Share News

జడ్పీ నిధులు వైసీపీ నేతలకు పందేరం

ABN , Publish Date - Jun 09 , 2024 | 01:15 AM

దర్శి నియోజక వర్గంలో జడ్పీ నిధులను వైసీపీ నాయకులకు పందేరం చేశారు. 90శాతం పనులు నామినేషన్‌ పద్ధతిలో కేటాయించారు. మట్టి పనుల్లో నాలుగు తట్టలు మట్టి చల్లి వైసీపీ నాయకులు లక్షలాది రూపాయలు బిల్లులు చేసుకు న్నారు.

జడ్పీ నిధులు వైసీపీ నేతలకు పందేరం

అరకొర మట్టి పనులతో కోట్లాది రూపాయలు స్వాహా

విచారణ చేయించాలని టీడీపీ డిమాండ్‌

దర్శి, జూన్‌ 8 : దర్శి నియోజక వర్గంలో జడ్పీ నిధులను వైసీపీ నాయకులకు పందేరం చేశారు. 90శాతం పనులు నామినేషన్‌ పద్ధతిలో కేటాయించారు. మట్టి పనుల్లో నాలుగు తట్టలు మట్టి చల్లి వైసీపీ నాయకులు లక్షలాది రూపాయలు బిల్లులు చేసుకు న్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో పూర్తిస్థాయిలో పనులు చేయకపోయినప్పటికీ నాయకుల ఒత్తిడి మేరకు అధికారులు కిక్కురుమనకుండా బిల్లులు చేశారు. జడ్పీ చైర్‌పర్సన్‌ కుమారుడు దర్శి నియోజకవర్గంలో పోటీచేయాలన్న ఆలోచనతోనే అధికశాతం నిధులు ఇక్కడికే కేటాయించారని టీడీపీ కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే గత మూడేళ్లుగా 90శాతం మట్టి పనులకు నిధులు కేటాయించి కార్యకర్తలకు దోచి పెట్టారని విమర్శిస్తున్నారు.

రూ.26.92కోట్లు విడుదల

2019 నుంచి 2023 సంవత్సరం వరకు జిల్లా మొత్తానికి 1,589 పను లకు రూ.74.94 కోట్లు విడుదల చేశారు. అందులో దర్శి నియోజకవర్గానికి అత్యధికంగా 516 పనులకు రూ.26.92 కోట్లు కేటాయించారు. అన్నిగ్రామాల్లో ఎందుకూ ఉపయోగపడని చోట్ల అధికశాతం మట్టిరోడ్లకు నిధులు వినియోగించారు. నామి నేషన్‌ పద్ధతి మీద వైసీపీ కార్యకర్తలకు దోచి పెట్టేందుకు ఒక్కో పనిని రూ.5లక్షల చొప్పున విభజించి కేటాయించారు. ముఖ్య నాయకులకు ఒక్కొక్కరికి నాలుగైదు పనులు కట్టబెట్టి ఎక్కువ లబ్ధి చేకూరేవిధంగా చేశారు. ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఎన్ని పనులు ఎవరికి కేటాయించారో, ఎక్కడ పనులు చేశారో అన్న విషయాలను కూడా అధికారులు చెప్పకుండా గోప్యంగా ఉంచారు. ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జడ్పీ నిధుల ద్వారా కేటాయించిన పనుల వివరాలు బయట పడ్డాయి. నిర్వహించిన పనుల జాబితా చూస్తే అన్నీ మట్టి పనులే ఉన్నాయి. అక్కడక్కడా సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, పేరుకు చెప్పుకోవడానికి తక్కువ సంఖ్యలో ప్రహరీ గోడల నిర్మాణం, గ్రావెల్‌ లెవలింగ్‌ వంటివి ఉన్నాయి.

బిల్లులను నిలిపివేయాలి

జడ్పీ నిధుల ద్వారా అడ్డగోలుగా చేసిన పనులకు బిల్లులు నిలిపివే యాలని టీడీపీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తల జేబులు నింపేందుకు పనులు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌ కుమారుడు ఇక్కడ పోటీచేసే ఆలోచనతో ముందస్తు ప్రణాళికలో భాగంగా జడ్పీ నిధులను వైసీపీ కేడర్‌కు దోచిపెట్టారని వారు విమర్శిస్తున్నారు. అక్రమాలను నిగ్గుతేల్చేందుకు విజిలెన్స్‌ అధికారుల ద్వారా విచారణ చేయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని టీడీపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు.

Updated Date - Jun 09 , 2024 | 01:15 AM