Sharmila : అదానీతో ఒక్క డీల్‌లోనే 1,750 కోట్లు
ABN , Publish Date - Nov 23 , 2024 | 05:54 AM
‘అదానీతో చేసుకున్న ఒక్క డీల్‌లోనే జగన్‌కు రూ.1,750 కోట్ల లంచం ముట్టింది.
ఐదేళ్లలో జగన్‌కు ఇంకెంత లంచం ముట్టిందో?
రాష్ట్రాన్ని అదానీకి బ్లాంక్ చెక్‌లా రాసిచ్చారు
ఇది రాష్ట్రానికి, వైఎస్ కుటుంబానికి అవమానం
కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేయాలి: షర్మిల
అదానీ దేశం పరువు తీస్తే.. జగన్ రాష్ట్రం పరువు తీశారని ధ్వజం
హైదరాబాద్, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): ‘అదానీతో చేసుకున్న ఒక్క డీల్‌లోనే జగన్‌కు రూ.1,750 కోట్ల లంచం ముట్టింది. గత ఐదేళ్లలో అదానీతో ఆయన ఎన్నో ఒప్పందాలు చేసుకున్నారు. వాటన్నింటికీ కలిపి ఇంకెంత లంచం ముట్టి ఉంటుంది?’ అంటూ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. హైదరాబాద్ లోటస్ పాండ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రాన్ని అదానీకి బ్లాంక్ చెక్కులాగా జగన్ రాసిచ్చారని, ఆంధ్రప్రదేశ్‌ను అదానీప్రదేశ్‌గా మార్చేశారని ధ్వజమెత్తారు. ఇది రాష్ట్రానికే కాకుండా.. వైఎ్‌సఆర్ కుటుంబానికీ అవమానమని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అదానీతో జగన్ చేసుకున్న ఒప్పందాలన్నింటినీ సమీక్షించాలని, వాటిపైన విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబును ఆమె డిమాండ్ చేశారు. సోలార్ విద్యుత్తు కొనుగోలుకు సంబంధించి అదానీతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసి, ఆయన కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలని కోరారు. అదానీ, జగన్ లంచాల బాగోతంపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందని, ఇది దేశానికి, రాష్ట్రానికి, వైఎ్‌సఆర్ కుటుంబానికీ అవమానమని ఆవేదన వ్యక్తం చేశారు. అదానీ దేశం పరువు తీస్తే.. జగన్ రాష్ట్రం పరువు తీశారని మండిపడ్డారు.
విద్యుత్తు కొనుగోలు ఒప్పందంతో జగన్‌కు రూ.1,750 కోట్ల లంచం వస్తే.. రాష్ట్ర ప్రజలపైన మాత్రం సర్దుబాటు చార్జీల పేరుతో రూ.17 వేల కోట్ల భారం పడిందని, ఈ ఒప్పందం చేసుకున్నప్పుడు జగన్‌కు రాష్ట్ర ప్రయోజనాలు గుర్తురాలేదా? అని షర్మిల నిలదీశారు. ‘ఇదే అదానీ గుజరాత్‌లో యూనిట్ విద్యుత్తు రూ.1.99 చొప్పున ఇచ్చేలా అగ్రిమెంట్ చేసుకుంటే.. ఏపీతో మాత్రం రూ.2.49కి ఇచ్చేలా ఒప్పదం చేసుకున్నారు. ఈ లెక్కన 25ఏళ్ల ఒప్పందంతో ప్రజలపై పడే భారం రూ.లక్ష కోట్లు. లంచం కోసం డిస్కామ్‌లను, ఏపీ ప్రజలను తాకట్టు పెట్టేందుకు సిద్ధపడిన జగన్‌కు ఎక్కడుంది క్రెడిబిలిటీ?’ అని షర్మిల ప్రశ్నించారు. ‘గంగవరం పోర్టుకు సంబంధించి రూ.9వేల కోట్ల విలువజేసే ప్రభుత్వ పది శాతం వాటాను కేవలం రూ.640 కోట్లకు అదానీకి కట్టబెట్టారు. కృష్ణపట్నం పోర్టును బెదిరించి అదానీకి ఇప్పించారు. రాష్ట్రం మొత్తం బొగ్గు సరఫరా చేసే కంట్రాక్టు, బీచ్ శాండ్ మైనింగ్, విశాఖలో సబ్‌మెరైన్ కంట్రాక్టులనూ వారికే కట్టబెట్టారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీపై అమెరికా అరెస్టు వారెంట్ జారీ చేసిన నేపథ్యంలోనైనా ఆయనపై ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలని, లేకుంటే అదానీ అవినీతిలో మోదీని కూడా భాగస్వామిగా భావించాల్సి వస్తుందని పేర్కొన్నారు. అదానీ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కూడా పునరాలోచన చేయాలని కోరారు. అమెరికా, భారత్ మధ్య ఉన్న ఒప్పదం ప్రకారం అదానీని ఆ దేశానికి అప్పగించాలని, లేకుంటే ఆయనపై ఇక్కడ విచారణ జరిపించాలని, ఈ రెండింటిలో మోదీ ఏం చేయబోతున్నారని షర్మిల ప్రశ్నించారు.