Share News

‘మీ కోసం’లో 235 అర్జీల స్వీకరణ

ABN , Publish Date - Jul 08 , 2024 | 11:42 PM

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ‘మీ కోసం’లో వచ్చిన అర్జీలకు సమగ్ర పరిష్కారాన్ని అందించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు.

‘మీ కోసం’లో 235 అర్జీల స్వీకరణ
అర్జీదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

- సమస్యలకు సమగ్ర పరిష్కారం చూపాలి

- కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

కలెక్టరేట్‌ జూలై 8: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ‘మీ కోసం’లో వచ్చిన అర్జీలకు సమగ్ర పరిష్కారాన్ని అందించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘మీ కోసం’ కార్యక్రమంలో వివిధ సమస్యలపై 235 అర్జీలను స్వీకరించారు. ఆ అర్జీలను పరిశీలించి.. వాటి పరిష్కారానికి సంబంధించిన వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. అలాగే జిల్లాలో వివిధ పత్రికల్లో ప్రచురితమైన వార్తలపై అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. ప్రతికూల వార్త అందిన 24 గంటల్లో సంబంధిత అధికారులు వివరణ ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో జేసీ నవీన్‌, ప్రత్యేక ఉప కలెక్టర్‌ సుదర్శన దొర, జడ్పీ సీఈవో వేంకటేశ్వరరావు, డీఎమ్‌హెచ్‌వో బి.మీనాక్షి, డ్వామా పీడీ జీవీ చిట్టిరాజు, డీసీహెచ్‌ఎస్‌ డా.రాజ్యలక్ష్మి, ఇరిగేషన్‌ ఎస్‌ఈ రాంబాబు, ఉద్యానశాఖ అధికారి ప్రసాదరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

లైంగిక వేధింపుల నియంత్రణకు కమిటీ

ప్రతీ కార్యాలయంలో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్‌ మాట్లాడుతూ లైంగిక వేధింపుల చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా ప్రతీ పదిమంది ఉద్యోగులు ఉన్న కార్యాలయంలో కమిటీని ఏర్పాటు చేసి.. సంబంధిత వివరాలు ఐసీడీఎస్‌ కార్యాలయానికి పంపాలని తెలిపారు. సచివాలయాల్లోను ఈ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాస్థాయిలో ఒక కమిటీ(ఎల్‌సిసి) పని చేస్తుందని, పదిమంది కంటే తక్కువ సిబ్బంది పనిచేసే సంస్థలు, కార్యాలయాల ఉద్యోగులు ఈ కమిటీని సంప్రదించవచ్చని సూచించారు.

Updated Date - Jul 08 , 2024 | 11:42 PM