ఇదేం దండన?
ABN , Publish Date - Oct 04 , 2024 | 12:16 AM
కొంతమంది ఉపాధ్యాయుల తీరుతో విద్యార్థులు మూల్యం చెల్లించుకుంటున్నారు. కఠినంగా దండించడంతో ఒక్కోసారి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఓ ఉపాధ్యాయుడు చేసిన పనికి.. విద్యార్థి కంటిచూపు పోయింది. ఈ ఘటన రణస్థలం మండలం పైడిభీమవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటీవల జరిగింది. ఈ విషయం బయటకు పొక్కకుండా ఉపాధ్యాయులు జాగ్రత్త పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
- విద్యార్థిని కర్రతో కొట్టిన ఉపాధ్యాయుడు
- కంటి మీద తగలడంతో తీవ్రగాయం
- కంటిచూపు కోల్పోయే ప్రమాదం
- పైడిభీమవరం పాఠశాలలో ఉపాధ్యాయుల నిర్లక్ష్యం
రణస్థలం, అక్టోబరు 3: కొంతమంది ఉపాధ్యాయుల తీరుతో విద్యార్థులు మూల్యం చెల్లించుకుంటున్నారు. కఠినంగా దండించడంతో ఒక్కోసారి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఓ ఉపాధ్యాయుడు చేసిన పనికి.. విద్యార్థి కంటిచూపు పోయింది. ఈ ఘటన రణస్థలం మండలం పైడిభీమవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటీవల జరిగింది. ఈ విషయం బయటకు పొక్కకుండా ఉపాధ్యాయులు జాగ్రత్త పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. పసరపాలెం గ్రామానికి చెందిన చెన్నా అరుణకుమార్ అనే విద్యార్థి ఈ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 1న పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు దండించే క్రమంలో చేతిలో ఉన్న కర్రతో ఆ విద్యార్థిని కొట్టాడు. ఆ కర్ర పొరపాటున కంటి మీద తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కన్ను ఎర్రగా మారడంతో మరో ఉపాధ్యాయుడు పైడిభీమవరంలో ఉన్న ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయుడు.. బాధిత విద్యార్థి తండ్రిని స్కూల్‌కి రప్పించి జరిగిన విషయం చెప్పాడు. రూ.1000 అందజేసి.. వైద్యం చేయించుకోవాలని సూచించాడు. కంటి బాధతో విలవిల్లాడుతున్న విద్యార్థిని ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం మాత్రం చేయలేదు. నిరుపేదలైన తల్లిదండ్రులు.. మరుసటి రోజు ఆ విద్యార్థిని విజయనగరంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే కన్ను బాగా దెబ్బతిందని చెప్పిన వైద్యులు.. విశాఖలోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు తల్లిదండ్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తెచ్చి ఉంటే కన్ను బాగుచేసి ఉండేవారమని.. ఇప్పడు ఆపరేషన్ చేసినా గ్యారంటీ లేదని చెప్పడంతో వారు ఆందోళన చెందుతున్నారు. నిరుపేద కుటుంబం కావడంతో కనీసం వైద్య ఖర్చులు కూడా భరించలేని స్థితిలో ఉన్నామని కన్నీరుమున్నీరవుతున్నారు.
- వరుస ఘటనలు..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇటీవల రణస్థలం మండలం పాతర్లపల్లిలో పాఠశాల తరగతుల సమయంలో భవనం సన్‌షేడ్ పై నుంచి జారిపడి కృష్ణంరాజు అనే విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. అప్పట్లో కూడా ఉపాధ్యాయుల తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఘటన జరిగిన వెంటనే ఆస్పత్రికి తరలించడంలో ఉపాధ్యాయులు నిర్లక్ష్యం చేసినట్టు ఆరోపణలున్నాయి. చివరకి తోటి విద్యార్థులే చెక్క బల్లపై ఆస్పత్రికి తీసుకెళ్లడం, అప్పటికే ఆలస్యమై విద్యార్థి చనిపోవడం ఆందోళనకు దారితీసింది. ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆరోపిస్తూ ఆందోళన చేశారు. తాజాగా పైడిభీమవరంలో సైతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పొరపాటున ఈ ఘటన జరిగినా.. వెంటనే ఉపాధ్యాయులు ఆ విద్యార్థిని ఆస్పత్రికి తీసుకెళ్లి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి అని బాధితుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై దళిత సంఘాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సంబంధిత ఉపాధ్యాయుడిపై చర్యలకు డిమాండ్ చేస్తున్నాయి.
మెరుగైన వైద్యం కోసం..
విద్యార్థులు అల్లరి చేసే క్రమంలో నియంత్రించడానికి ఉపాధ్యాయుడు ప్రయత్నించారు. ఈ క్రమంలో చేతిలో ఉన్న కర్రకు సంబంధించి చిన్నపాటి ముక్క విద్యార్థి కన్నుకు గుచ్చుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే స్పందించాం. స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాథమిక వైద్యం అందించాం. ఇది పొరపాటున జరిగింది. ప్రస్తుతం బాధిత విద్యార్థి వెంట ఆసుపత్రిలోనే ఉపాధ్యాయులమంతా ఉన్నాం. మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం చేస్తున్నాం.
- టి.శోభారాణి, ప్రధానోపాధ్యాయురాలు, పైడిభీమవరం హైస్కూల్