Share News

వర్షం నష్ట నివేదిక అందజేయాలి

ABN , Publish Date - Sep 10 , 2024 | 11:51 PM

భారీ వర్షాల వలన జిల్లాలో కలిగిన నష్టాల వివరాలను బుధవారం నాటికి అందజేయాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు.

వర్షం నష్ట నివేదిక అందజేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

- కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, సెప్టెంబరు 10: భారీ వర్షాల వలన జిల్లాలో కలిగిన నష్టాల వివరాలను బుధవారం నాటికి అందజేయాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌తో కలిసి రెవెన్యూ, వ్యవసాయం, పంచాయతీరాజ్‌, డ్వామా, గృహ నిర్మాణశాఖ, వైద్యారోగ్యశాఖ, తదితర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. ‘విపత్తులు వచ్చినప్పుడు కాకుండా కంట్రోల్‌ రూమ్‌కు ఒక శాశ్వత ఫోన్‌ నెంబర్‌ను కేటాయించాలి. చెరువులు, డ్యాంల నుంచి నీరు ఓవర్‌ఫ్లో అయితే ఇరిగేషన్‌ ఏఈ, వీఆర్‌వో, పోలీసులకు సమాచారం అందించి రోడ్డు బ్లాక్‌ చేయాలి. పునరావాస కేంద్రాలు, పాఠశాలలకు సంబంధించి నష్టం జరిగితే తక్షణమే మరమ్మతులు చేపట్టాలి. పారిశుధ్య నిర్వహణపై దృష్టి సారించాల’ని ఆదేశించారు. ‘ఎంపీడీవోలు క్షేత్రస్థాయిలో పర్యటించి.. తాగునీటి పరీక్షలు నిర్వహించాలి. అవసరమైతే ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాలి. ఉపాధిహామీ పనులు కొనసాగించాలి. శ్రీకాకుళంలో హౌసింగ్‌ ప్రోగ్రెస్‌ తక్కువగా ఉంది. గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలి. మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పాఠశాలలు, కార్యాలయాల్లో శుక్రవారం డ్రైడేను పాటించాలి’ అని సూచించారు. వివిధ శాఖల లక్ష్యాలు, ప్రగతిని సీసీఓ లక్ష్మీ ప్రసన్న కలెక్టర్‌కు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్వో ఎం.అప్పారావు, డ్వామా పీడీ చిట్టిరాజు, డీఎంహెచ్‌వో బి.మీనాక్షి, జిల్లా మలేరియా అధికారి సత్యనారాయణ, మండలాల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

Updated Date - Sep 10 , 2024 | 11:51 PM