Share News

ఎలా ఉన్నారో?

ABN , Publish Date - May 19 , 2024 | 12:29 AM

విదేశాల్లో వైద్య విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. కిర్గిస్థాన్‌ రాజధానిలో బిష్‌కెక్‌లోని అంతర్జాతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని.. మూకహింస చెలరేగింది. ఈ నేపథ్యంలో భారత్‌, పాకిస్థాన్‌ దేశాలు స్పందించాయి. విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని.. నివాస ప్రాంతాల నుంచి ఎవరూ బయటకు రావద్దని శనివారం సూచించాయి.

ఎలా ఉన్నారో?
కిర్గిస్థాన్‌లో మెడిసిన్‌ చదువుతున్న ఉత్తరాంధ్ర విద్యార్థినులు

- కిర్గిస్థాన్‌లో చిక్కుకున్న 250 మంది వైద్య విద్యార్థులు

- అక్కడ అల్లర్ల నేపథ్యంలో తల్లిదండ్రుల్లో ఆందోళన

- క్షేమ సమాచారంపై ఆరా

- భద్రత కల్పించాలంటూ విదేశాంగ శాఖమంత్రికి ఎంపీ రామ్మోహన్‌నాయుడు లేఖ

(శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి/రణస్థలం, మే 18)

విదేశాల్లో వైద్య విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. కిర్గిస్థాన్‌ రాజధానిలో బిష్‌కెక్‌లోని అంతర్జాతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని.. మూకహింస చెలరేగింది. ఈ నేపథ్యంలో భారత్‌, పాకిస్థాన్‌ దేశాలు స్పందించాయి. విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని.. నివాస ప్రాంతాల నుంచి ఎవరూ బయటకు రావద్దని శనివారం సూచించాయి. కాగా.. కిర్గిస్థాన్‌లో ఏపీకి చెందిన రెండు వేల మంది విద్యార్థులు చిక్కుకున్నారు. అందులో శ్రీకాకుళం జిల్లాకు చెందిన 250 మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమ పిల్లలు ఎలా ఉన్నారోనని కంగారుపడుతూ.. వారి ఆచూకీ కోసం ఆరాట పడుతున్నారు. విద్యార్థినులకు ఫోన్‌ చేసి.. క్షేమసమాచారాలు తెలుసుకుంటున్నారు. అందరూ ప్రస్తుతం క్షేమంగానే ఉన్నామని చెప్పడంతో కాస్త ఊరట చెందుతున్నారు.

- కొద్దిరోజుల కిందట ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం నేపథ్యంలో ఏపీకి చెందిన చాలామంది వైద్య విద్యార్థులు చిక్కుకున్నారు. ఆ సమయంలో భారత ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి అక్కడ వైద్య విద్యార్థులను స్వదేశానికి రప్పించింది. అయితే ఇండియాలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కిర్గిస్థాన్‌లో అల్లర్లు జరగడం భారత వైద్య విద్యార్థులకు శాపంగా మారింది. ఇక్కడ ఇంటర్‌ విద్య పూర్తిచేసుకున్న చాలా మంది విద్యార్థులు వైద్య వృత్తికోసం ఉక్రెయిన్‌, కిర్గిస్థాన్‌ లాంటి దేశాలను ఆశ్రయిస్తుంటారు. అక్కడ అంతర్జాతీయ వివాదాలు, ఇతర దేశాలతో ఉన్న విభేదాలు, సరిహద్దు వివాదాల యుద్ధాలతో భారత విద్యార్థులు నష్టపోవవడం ఆనవాయితీగా వస్తోంది. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం నేపథ్యంలో వేలాదిమంది భారత వైద్య విద్యార్థులు విద్యా సపంవత్సరాన్ని నష్టపోయారు. చాలా రోజులు ఇండియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వందలాది మంది ఇబ్బందిపడ్డారు. సదరు యూనివర్సిటీలు, మెడికల్‌ కాలేజీలు ప్రత్యామ్నాయాన్ని చూపాయి. అది మరువకముందే తాజాగా కిర్గిస్థాన్‌లో అటువంటి పరిస్థితి ఏర్పడింది. దేశ అంతర్గత వ్యవహారంలో తలెత్తిన ఇబ్బందులతో భారత దేశానికి చెందిన వైద్య విద్యార్థులు చిక్కుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

- రణస్థలం మండల కేంద్రానికి చెందిన విద్యార్థి తల్లి మహంతి శ్రీదేవి మాట్లాడుతూ కిర్గిస్థాన్‌ పిల్లలు అగమ్యగోచర స్థితిలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలుగజేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

- ఎచ్చెర్ల మండలం చిలకపాలెంకు చెందిన విద్యార్థి తండ్రి వెంకునాయుడు మాట్లాడుతూ కిర్గిస్థాన్‌లో పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

- మరో విద్యార్థి తల్లి కుసుమిత మాట్లాడుతూ.. తన కొడుకు రెండో సంవత్సరం మెడిసిన్‌ చేస్తున్నాడని, ఈ అల్లర్లు తెలియడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నామని తెలిపారు. తక్షణం కేంద్రం కలుగజేసుకోవాలని కోరారు. అంతర్జాతీయంగా ఎటువంటి సమస్యలు తలెత్తినా భారత విద్యార్థులు చిక్కుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. అందుకే భారత విద్యార్థుల కోసం పటిష్ట చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

- బీజేపీ సీనియర్‌ నాయకుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే అభ్యర్థి నడుకుదుటి ఈశ్వరరావు స్పందిస్తూ.. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిపారు. భారత రాయభార కార్యాలయాలతో మాట్లాడి సత్వర చర్యలు చేపడుతున్నామన్నారు. కిర్గిస్థాన్‌లో చిక్కుకున్న వారిని స్వస్థలాలకు రప్పించేందుకు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

- ఈ ఘటనపై శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్‌నాయుడు స్పందిస్తూ.. విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌కు ప్రత్యేక లేఖ రాశారు. కిర్గిస్థాన్‌లో జరుగుతున్న గొడవల్లో రాష్ట్రానికి చెందిన వైద్యవిద్యార్థుల సమస్యలు తన దృష్టికి వచ్చాయని లేఖలో వివరించారు. విద్యార్థులకు భద్రత కల్పించాలని కోరారు. అలాగే విద్యార్థులు ఎవరూ బయటకు రాకుండా మార్గదర్శకాలు పాటించాలని రామ్మోహన్‌నాయుడు విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.

క్షేమమే..

సరుబుజ్జిలి: సరుబుజ్జిలి మండలంలో ముగ్గురు విద్యార్థినులు.. కిర్గిస్తాన్‌ దేశంలో వైద్య విద్యనభ్యసిస్తున్నారు. ఆ ముగ్గురూ క్షేమంగా ఉన్నట్టు తల్లిదండ్రులకు సమాచారం అందడంతో ఊపిరిపీల్చుకున్నారు. సరుబుజ్జిలి మండలం నందికొండకు చెందిన కూన జగన్నాథం కుమార్తె మాధురి, కొత్తకోటకు చెందిన డోల రామకృష కుమార్తె శ్వేత.. కిర్గిస్తాన్‌ దేశంలోని జలీలాబాద్‌ రాష్ట్రంలో జలీలాబాద్‌ మెడికల్‌ యూనివర్శిటీలో ఎంబీబీఎస్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. నందికొండకు చెందిన సుంకర రమణ కుమార్తె హేమని కూడా అదే దేశంలోని.. ఒక మెడికల్‌ యూనివర్శిటీలో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. ప్రస్తుతం అక్కడ దాడుల సంఘటన నేపథ్యంలో తల్లిదండ్రులు ఆందోళన చెందుతుండగా.. తాము క్షేమంగానే ఉన్నట్టు ఆ విద్యార్థినులు వీడియోకాల్‌ ద్వారా సమాచారం అందించారు. ప్రస్తుతానికి తమ ప్రాంతంలో ఎటువంటి అల్లర్లు, దాడులు లేవని.. విద్యార్థులెవరినీ బయటకు పంపించకుండా యూనివర్శిటీ యాజమాన్యం చర్యలు తీసుకుందని తెలిపారు. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఊరట చెందారు.

Updated Date - May 19 , 2024 | 12:29 AM