Share News

గ్రానైట్‌కు గడ్డుకాలం

ABN , Publish Date - Jan 28 , 2024 | 11:33 PM

జిల్లాలో వేలాది మందికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉపాధినిచ్చే గ్రానైట్‌ పరిశ్రమ.. రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. నీలిరంగు గ్రానైట్‌ అంటే ఒకప్పుడు విదేశీయులకు చాలా మక్కువ.

గ్రానైట్‌కు గడ్డుకాలం
టెక్కలి ప్రాంతంలో గ్రానైట్‌ క్వారీ నిర్వహణ

- ముఖం చాటేసిన విదేశీ బయ్యర్లు

- గ్రానైట్‌, మోర్నమెంట్‌ మెటీరియల్‌ చెల్లక ఇబ్బందులు

- వెలవెలబోతున్న క్వారీలు

(టెక్కలి)

జిల్లాలో వేలాది మందికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉపాధినిచ్చే గ్రానైట్‌ పరిశ్రమ.. రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. నీలిరంగు గ్రానైట్‌ అంటే ఒకప్పుడు విదేశీయులకు చాలా మక్కువ. మోర్నమెంట్‌(స్మారకం) మెటీరియల్‌ కింద యూరప్‌ దేశీయులు ఎక్కువగా కొనుగోలు చేసేవారు. నేడు రష్యా, ఉక్రేయన్‌ వార్‌, నల్ల సముద్రంపై షిప్పులు రవాణా తగ్గడం, ఆర్థిక మాంధ్యం ప్రభావం వెరసి ఇటలీ, అమెరికా, జర్మన్‌, తైవాన్‌, పోలెండ్‌, ఫ్రాన్స్‌ తదితర దేశాల నుంచి విదేశీ బయ్యర్లు గ్రానైట్‌ మోర్నమెంట్‌ బ్లాకులు కొనుగోలుకు రాకపోవడంతో క్వారీ యజమానులు తలలు పట్టుకుంటున్నారు. క్వారీల నిర్వహణకు పెరిగిన ఖర్చులు, రాష్ట్ర ప్రభుత్వం సీనరీస్‌ చార్జీలు పెంచడం, డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫండ్‌ కింద క్యూబిక్‌ మీటర్‌కు 50శాతం పెంచడం, లోకల్‌ ఫ్యాక్టరీలకు ఇచ్చే రాయితీలు ఎత్తివేయడం తదితర కారణాలతో క్వారీల్లో గ్యాంగ్‌సైజ్‌ బ్లాకులు కుప్పలుతెప్పలుగా పడి ఉంటున్నాయి. యూరప్‌ దేశాలు ఎలాగూ ముఖం చాటేశాయి. మార్కెట్‌ నెమ్మదించడంతో ఆసియా పరిధి చైనా బయ్యర్లు కూడా రాక గ్రానైట్‌ క్వారీలు వెలవెలబోతున్నాయి.

- తెలంగాణ, ఒడిశా వైపు చూపు :

నీలిరంగు గ్రానైట్‌ పరిశ్రమకు రాయితీలు లేక.. క్వారీల నిర్వహణకు తగిన వనరులు లేక.. గ్రానైట్‌ క్వారీలు తగ్గుముఖం పడుతున్నాయి. జిల్లాలో సుమారు 200వరకు కటింగ్‌ అండ్‌ పాలిషింగ్‌ యూనిట్లు ఉన్నాయి. ఇందులో 50కు పైగా పరిశ్రమలు ఇటీవల తెలంగాణ, ఒడిశా ప్రాంతాల వైపు తరలిపోతున్నాయి. క్యూబిక్‌ మీటరు కట్టర్‌ సైజ్‌కు రూ.2,600 సీనరీస్‌ చార్జీలు, 50శాతం డీఎంఎఫ్‌, రెండుశాతం సెస్‌, రెండుశాతం ఐటీ, 12శాతం పన్నులు, రవాణా చార్జీలు తడిపిమోపెడు అవుతున్నాయి. దీంతో లోకల్‌ గ్రానైట్‌ ఫ్యాక్టరీలు సైతం మూడు షిఫ్ట్‌లు నిర్వహించే పరిస్థితి నుంచి ఒక షిఫ్ట్‌కు పరిమితమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రానైట్‌ ఫ్యాక్టరీలకు గతంలో ఇచ్చిన రాయితీలు రద్దుచేయడం, విద్యుత్‌ చార్జీల భారం పెరగడంతో లోకల్‌ ఫ్యాక్టరీలు మూసివేసి ఒడిశా, తెలంగాణాల వైపు జారుకుంటున్నారు.

Updated Date - Jan 28 , 2024 | 11:33 PM