Share News

హమ్మయ్య.. చిక్కింది

ABN , Publish Date - Apr 02 , 2024 | 11:48 PM

తీరప్రాంతవాసులకు కొన్నినెలలుగా కంటిమీది కునుకు లేకుండా చేస్తున్న ఎలుగుబంటిని జూ అధికారులు చాకచక్యంగా పట్టుకుని బోనులో బంధించారు. వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరులో సోమవారం అర్ధరాత్రి పాడుపడిన ఇంట్లోకి ఎలుగుబంటి ప్రవేశించింది.

హమ్మయ్య.. చిక్కింది
ఇంట్లో ఉన్న ఎలుగుబంటిని బంధించేందుకు ప్రయత్నిస్తున్న అటవీశాఖ, జూ అధికారులు ... ఇన్‌సెట్‌లో బోనులో ఎలుగుబంటి

- పాడుపడిన ఇంట్లో పట్టుబడిన ఎలుగుబంటి

- ఊపిరి పీల్చుకున్న ప్రజలు

వజ్రపుకొత్తూరు, ఏప్రిల్‌ 2: తీరప్రాంతవాసులకు కొన్నినెలలుగా కంటిమీది కునుకు లేకుండా చేస్తున్న ఎలుగుబంటిని జూ అధికారులు చాకచక్యంగా పట్టుకుని బోనులో బంధించారు. వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరులో సోమవారం అర్ధరాత్రి పాడుపడిన ఇంట్లోకి ఎలుగుబంటి ప్రవేశించింది. ఆ సమయంలో కుక్కలు బిగ్గరగా అరవడంతో స్థానికులు కొమర దమయంతి, గండుపల్లి మోహన్‌ చూడగా ఎలుగుబంటి కనిపించింది. వేకువజామున 5 గంటలకు స్థానికులు అటవీ శాఖాధికారులకు సమాచారం అందజేశారు. అటవీశాఖాధికారిణి నిషాకుమారి ఆధ్వర్యంతో అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఎలుగుబంటిని బయటకు పంపించే ప్రయత్నాలు చేశారు. ఇంటిచుట్టూ వలలు, ఇనుప ఊచలు అడ్డంగా ఉంచారు. ఎలుగుబంటిని పట్టుకోవాలనే ఉద్దేశంతో విశాఖపట్నం జూ అధికారులకు సమాచారం అందజేశారు. మంగళవారం మధ్యాహ్నం రిస్క్యూటీం చేరుకొంది. గతంలో కిడిసింగి వద్ద మత్తుమందు ఇచ్చి పట్టుకున్న ఎలుగుబంటి మృతి చెందింది. ఈ నేపథ్యంలో మత్తుమందు లేకుండా ఎలాగైనా ఎలుగుబంటిని బంధించాలనే ఉద్దేశంతో బోనును ఇంటిముందు ఉంచారు. ఇంటి పైకప్పుపైన, వెనుక నుంచి శబ్దాలు చేశారు. దీంతో ఇంటిలోపల నుంచి ఎలుగుబంటి బయటకు రాగా బోనులో బంధించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సుమారు 12 గంటల పాటు 50మంది సిబ్బంది శ్రమించి ఎలుగుబంటి బంధించడంతో గ్రామస్థులు అభినందించారు. ఎలుగుబంటిని విశాఖ జూకు తరలించినట్టు అధికారులు తెలిపారు. రిస్క్యూటీంలో డీఎఫ్‌వో నిషాకుమారి, సబ్‌ డీఎఫ్‌వో నీరంజన్‌, రెడ్డి, పోలయ్య, వెంకటరావు ఉన్నారు.

Updated Date - Apr 02 , 2024 | 11:48 PM