Share News

ముంచేసింది

ABN , Publish Date - Sep 09 , 2024 | 11:58 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. తుఫాన్‌గా మారి.. జిల్లాలో శనివారం నుంచి సోమవారం వేకువజాము వరకు భారీ వర్షం కురిసింది. సిక్కోలు అంతటా జలమయమైంది. వేలాది ఎకరాల్లో పంటలను వరదనీరు ముంచేసింది. తుఫాన్‌ కారణంగా రైతులకు భారీ నష్టం వాటిల్లింది.

ముంచేసింది
పొందూరు : లైదాంలో నీటమునిగిన వరిపంట పొలాలు

- తుఫాన్‌ ప్రభావంతో తీవ్ర నష్టం

- 2,705 ఎకరాల్లో వరి పంట ముంపు

- వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా

- విద్యుత్‌ స్తంభాలు.. ఒరిగిన గోడలు

- సర్వే జరిపితేనే మరింత కచ్చితత్వం

(శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి/ శ్రీకాకుళం కలెక్టరేట్‌)

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. తుఫాన్‌గా మారి.. జిల్లాలో శనివారం నుంచి సోమవారం వేకువజాము వరకు భారీ వర్షం కురిసింది. సిక్కోలు అంతటా జలమయమైంది. వేలాది ఎకరాల్లో పంటలను వరదనీరు ముంచేసింది. తుఫాన్‌ కారణంగా రైతులకు భారీ నష్టం వాటిల్లింది. జిల్లావ్యాప్తంగా 2,705 ఎకరాల్లో వరి పంట ముంపునకు గురైనట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. జలుమూరు, పోలాకి, పొందూరు మండలాల్లో అత్యధికంగా వరి పంట ముంపునకు గురైనట్లు నిర్ధారించారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో బీల భూముల్లో నీరు చేరి... వేలాది ఎకరాల్లో పంటపొలాలు చెరువులను తలపిస్తున్నాయి. వరి పంటతోపాటు.. ఉద్యానవన పంటలు నీట మునిగాయి. అధికారుల బృందం గ్రామస్థాయిలో.. వంశధార సాగునీటి కాలువల పరిధి గ్రామాల్లో సర్వే నిర్వహిస్తే పంట నష్టం అంచనాలో కచ్చితత్వం ఉంటుంది. ప్రస్తుతం తుఫాన్‌ తీరం దాటడంతో మరో రెండు రోజుల్లో పంట నష్టాన్ని అంచనా వేయనున్నారు. అలానే ఉద్దానంలో కొబ్బరి, మామిడి, అరటి, ఇతర ఉద్యానవన పంటల నష్టాలపై నివేదికను సిద్ధం చేస్తున్నారు. పంట నష్టంతోపాటు.. ప్రజలకు, ప్రజల ఆస్తులకు సంభవించిన నష్టంపై సమగ్రంగా నివేదికను సిద్ధం చేయాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌.. జిల్లా అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా.. శ్రీకాకుళం రూరల్‌, మెళియాపుట్టి, కవిటి, కంచిలి, జలుమూరు, సారవకోట, రణస్థలం మండలాల్లో పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. పాతకాలం నాటి ఇళ్ల గోడలు కూలిపోయాయి. లావేరు మండలంలో గెడ్డల ఉధృతికి రహదారులపై భారీగా వరదనీరు ప్రవహించింది. పొందూరు మండలంలో రెల్లిగెడ్డ ఉగ్రరూపం దాల్చింది. లైదాం గ్రామం వద్ద వంతెనపై వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో సంతకవిటి, పొందూరు మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రెల్లిగెడ్డ పరీవాహక గ్రామాలైన లైదాం, గోరింట, గోర్ణపల్లి, తాడివలస, మొదలవలస, బొడ్డేపల్లిలో వందలాది ఎకరాల్లో వరిపంట నీట మునిగింది. అలాగే మొదలవలస వద్ద వంతెనపై వరదనీరు ప్రవహిస్తోంది.

ప్రాజెక్టులు కళకళ

జిల్లాలో వర్షాలతోపాటు ఒడిశా నుంచి వస్తున్న వరదల కారణంగా మహేంద్రతనయ, బహుదా, నాగావళి, వంశధార నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టుల విషయానికొస్తే.. గొట్టాబ్యారేజీ నుంచి గేట్లను ఎత్తివేసి 11,553 క్యూసెక్కుల నీటిని వంశధార నదిలోకి విడిచిపెట్టారు. ఒడిశా నుంచి నేరుగా ప్రాజెక్టులోకి 11,553 క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. అదేనీటిని బయటకు పంపుతున్నారు. నారాయణపురం ఆనకట్టలోకి 13,500 క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. గేట్లను ఎత్తివేసి నాగావళి నదిలోకి 13,500 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టేస్తున్నారు. మడ్డువలస రిజర్వాయర్‌లో 65 మీటర్లు నీరు నిల్వ ఉండేలా చూసుకుంటూ అదనంగా ఉన్న 8,040 క్యూసెక్కుల వరద నీటిని నాగావళి నదిలోకి విడిచిపెట్టారు. ఇక చెరువులన్నీ నిండుకుండల్లా ఉన్నాయి.

పూరీ వద్ద తీరం దాటిన తుఫాన్‌

ఒడిశా రాష్ట్రం పూరీ వద్ద సోమవారం ఉదయం తుఫాన్‌ తీరం దాటింది. మధ్యాహ్నం నుంచి కాసింత తెరిపి ఇచ్చినట్లయింది. వర్షపాతం పెద్దగా ఎక్కడా నమోదు కాలేదు. దీంతో జిల్లా ప్రజలకు ఊపిరి పీల్చుకున్నారు. సాయంత్రం నుంచి హైవేపై వాహనాల రాకపోకలు ఊపందుకున్నాయి.

జాగ్రత్తలు తప్పనిసరి : మంత్రి అచ్చెన్న

భారీ వర్షాల నేపథ్యంలో వినాయక నిమజ్జనోత్సవాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. సోమవారం విజయవాడ నుంచి టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌, అధికారులు, ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించారు. వర్షాల కారణంగా ఎటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా.. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.

వర్షాలు తగ్గినా.. అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

వర్షాలు తగ్గుముఖం పట్టినా, అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌ నుంచి ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, ఆర్డీఓలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఒడిశాలో ఇంకా వర్షాలు కురుస్తున్నాయని, జిల్లాలోని నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుత వర్షాలతో జిల్లాలో కొద్దిపాటి నష్టం వాటిల్లిందని తెలిపారు. ‘రహదారులకు 20 చోట్ల అంతరాయం కలుగగా, ఇప్పటికే 10చోట్ల పునరుద్ధరించాం. 43 గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రెండు చెరువుల్లో లీకేజీ ఉండగా వాటిని పూడ్చాం. పాడైన రెండు ట్రాన్స్‌ఫార్మర్‌లను పునరుద్ధరించారు. 11 విద్యుత్తు స్తంభాలు పడిపోగా వాటిని సరిచేశారు. ఎల్‌ఎన్‌పేటలో చెక్‌డ్యాం సైడ్‌ వాల్‌ దెబ్బతింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 42 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశాం. గొర్రెలు-7, ఎద్దు-1 మృతి చెందాయి. 44మంది గర్భిణులను ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించాం. 152 మెడికల్‌ క్యాంపులు నిర్వహించామ’ని కలెక్టర్‌ తెలిపారు. టెలీ కాన్ఫరెన్స్‌లో డీఆర్వో ఎం.అప్పారావు, జిల్లా అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 09 , 2024 | 11:58 PM