Rammohan Naidu: పులివెందుల ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియట్లే..
ABN , Publish Date - Sep 03 , 2024 | 11:01 AM
రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తప్పనిసరిగా సహాయం చేస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. నేడు ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ నుంచి 25 బృందాలు, 5 హెలికాప్టర్లు వచ్చి సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయన్నారు.
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తప్పనిసరిగా సహాయం చేస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. నేడు ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ నుంచి 25 బృందాలు, 5 హెలికాప్టర్లు వచ్చి సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితిని జాతీయ విపత్తుగా ప్రకటించేందుకు సాంకేతికంగా పరిశీలించాల్సి ఉందన్నారు. కానీ దాని కంటే ఎక్కువగా సహాయం కేంద్రం చేస్తుందని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఒక్కసారి వరద తగ్గి గణన పూర్తయిన వెంటనే నష్టం వివరాలు తెలుసుకుని కేంద్రం సహాయం ప్రకటిస్తుందన్నారు.
ఇప్పటికే ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా.. సీఎం చంద్రబాబుతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ వస్తున్నారని రామ్మోహన్ నాయుడు తెలిపారు. నేవీ హెలికాప్టర్లను కూడా పెంచుతామని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. డ్రోన్స్ ద్వారా ఆహారం అందించడం సాంకేతికంగా పెద్ద మార్పు అని తెలిపారు. డ్రోన్స్‌ను కూడా ఇంకా ఈ రోజు అదనంగా తెప్పిస్తున్నామన్నారు. వరద సమయంలో రాజకీయాలు చేయడం మంచిది కాదన్నారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. వరద బాధితులను అద్దుకోవాల్సింది పోయి ఇష్టానుసారంగా విమర్శలు గుప్పిస్తున్నారని రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం చంద్రబాబు ఇంటికి, బుడమేరుకు సంబధం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు అమరావతిలోకి నీళ్లు ఎక్కడ వచ్చాయని ప్రశ్నించారు. నిన్న ఏబీఎన్‌లోనే అమరావతిలోకి నీళ్లు రాలేదని, రోడ్‌లు అన్నీ క్లియర్‌గా ఉన్నాయని చూపించారు కదా? అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. వరద సమయంలో రాజకీయాలు చేయకూడదనే జ్ఞానం లేకపోతే ఎలా? అని ప్రశ్నించారు. గతంలో ప్రకృతి విపత్తులు వచ్చిన సమయంలో చంద్రబాబు ఏం చేశారో ఒకసారి తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. జగన్ ఇప్పటికైనా మారకపోతే జనం ఇక ఆయనను ప్రజా జీవితం నుంచి బయటకు పంపుతారని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.