Share News

ఆదాయం కోసం ఆరాటం!

ABN , Publish Date - Jul 28 , 2024 | 11:09 PM

ఒంగోలు కార్పొరేషన్‌లో ఐదు విభాగాలు ఉన్నాయి. వాటి ద్వారా పాదర్శకంగా పౌర సేవలను అందించాల్సి ఉంది. అయితే రెవెన్యూ విభాగంలో అవినీతి రాజ్యమేలుతోంది. ప్రత్యేకించి ఆర్‌ఐ పోస్టులకు ఉన్న డిమాండ్‌ అటు కమిషనర్‌ స్థాయి అధికారికి కూడా లేదంటే అతిశయోక్తి కాదు.

ఆదాయం కోసం ఆరాటం!

కార్పొరేషన్‌లో ఆర్‌ఐ పోస్టులకు డిమాండ్‌

టీడీపీ నాయకుల ఆశీస్సుల కోసం ప్రయత్నాలు ముమ్మరం

గత వైసీపీ పాలనలో అడ్డగోలుగా వ్యవహరించిన

కొందరు మళ్లీ కొనసాగేందుకు పావులు

కొత్తవారికి అవకాశం ఇవ్వాలంటున్న ఆశావహులు

అవినీతికి ఆస్కారం లేకుండా ప్రక్షాళన వైపు ఎమ్మెల్యే దామచర్ల దృష్టి

ఒంగోలు కార్పొరేషన్‌లో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ (ఆర్‌ఐ) పోస్టులకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. రెవెన్యూ విభాగం ప్రక్షాళన ఖాయమని తేలడంతో ఆదాయం వచ్చే ఆ సీట్ల కోసం కొందరు ఆరాటపడుతున్నారు. గత వైసీపీ పాలనలో ఆపార్టీ పెద్దల ఆశీస్సులతో కొందరు ఆర్‌ఐలు అక్రమార్జనే ధ్యేయంగా అడ్డగోలుగా వ్యవహరించారు. అడిగినంత ఇస్తేనే ఇంటి పన్ను విధించారు. ముఖ్యంగా డిప్యూటీ మేయర్‌ బంధువులుగా ఇద్దరు కార్యాలయంలో పెత్తనం చెలాయించారు. మేయర్‌ అండతో ఒక ఆర్‌ఐ రెచ్చిపోయారు. వీరితోపాటు మరికొందరు కూడా అంతా మా ఇష్టం అన్నట్లు వ్యవహరించారు. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో వారు తమ సీట్లను కాపాడుకునే పనిలో పడిపోయారు. తాము నిజాయితీపరులమని, వైసీపీతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ టీడీపీ నేతల వద్దకు రాయబారాలు నడుపుతున్నారు. కొత్తవారికి అవకాశం ఇవ్వాలంటూ మరికొందరు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రస్తుత ఆర్‌ఐలు, కొత్తగా వచ్చేందుకు ఆసక్తి చూపుతున్న వారి మధ్య ఇటీవల మాటల యుద్ధం నడిచినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వ్యవహారం కార్పొరేషన్‌ కార్యాలయంలో చర్చనీయాంశంగా మారింది.

ఒంగోలు (కార్పొరేషన్‌), జూలై 28 : ఒంగోలు కార్పొరేషన్‌లో ఐదు విభాగాలు ఉన్నాయి. వాటి ద్వారా పాదర్శకంగా పౌర సేవలను అందించాల్సి ఉంది. అయితే రెవెన్యూ విభాగంలో అవినీతి రాజ్యమేలుతోంది. ప్రత్యేకించి ఆర్‌ఐ పోస్టులకు ఉన్న డిమాండ్‌ అటు కమిషనర్‌ స్థాయి అధికారికి కూడా లేదంటే అతిశయోక్తి కాదు. ఇంటి పన్ను విధించాలన్నా, తగ్గించాలన్నా, ఖాళీ స్థలాలకు పన్నులు వేయాలన్నా ఆర్‌ఐలను ప్రసన్నం చేసుకోవాల్సిందే. అదనపు ఆదాయం దండిగా వచ్చే సీటు కావడంతో ఆ పోస్టులకు భారీ డిమాండ్‌ ఉంటుంది. గత వైసీపీ హయాంలో ఆపార్టీ పెద్దల ఆశీస్సులతో ఆర్‌ఐలుగా కొందరు హవా సాగించారు. అక్రమార్జనే ధ్యేయంగా ముందుకు సాగి కార్పొరేషన్‌ ఖజానాకు గండికొట్టారు. ఇటీవల ఎన్నికల్లో ప్రభుత్వం మారింది. ప్రస్తుతం కార్పొరేషన్‌లో కీలకంగా వ్యవహరించే కొందరు అధికారుల మార్పు ఖాయమని తేలిపోయింది. తమ పోస్టులను కాపాడుకునేందుకు వారు పావులు కదుపుతున్నారు. ‘ఐదేళ్లుగా ఆ పోస్టులకు దూరమయ్యాం. ఇకనైనా కొత్త వారికి అవకాశం కల్పించండి’ అంటూ మరికొందరు ఉద్యోగులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదేసమయంలో కొందరు దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకుందామనుకున్న రీతిలో భారీగానే చేతివాటం చూపుతుతున్నారు. ఇంకొందరు ఈ రెండు మూడు నెలలైనా నిజాయితీగా ఉంటే తమ సీటుకు ఢోకా ఉండదన్న భావనలో ఉన్నారు. మొత్తంగా కార్పొరేషన్‌ రెవెన్యూలో నడుస్తున్న వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

మేయర్‌ అండతో బిల్డర్‌ అవతారం ఎత్తిన ఆర్‌ఐ

వైసీపీకి చెందిన మేయర్‌కు అత్యంత సన్నిహితుడుగా ఉన్న మరో ఆర్‌ఐ చేతివాటానికి అడ్డూఅదుపు లేదు. గతంలో ఓ బిల్డింగ్‌ యజమాని నుంచి భారీగా లంచం డిమాండ్‌ చేయడంతో సదరు బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఆయన త్రుటిలో తప్పించుకోగా మరో ఆర్‌ఐ దొరికిపోయాడు. ఈ విషయం కార్యాలయం మొత్తం తెలిసినా మేయర్‌ మనిషికావడంతో ఎవరూ నోరు మెదపలేదు. నగరాని కి చెందిన ఓ బ్యాంకు అధికారి మామిడిపాలెంలోని తన ఇంటికి పన్ను వేయాలని కోరగా ప్లాను ఉన్నప్పటికీ అడిగినంత ఇవ్వలేదన్న అక్కసుతో ప్లాను చించివేసి రెట్టింపు పన్ను విధించారు. ఆదాయం చాలదన్నట్లుగా ఆ ఆర్‌ఐ బిల్డర్‌గా అవతారం ఎత్తాడు. దీన్నిబట్టి ఆర్‌ఐ పోస్టుకు ఉన్న ఆదాయం ఏపాటిదో అర్థమవుతుంది. అయితే వీరు తిరిగి వారి వారి సీట్లు కాపాడుకునేందుకు భారీగానే ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే వీరినే కొనసాగిస్తే భరించే పరిస్థితి లేదని పలువురు బహిరంగంగానే భయపడిపోతున్నారు.

గతంలో వైసీపీతో అంటకాగి.. తాజాగా స్వామి భక్తి

నగరంలో సుమారు 67వేలకు పైగా గృహాలు అధికారికంగా అస్సె్‌సమెంట్‌లు కలిగి ఉన్నాయి. అనధికారికంగా మరో 25వేలకుపైనే ఉన్నట్లు సమాచారం. ఆయా అస్సె్‌సమెంట్‌ల ఆధారంగా నగరంలోని 50 డివిజన్‌లను ఎనిమిది రెవెన్యూ డివిజన్‌లుగా విభజించారు. ఒక్కో డివిజన్‌ పరిధిలోని నివాసాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, ఖాళీ స్థలాలు, హోటల్స్‌, లాడ్జిలు, అపార్ట్‌మెంట్‌లు, విల్లాలకు వారివారి పరిధిలో పన్నులు విధించాల్సి ఉంది. అయితే గత వైసీపీ పెద్దల ఆశీస్సులతో ఆదాయం వచ్చే డివిజన్‌లకు ఆర్‌ఐలుగా ఉన్న వారు ఇప్పుడు వారి సీటును కాపాడుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో ఇద్దరు ఆర్‌ఐలు డిప్యూటీ మేయర్‌ బంధువులుగా ఐదేళ్లపాటు కార్యాలయంలో పెత్తనం చెలాయించారు. అడిగినంత ముట్టచెప్తేనే పన్ను విధించారు. అది కూడా వేల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారు. అనధికారమైనా, ప్లాను ఉన్నా, లేకున్నా, కోర్టులో ఉన్నా సరే వారు అడిగింది చెల్లించుకోవ్చాల్సిందే. అయితే తాజాగా పాలన మారడంతో తాము నిజాయితీపరులమని, వైసీపీతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ ప్రస్తుత పాలకుల వద్దకు రాయబారాలు నడుపుతున్నారు.

సమాచారం సేకరించుకున్న ఎమ్మెల్యే దామచర్ల

కార్పొరేషన్‌లో పౌర సేవలు. పాలనా వ్యవహారాల్లో అవినీతికి ఆస్కారం లేకుండా చూడడంపై ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ దృష్టి సారించారు. కార్పొరేషన్‌ రెవెన్యూ విభాగంలో చోటుచేసుకున్న అవినీతిపై ఆరా తీశారు. గత ఐదేళ్ల నుంచి ఆర్‌ఐలుగా కొనసాగుతున్న వారి జాబితాను ఆయన తీసుకున్నట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వ అండదండలతో వారు వ్యవహరించిన తీరు, అవినీతి గురించి ఆయన సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ప్రక్షాళన తప్పదన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలన్నదే లక్ష్యంగా ఆయన ముందడుగు వేస్తున్నట్లు తెలిసింది. కొద్దిరోజుల క్రితం కార్పొరేషన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించిన దామచర్ల.. అవినీతి ఆర్‌ఐలను సున్నితంగా హెచ్చరించినట్లు తెలిసింది. మొత్తంగా ఆదాయ పోస్టుల కోసం ఆర్‌ఐల ఆరాటం చూస్తుంటే పన్నుల రూపంలో ప్రజల నుంచి భారీగానే ముడుపులు వస్తాయన్న విషయం తేటతెల్లమవుతోంది.

పాలన మారింది.. పరిస్థితులు మాకే అనుకూలం

వైసీపీ హయాంలో ప్రాధాన్యం లేని సీట్లకు పరిమితమైన కొందరు ఉద్య్గోగుల్లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో ఆశలు చిగురించాయి. గడిచిన ఐదేళ్లుగా అణచివేతకు గురయ్యామన్న ఆవేదన వారిలో ఉంది. దీంతో ప్రాధాన్యం కలిగిన సీటు దక్కడం ఖాయమన్న నమ్మకాన్ని వారు పెంచుకున్నారు. ఆర్‌ఐలుగా వచ్చేందుకు తమ పరిధిలో తాము ప్రజాప్రతినిధుల వద్దకు సిఫారసులు ప్రారంభించారు. కొందరైతే పలానా డివిజన్‌ తనకు ఖాయమైందని బహిరంగంగానే చెప్పుకొంటున్నారు.ఈనేపథ్యంలో ప్రస్తుత ఆర్‌ఐలు, కొత్తగా వచ్చేందుకు ఆసక్తి చూపుతున్న వారి మధ్య ఇటీవల మాటల యుద్ధం నడిచినట్లు సమాచారం. ‘మమ్మల్ని ఎవరు తొలగిస్తారో చూస్తాం’ అంటూ వైసీపీ అండదండలతో ఉన్న ఆర్‌ఐలు చాలెంజ్‌ చేస్తుండగా, మా ప్రభుత్వంలో మాకు ప్రాధాన్యం ఉంటుందని మరికొందరు ధీమాను వ్యక్తం చేయడం కార్యాలయంలో చర్చనీయాంశమైంది.

Updated Date - Jul 28 , 2024 | 11:09 PM