Share News

ప్రచారానికి వెళ్తే రూ.500

ABN , Publish Date - May 03 , 2024 | 12:14 AM

పోలింగ్‌కు మరో పది రోజులే సమయం ఉండడంతో అభ్యర్థులు ప్రచారం మమ్మురం చేస్తున్నారు.

ప్రచారానికి వెళ్తే రూ.500
టెక్కలిలో టీడీపీ ఎన్నికల ప్రచారంలో వాయిద్య కళాకారులు

- ఉదయం టిఫిన్‌..మధ్యాహ్నం భోజనం

- కూలీలు, కళాకారులకు పెరిగిన గిరాకీ

(నరసన్నపేట/టెక్కలి)

పోలింగ్‌కు మరో పది రోజులే సమయం ఉండడంతో అభ్యర్థులు ప్రచారం మమ్మురం చేస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పాట్లుపడుతున్నారు. ఊరూరా తిరుగుతూ తమకు ఓటు వేయాలని వేడుకుంటున్నారు. వారి తరపున ముఖ్యనాయకులు, కార్యకర్తలు సైతం తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొనేందుకు శ్రమిస్తోన్నారు. అయితే ఎన్నికల ప్రచారానికి కేడర్‌ సరిపోని పార్టీలు దినసరి కూలీలను సైతం ఉపయోగిస్తున్నాయి. మరికొన్ని పార్టీలు మాత్రం కేడర్‌ సరిపోయినా తమ బలం నిరూపించుకోవడానికి కూలీలను తమ వెంట తీసుకువెళ్తున్నారు. పనులకు వెళ్లడం కన్నా అభ్యర్థుల వెంట ప్రచారానికి వెళ్లడమే బెటర్‌ అని కూలీలు కూడా భావిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా కూలీలకు గిరాకీ పెరిగింది.

కడుపు నిండా భోజనం

రోజువారీ కూలీలకు పొద్దంతా కష్టపడితే వచ్చే వేతనం కన్నా ప్రచారానికి వెళ్తే వచ్చే డబ్బులే ఎక్కువగా ఉంటున్నాయి. ఉదయం పది గంటల వరకు ప్రచారంలో పాల్గొనే కూలీలకు టిఫిన్‌తో పాటు రూ.500 వరకు అభ్యర్థులు ముట్టజెబుతున్నారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ప్రచారానికి వస్తే రాత్రి భోజనంతోపాటు మందు బుడ్డి, రూ.500 కూడా అభ్యర్థులు ఇస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో అభ్యర్థులు ప్రచారానికి వెళ్లే సమయంలో తమ వెంట జనం కనిపించేందుకు ముందుగానే కూలీలను బుక్‌ చేసుకుంటు న్నారు. అలాగే, పొద్దంతా కష్టపడి అలసిపోయిన నాయకులు, కార్యకర్తలకు అభ్యర్థులు సాయంత్రం వేళ బీరు, బిర్యానీలు సమకూరుస్తున్నట్లు తెలిసింది. అనుచరులు చేజారిపోకుండా ఇవన్నీ ప్రిపేర్‌ చేస్తున్నట్లు సమాచారం. దీంతో మద్యం షాపులు, హాటళ్లకు డిమాండ్‌ పెరిగింది. క్యాటరింగ్‌ చేసే వారికి కూడా చేతినిండా పనిదొరికింది.

ప్రచార సామగ్రి తయారీదారులకు..

ఎన్నికల్లో గెలవాలంటే.. ముందుగా ప్రచారం హోరెత్తాలి. అలా జరగాలంటే అందుకు అవసరమైన వస్తు, వాహనాలను సమకూర్చుకోవాలి. ప్రత్యర్థిపై పైచేయి సాధించాలంటే అంతకుమించి ప్రచార ఆర్భాటం అవసరం. ప్రచారానికి అవసరమైన సామగ్రిని సంబంధిత వ్యక్తులు... సంస్థల నుంచి కొనుగోలు చేయడం... అద్దెకు తీసుకోవడం పరిపాటి. వివిధ రకాల వస్తువులు... వాహనాలు... మైక్‌సెట్లు... డోర్‌ స్టిక్కర్లు, వాహనాల స్టిక్కర్లు, జెండాలు, బెలూన్‌, క్రాకర్స్‌, కండువాలకు ప్రస్తుతం విపరీతమైన డిమాండ్‌. తయారీదారులకు... అద్దెకు ఇచ్చేవారికి ఈ ఎన్నికల్లో చేతినిండా పని దొరుకుతోంది. దీంతో ఎంతో కొంత చేతికి అందుతోంది. ఈసారి పోలింగ్‌కు కాస్త సమయం ఎక్కువగా ఉండడం వీరికి కలసి వస్తోంది.

వాయిద్య కళాకారులకు..

రాజకీయ పార్టీలు ఊరూరా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వేళ పలురకాల వాయిద్య కళాకారులకు డిమాండ్‌ ఏర్పడిది. తీన్‌మార్‌, ఢంకాలు, మేళం, తప్పెటగుళ్లు, ధూంధాడాకా వంటి వాయిద్యకళాకారుల బృందాలు ఎన్నికల ప్రచారాల్లో ముందువరుసలో ఉంటున్నాయి. ముఖ్యంగా టీడీపీ, వైసీపీ వంటి ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారంలో కొన్నిరకాల వాయిద్య బృందాలను తప్పనిసరి చేయడంతో కళాకారులకు డిమాండ్‌ నెలకొంది. పూటకో రేటు, రోజుకో రేటు మాట్లాడుకొని వాయిద్య బృందాలను ప్రచార ఆర్భాటాల్లో ముందుంచుతున్నారు. పలురకాల వాయిద్య కళాకారులు శబ్దాలతో హోరెత్తిస్తున్నారు.

Updated Date - May 03 , 2024 | 12:14 AM