బిల్లుల కోసం వైసీపీ నేతలు కొత్త ఎత్తు
ABN , Publish Date - Jun 25 , 2024 | 11:12 PM
దర్శి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులకు పెండింగ్ బిల్లులు మంజూరు చేయించుకునేందుకు వైసీపీ నాయకులు కొత్తమార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగా టీడీపీ కూటమి నాయకులను ప్రసన్నం చేసుకునే యత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరికొందరు గతంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో తమకు ఉన్న పరిచయాల ద్వారా తమ పనులు చేయించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఎంపీ మాగుంటతో పాటు కూటమి నాయకులు వైసీపీ నేతలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ద్వారాలు మూసివేసినట్లు వినికిడి.
టీడీపీ నాయకుల ద్వారా పలువురి యత్నాలు
ఎలాగైనా మాగుంట దగ్గరకు చేరేందుకు వ్యూహాలు
నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి కంటే ఎంపీకి 300 ఓట్లు తక్కువరావడంతో ఆయన ఆగ్రహం
ఇటీవల తాళ్లూరు మండల నేతలు కలిసేందుకు వెళ్లగా అవకాశం ఇవ్వని మాగుంట
దర్శి, జూన్ 25 : దర్శి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులకు పెండింగ్ బిల్లులు మంజూరు చేయించుకునేందుకు వైసీపీ నాయకులు కొత్తమార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగా టీడీపీ కూటమి నాయకులను ప్రసన్నం చేసుకునే యత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరికొందరు గతంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో తమకు ఉన్న పరిచయాల ద్వారా తమ పనులు చేయించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఎంపీ మాగుంటతో పాటు కూటమి నాయకులు వైసీపీ నేతలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ద్వారాలు మూసివేసినట్లు వినికిడి.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, మార్కెటింగ్ శాఖలలో కోట్లాది రూపాయల మేర అభివృద్ధి పనులు చేపట్టారు. కొన్ని పనులు మధ్యలో నిలిచిపోయాయి. అదేవిధంగా జడ్పీ నిధుల ద్వారా కూడా పనులు చేశారు. ఈ పనులకూ బిల్లులు రాలేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో బిల్లులు వస్తాయని ఆ పార్టీ నాయకులు ఎంతో ఆశతో ఎదురుచూశారు. సాధారణ ఎన్నికల్లో వైసీపీ మళ్లీ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది, తమ బిల్లులు మంజూరవుతాయని గట్టి ధీమాతో ఉన్నారు. ఫలితాలు వారి ఆశలను తుంచివేశాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో వారందరూ కంగుతిన్నారు. కోట్లాది రూపాయలు నిలిచిపోవటంతో పెనుభారమై ఇబ్బందులు పడుతున్న వారు.. కూటమి నాయకులను ప్రసన్నం చేసుకొని బిల్లులు చేయించుకునేందుకు కొత్త మార్గాలను అనుసరిస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం తాళ్లూరు మండలంలోని కొందరు వైసీపీ నాయకులు ఎంపీ మాగుంటకు అభినందనలు తెలిపే ఎత్తుగడలో భాగంగా ఒంగోలులోని ఆయన క్యాప్‌కార్యాలయం వద్దకెళ్లారు. ఎంపీని కలిసే ప్రయత్నం చేయగా గేటు బయట గన్‌మ్యాన్లు అడ్డుకొని వెనక్కి పంపినట్లు సమాచారం. నియోజకవర్గంలోని మరికొంతమంది నాయకులు ఎలాగోలా మాగుంటను కలిసి ‘‘మేము మీకు అంతర్గతంగా సహకరించామని, తమను ఆదుకోవాలని’’ కోరగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వాస్తవంగా నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థికి వచ్చిన ఓట్ల కంటే ఎంపీ మాగుంటకు 300 ఓట్లు తక్కువగా వచ్చాయి. ఈ సమాచారం తెలిసి కూడా వైసీపీ నాయకులు ఎంపీ మాగుంటను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం గమనార్హం. నియోజకవర్గ టీడీపీ, జనసేన నాయకులు వైసీపీ నేతలను దరిదాపులకు కూడా చేరనివ్వటం లేదు. దీంతో వైసీపీ నాయకులు కొంతమంది స్థానిక బీజేపీ నాయకుల ద్వారా పనులు చేయించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
లక్ష్మి నిర్ణయం మేరకే పనులు అంటూ మంత్రుల ప్రకటన
రాష్ట్ర మంత్రులు దర్శి నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆ నియోజకవర్గ నాయకురాలు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ఆధ్వర్యంలోనే జరుగుతాయని ఇప్పటికే స్పష్టం చేశారు. ఎంపీ మాగుంట కూడా దర్శిలో ఎటువంటి కార్యక్రమం చేపట్టాలన్నా కూటమి నాయకులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటున్నారు. దీంతో వైసీపీ నాయకుల కొత్త ప్రయత్నాలు ఎక్కడా ఫలించే అవకాశం లేకుండా పోయింది.