Share News

ఆర్థిక, రాజకీయ దురంధరుడు రోశయ్య

ABN , Publish Date - Apr 30 , 2024 | 04:42 AM

కంచుకంఠం.. మాటల తూటాలు.. ఇంతలోనే చమక్కులు.. ఆ వెంటనే చురుక్కులు.. విపక్షాలు సైతం వ్యక్తిగతంగా విమర్శలు చేయలేనంత గంభీరమైన వ్యక్తిత్వం..

ఆర్థిక, రాజకీయ  దురంధరుడు రోశయ్య

కంచుకంఠం.. మాటల తూటాలు.. ఇంతలోనే చమక్కులు.. ఆ వెంటనే చురుక్కులు.. విపక్షాలు సైతం వ్యక్తిగతంగా విమర్శలు చేయలేనంత గంభీరమైన వ్యక్తిత్వం.. ఇవీ నాలుగు దశాబ్దాలకు పైగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న ఆర్థిక, రాజకీయ దురంధరుడు కొణిజేటి రోశయ్యకు మాత్రమే సొంతమైన లక్షణాలు!

‘‘రాజకీయాల్లో ఆస్తులుకాదు.. ఆప్తులను మాత్రమే సంపాదించుకున్నాను. నాకందరూ మిత్రులే తప్ప శత్రువులు లేరు’’ అని సగర్వంగా చెప్పుకొన్న రోశయ్య.. ఓ సామాన్య కుటుంబంలో జన్మించి స్వయం కృషితో ఉన్నత శిఖరాలు అధిరోహించారు.

1968లో ఎమ్మెల్సీ పదవి ద్వారా చట్టసభలో అడుగుపెట్టిన రోశయ్య.. అనంతర కాలంలో ఎమ్మెల్యే, ఎంపీగా కూడా గెలుపొందారు. ఉమ్మడి ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని స్వీకరించారు.

తర్వాత మంత్రిగా, ముఖ్యమంత్రిగా గవర్నర్‌గా వివిధ పదవులు అలంకరించారు. ఆచార్య ఎన్‌జీ రంగా శిష్యునిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రోశయ్య.. స్వాతంత్య్ర సమరయోధుడిగా,

ఆర్థిక నిపుణుడిగా పేరొందారు. 1979లో టంగుటూరి అంజయ్య కేబినెట్‌లో తొలిసారి మంత్రి అయ్యే అవకాశం దక్కింది. 1982లో కోట్ల కేబినెట్‌లో హోం మంత్రిగా వ్యవహరించారు.

1989, 2004లో చీరాల నుంచి ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989లో మర్రి చెన్నారెడ్డి కేబినెట్‌లో ఆర్థిక, రవాణా, విద్యుత్‌ శాఖల మంత్రిగా పనిచేశారు. 1991లో నేదురుమల్లి కేబినెట్‌లో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్‌ శాఖల మంత్రిగా ఆయా శాఖలకు వన్నె తెచ్చారు.

1995-97 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో నరసరావుపేట నుంచి ఎన్నికై పార్లమెంటులో అడుగు పెట్టారు. ఇక, వైఎస్‌ హయాంలో 2004 నుంచి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

ఇలా మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత రోశయ్య సొంతం. వైఎస్‌ మరణానంతరం 2009, సెప్టెంబరులో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి, 14 నెలల పాటు కొనసాగారు. ఆ తర్వాత తమిళనాడు గవర్నర్‌గా పనిచేశారు.

- గుంటూరు

Updated Date - Apr 30 , 2024 | 04:42 AM