వైసీపీ రాజీ డ్రామా
ABN , Publish Date - Apr 03 , 2024 | 01:16 AM
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వలంటీర్లు విధుల్లో ఉండటానికి వీల్లేదన్న ఎన్నికల కమిషన్ ఆదేశాలతోవైసీపీ నేతల్లో కలవరం మొదలైంది.

వలంటీర్లుగా వద్దు.. పార్టీ కార్యకర్తలుగా పనిచేయండి
28 మందితో రాజీనామాలు చేయించిన కార్పొరేటర్
ఒంగోలు (కార్పొరేషన్), ఏప్రిల్ 2: ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వలంటీర్లు విధుల్లో ఉండటానికి వీల్లేదన్న ఎన్నికల కమిషన్ ఆదేశాలతోవైసీపీ నేతల్లో కలవరం మొదలైంది. డివిజన్లలో పార్టీ ప్రచార కార్యక్రమాలకు కీలకంగా వ్యవహరించే వలంటీర్లు దూరంగా ఉండటం ఇష్టం లేనివైసీపీ నేతలు కొత్త ఎత్తుగడలకు తెరతీశారు. ఇప్పటికే వలంటీర్‌కు వందనం అంటూ భారీగా బహుమతులతోపాటు నగదు కూడా ఇచ్చి తమ చేతిలోనే ఉంచుకున్నారు. అయితే వారి ఎత్తులకు ఈసీ చెక్ పెట్టి వలంటీర్లు ప్రచారంలో కనిపించకూడదని హెచ్చరించడంతో దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ఈ మేరకు వలంటీర్ ఉద్యోగం మేమే ఇచ్చాం. ఇప్పుడు పోస్టు వద్దు వైసీపీ కార్యకర్తలుగా పనిచేయండని సూచిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వస్తే మిమ్మల్నే మళ్లీ వలంటీర్‌ను చేస్తామని నమ్మబలుకుతున్నారు. దీంతో పలువురు వలంటీర్లు తమ ఉద్యోగాలను వదిలేస్తూ రాజీనామా డ్రామాలకు తెరతీశారు. అయితే నిబంధనల ప్రకారం స్వచ్ఛందంగా వారు పనిచేసే సచివాలయ అడ్మిన్ అధికారికో, వారిపై ఉన్నతాధికారి అయిన కార్పొరేషన్ కమిషనర్‌కో తమ రాజీనామా పత్రాలు అందజేయాలి. కానీ అలా చేయడం లేదు. మంగళవారం నగరంలోని 21 డివిజన్ పరిధిలోని 31, 32 సచివాలయాలలో పనిచేసే 28 మంది వలంటీర్లు తమ సేవలకు స్వస్తి చెప్పారు. ఆ డివిజన్ కార్పొరేటర్ యనమల నాగరాజు మాత్రం అత్యుత్సాహం చూపి, నిబంధనలను మరిచిపోయారు. ఆయనే అందరినీ ఒకచోట చేర్చి రాజీడ్రామాకు తెరతీశారు. కొందరిపై ఒత్తిడి తీసుకొచ్చి పోస్టు వదిలేయండి.. మా కార్యకర్తలుగా పనిచేయండి అంటూ కొత్త డ్రామాలు మొదలు పెట్టారు. ఈ రెండు నెలలపాటు మీకు అందించే పారితోషికం పార్టీ నుంచి ఇస్తామని చెప్పడం ఇక్కడ విశేషం. కాగా అందరితో తానే రాజీనామా పత్రాలు రాయించి అదేదో ఘనకార్యం చేసినట్లు వాటిని చూపుతూ ఫొటోలు దిగి మీడియాకు ఇచ్చారు.