Share News

నామినేషన్ల సందడి

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:03 AM

టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గురువారం స్వతంత్ర అభ్యర్థిగా నందిగాం మండలం పెద్దలవునిపల్లి గ్రామానికి చెందిన అట్టాడ రాజేష్‌ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు ఆర్వో నూరుల్‌కమర్‌కు నామినేషన్‌ పత్రాలు అందజేశారు.

 నామినేషన్ల సందడి

టెక్కలిలో స్వతంత్ర అభ్యర్థి దాఖలు

టెక్కలి: టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గురువారం స్వతంత్ర అభ్యర్థిగా నందిగాం మండలం పెద్దలవునిపల్లి గ్రామానికి చెందిన అట్టాడ రాజేష్‌ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు ఆర్వో నూరుల్‌కమర్‌కు నామినేషన్‌ పత్రాలు అందజేశారు. రాజేష్‌ ఇప్పటివరకు బీజేపీలో ఉండగా, ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. ఎన్నికలకు పక్కా ఏర్పాట్లు చేస్తున్నట్లు టెక్కలి నియోజకవర్గ ఎన్నికల అధికారి నూరుల్‌ కమర్‌ తెలిపారు. గురువారం టెక్కలి సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా బందోబస్తు విషయంపై డీఎస్పీ, సీఐలతో మాట్లాడారు. జిల్లా కేంద్రం నుంచి పంపించిన ఈవీఎంలు, వీవీప్యాట్లను స్ట్రాంగ్‌ రూంలో ఉంచారు.

ఇచ్ఛాపురంలోనూ...

ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం నియోజకవర్గానికి సంబంధించి తొలిరోజు కవిటి మండలం రాజపురానికి చెందిన జన్నెల సూర్య వరప్రసాద్‌ ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సుదర్శన్‌ దొర తెలిపారు. నామినేషన్‌ సమయంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

ఆమదాలవలసలో రెండు..

ఆమదాలవలస: నియోజకవర్గంలో గురువారం ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్‌ వేశారు. పొందూరు మండలం లోలుగు గ్రామానికి చెందిన లోలుగు వెంకట రాజశేఖర్‌, ఆమదాలవలస మునిసిపాలిటీ మెట్టక్కివలసకు చెందిన గణపతి జగదీశ్వరరావు స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి ఎం.నవీన్‌కు అందించారు. డీఎస్పీ విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ బందోబస్తు నిర్వహించారు. కార్య క్రమంలో త హసీల్దార్‌ కె.వేణుగోపాల్‌, ఎన్నికల డీటీ మురళీధర్‌నాయక్‌ పాల్గొన్నారు.

ఎచ్చెర్ల నుంచి ఇద్దరు..

రణస్థలం: రణస్థలంలో ఎచ్చెర్ల నియోజవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసేందుకు స్వతంత్ర అభ్యర్థులుగా తొలిరోజు ఇద్దరు నామినేషన్‌ వేసినట్లు ఆర్వో ఎస్‌వీ లక్ష్మణమూర్తి తెలిపారు. పాతర్లపల్లి గ్రామానికి చెందిన నేతల ఈశ్వరరావు, లావేరు మండలంలోని తామాడ గ్రామా నికి చెందిన నడుపూరి ఈశ్వరరావు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్‌ వేశారు.

పలాసలో నిల్‌

పలాస/పలాస రూరల్‌: పలాస నియోజకవర్గం పరిధిలో గురువారం ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. నామినేషన్లు స్వీకరించే తహసీల్దార్‌ కార్యాలయంలో ఎన్నికల అధికారి, ఆర్డీవో భరత్‌నాయక్‌, కాశీబుగ్గ డీఎస్పీ నాగేశ్వరరెడ్డితో పాటు అధికారుల బృందం ఉదయం 11 గంటల నుంచి నిబంధనల ప్రకారం అభ్యర్థుల కోసం వేచి ఉన్నారు. సమయం పూర్తయ్యే నాటికి ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. అభ్యర్థులు నియమావళిని అతిక్రమిస్తే చర్యలు తప్పవని భరత్‌నాయక్‌ హెచ్చరించారు. సీ-విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు ఇప్పటివరకూ 220 ఫిర్యాదులు అందాయని చెప్పారు. నియోజకవర్గంలో 57 పోలింగ్‌ కేంద్రాలు సమస్యాత్మకంగా గుర్తించి బందోబస్తుకు ఆదేశించామని చెప్పారు.

Updated Date - Apr 19 , 2024 | 12:03 AM