ్వనుల ఇబ్బందులు ఉండేవి కాదు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం మరింత పెరగడంతో.. చాలామంది స్టేటస్ సింబల్‌గా డీజేలు ఏర్పాటు చేస్తున్నారు. ఊరేగింపుల సమయంలో మరింత అధిక ధ్వనుల కారణంగా చుట్టుపక్కల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధిక ధ్వనులతో భూ ప్రకంపనంలో కూడా మార్పులు సంభవించే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. మానవుడు 20హెడ్జ్‌ల నుంచి 20వేల హెడ్జ్‌లు ధ్వనులు వినవచ్చును. దీన్ని స్రవ్య అవధి అంటారు. ఇవి ఎలాంటి హానీ తలపట్టవు. అంతకు మించి ధ్వనిని వింటే మానవులకు అనేక రకాల వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. అధిక ధ్వని వినటం వలన గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస , జీర్ణకోశం సంబంధిత వ్యాధులు సంభవిస్తాయి. మానసికంగా కూడా ఒత్తిడికి గురవుతారు. అలసట, నీరసం, మూర్చ తదితర వాటికి లోనవుతారు. రక్త ప్రసరణలో హెచ్చతగ్గులు వస్తాయి. దీంతో రక్తపోటుకు గురై పక్షవాతం, లేక గుండె సంబంధిత వ్యాధులకు గురువతారని వైద్యులు చెబుతున్నారు. 20వేల హెడ్జ్‌ల కన్నా ఎక్కువ ధ్వని కేవలం జంతువులు మాత్రమే వినగలవని పేర్కొంటున్నారు. అధిక ధ్వనుల కారణంగా ప్రజలకు ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు, పోలీసులు స్పందించి తక్కువ ధ్వనికి సంబంధించిన డీజే పరికరాలు మాత్రమే వినియోగించేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
డీజే సౌండ్‌తో అనారోగ్యమే
డీజే సౌండ్‌తో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. గుండెజబ్బులు ఉత్పన్నమవుతాయి. రక్తపోటు, గుండె చప్పుడు పెరిగిపోవటం, గుండె 70-100 సార్లు కొట్టుకుంటుంది. అలాంటప్పుడు గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. రక్తపోటు పెరిగి నరాలు దెబ్బతింటాయి. అధిక ధ్వనులు వింటే మతిస్థిమితం కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.
- పాతిర్ల దేవేంద్రరెడ్డి, సూపరింటెండెంట్, ఇచ్ఛాపురం సీహెచ్‌సీ