Share News

ఆగని పోరాటం

ABN , Publish Date - Jan 01 , 2024 | 11:44 PM

నూతన సంవత్సరం ప్రారంభం రోజు కూడా.. వారి పోరాటం ఆపలేదు. సమస్యల పరిష్కారం కోరుతూ.. ఓ వైపు అంగన్‌వాడీలు ఆటా-పాటలతో వినూత్న నిరసన తెలిపారు. మరోవైపు సమగ్ర శిక్ష ఉద్యోగులు మోకాళ్లపై కూర్చొని ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఆగని పోరాటం
మోకాళ్లపై కూర్చొని సమగ్రశిక్ష ఉద్యోగుల నిరసన

- వినూత్నంగా అంగన్‌వాడీల ఆటా-పాట

- మోకాళ్లపై సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన

- కొనసాగిన మునిసిపల్‌ కార్మికుల ఆందోళన

అరసవల్లి, జనవరి 1 : నూతన సంవత్సరం ప్రారంభం రోజు కూడా.. వారి పోరాటం ఆపలేదు. సమస్యల పరిష్కారం కోరుతూ.. ఓ వైపు అంగన్‌వాడీలు ఆటా-పాటలతో వినూత్న నిరసన తెలిపారు. మరోవైపు సమగ్ర శిక్ష ఉద్యోగులు మోకాళ్లపై కూర్చొని ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంకోవైపు మునిసిపల్‌ కార్మికులు ఆందోళన కొనసాగించారు. శ్రీకాకుళంలోని అర్బన్‌ ఐసీడీఎస్‌ కార్యాలయం వద్ద సమ్మె చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు.. సోమవారం ఆటపాటలతో, థింసా నృత్యం చేసి.. ప్రభుత్వంపై నిరసన తెలిపారు. యూనియన్‌ అధ్యక్షురాలు కె.కల్యాణి మాట్లాడుతూ.. చర్చలకు పిలిచి ఆర్థిక విషయాలపై మాట్లాడవద్దని చెప్పడం, చివరకు చర్చలు విఫలమవడం నిత్యకృత్యమైపోయిందన్నారు. ఎన్నికల హామీలను గుర్తు చేసుకోవాలని సూచించారు. కనీస వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాజేశ్వరి, ప్రమీలాదేవి, లతాదేవి, కాంచన, సుజాత, శాంతామణి, మాదురి, లక్ష్మి, హేమ, సరోజిని, భాగ్యలక్ష్మి, జ్యోతి, రాణి, ఎమ్‌ శారద, జ్యోతిలక్ష్మి, భూలక్ష్మి పాల్గొన్నారు.

- కలెక్టరేట్‌ వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగుల శిబిరాన్ని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి దవళ సరస్వతి సోమవారం సందర్శించారు. సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.కిషోర్‌కుమార్‌ మాట్లాడుతూ.. సమగ్ర శిక్ష ఉద్యోగులకు ప్రతినెలా 1న జీతాలు చెల్లించాలని, ఎంటీఎస్‌ కల్పించాలని, సామాజిక భద్రతా పథకాలు వర్తింపజేయాలని కోరారు. కార్యక్రమంలో సమగ్రశిక్ష జేఏసీ జిల్లా అధ్యక్షుడు పి.మురళీకృష్ణ, యూటీఎఫ్‌ కార్యవర్గ సభ్యుడు పురుషోత్తం, జనరల్‌ సెక్రటరీ బి.శ్రీరామ్మూర్తి, ఏపీటీఎఫ్‌ ధర్మారావు, ఢిల్లీశ్వరరావు, అనిల్‌కుమార్‌, రామారావు, వేంకటేశ్వరరావు, తవిటినాయుడు, శ్రీనివాసరావు, చిన్నారావు, రోహిణి, రామినాయుడు, అచ్యుతరావు పాల్గొన్నారు.

- శ్రీకాకుళం కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద మునిసిపల్‌ కార్మికులు నిరవధిక సమ్మె కొనసాగిస్తూ.. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షుడు ఏ.గణేష్‌ మాట్లాడుతూ హామీలు అమలు చేయాలని కోరుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎన్‌.బలరాం, జనార్థనరావు, యుగంధర్‌, అర్జి రాము, గణేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 01 , 2024 | 11:44 PM