Share News

15కిలోల గంజాయి స్వాధీనం

ABN , Publish Date - Feb 27 , 2024 | 11:37 PM

ఒడిశా రాష్ట్రానికి చెందిన ముగ్గురు యువకులు రైలుమార్గంలో చెన్నైకి గంజాయి తరలిస్తూ మంగళవారం కాశీబుగ్గ పోలీసులకు పట్టుబడ్డారు. 15కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని.. వారిని అరెస్టు చేసి పలాస కోర్టులో హాజరుపరిచారు.

15కిలోల గంజాయి స్వాధీనం
పోలీసుల అదుపులో గంజాయి రవాణాదారులు

- ముగ్గురు ఒడిశా వాసుల అరెస్టు

పలాస, ఫిబ్రవరి 27: ఒడిశా రాష్ట్రానికి చెందిన ముగ్గురు యువకులు రైలుమార్గంలో చెన్నైకి గంజాయి తరలిస్తూ మంగళవారం కాశీబుగ్గ పోలీసులకు పట్టుబడ్డారు. 15కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని.. వారిని అరెస్టు చేసి పలాస కోర్టులో హాజరుపరిచారు. కాశీబుగ్గ ఎస్‌ఐ పారినాయుడు కథనం ప్రకారం... ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా అలిగండ గ్రామానికి చెందిన రమేష్‌నాయక్‌, రాయఘడ జిల్లా గొయిబండా గ్రామానికి చెందిన ఇస్మాయల్‌గంటా, ఆర్‌.ఉదయగిరి బ్లాక్‌ అటిలిమ గ్రామానికి చెందిన ప్రసాద్‌కరడాలు ఆర్‌.ఉదయగిరి ప్రాంతంలో గిరిజనుల వద్ద 15 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. వాటిని ప్యాకెట్లుగా కట్టి లగేజీ బ్యాగుల్లో వేసుకొని చెన్నై వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు మంగళవారం ఉదయం పలాస రైలు ఎక్కేందుకు స్టేషన్‌కు వచ్చారు. వారి కదలికలు అనుమానస్పదంగా ఉండడంతో కాశీబుగ్గ పోలీసులు వారిని వెంబడించారు. వారు పరుగెత్తే క్రమంలో రైల్వేస్టేషన్‌రోడ్డు రైల్వే అధికారుల అతిఽథిగృహం వద్ద పోలీసులకు పట్టుబడ్డారు. వెంటనే వారిని అరెస్టు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ తహసీల్దార్‌ రవికుమార్‌, రెవిన్యూ సిబ్బంది సమక్షంలో గంజాయిని తూకం వేసి నిందితులను కోర్టుకు తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పారినాయుడు తెలిపారు. ఇదిలా ఉండగా పలాస రైల్వే, కాశీబుగ్గ, మందస, ఇచ్ఛాపురం పోలీసుస్టేషన్ల పరిధిలో నెలరోజుల వ్యవధిలో మొత్తం 8 గంజాయి ముఠాలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి భారీస్థాయిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా మూలాలన్నీ ఒడిశాలోని ఆర్‌.ఉదయగిరి బ్లాక్‌ కావడంతో అటునుంచి వచ్చే ప్రయాణికులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.

Updated Date - Feb 27 , 2024 | 11:37 PM