Share News

వైచీప్‌ ట్రిక్స్‌!

ABN , Publish Date - Apr 03 , 2024 | 01:24 AM

పశ్చిమ ప్రాంతంలో వైసీపీ నేతలు బరితెగించారు. గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీలోకి ఏడాదిన్నర క్రితం ప్రారంభమైన వలసలు ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన అనంతరం భారీగా పెరిగిపోయాయి.

వైచీప్‌ ట్రిక్స్‌!

గిద్దలూరులో బెదిరింపులు

మార్కాపురంలో నీళ్ల రాజకీయం

అధికార పార్టీ నేతల బరితెగింపు వ్యవహారాలు

కదలని పార్టీ కేడర్‌.. పలకని ఓటర్లు..

పొలోమని టీడీపీ కూటమిలోకి వలసలు

సమస్యలు పట్టవా అంటూ నిలదీస్తున్న ప్రజలు

పశ్చిమ ప్రాంతంలో వైసీపీ నేతలు బరితెగించారు. గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీలోకి ఏడాదిన్నర క్రితం ప్రారంభమైన వలసలు ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన అనంతరం భారీగా పెరిగిపోయాయి. తాయిలాలు ఆశచూపినా అవి ఆగకపోవడంతో వైసీపీ అభ్యర్థి పక్షాన పనిచేస్తున్న ముఖ్యనాయకులు బెదిరింపు రాజకీయాలకు తెగబడుతున్నారు. ఇక మార్కాపురంలో తాగునీటి సమస్యతో సతమతమవుతున్న ప్రజలు ‘మా ఎమ్మెల్యే ఏరి.. మా సమస్యలు పట్టవా’ అంటూ నిలదీస్తున్నారు. దీంతో హడావుడిగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసే ప్రలోభ రాజకీయాలకు వైసీపీ తెరతీసింది. ఇదేసమయంలో పార్టీలోని కిందిస్థాయి పదవుల్లో ఉన్న నాయకులను క్రియాశీలకం చేసుకునేందుకు వారి జేబులు నింపే చర్యలకు పాల్పడుతున్నారు. దీంతో రెండు నియోజకవర్గాల్లో ప్రజలు వైసీపీ నేతల వ్యవహారశైలిని చూసి విస్తుపోతున్నారు.

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

ఒంగోలు లోక్‌సభ పరిధిలో బెదిరింపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గాల్లో ఆ వ్యవహారాలు ఎక్కువయ్యాయి. ప్రధానంగా ఎమ్మెల్యేలను మార్చి వైసీపీ అసెంబ్లీ అభ్యర్థులుగా జగన్‌ ఆస్థానాల్లో రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. దీనికి తోడు ఎంపీ మాగుంటను తప్పించి తిరుపతి జిల్లా నుంచి దిగుమతి చేసుకున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే జగన్‌ వ్యూహానికి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలి అభ్యర్థులు బిత్తరపోయారు. తొలుత ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కన్నా పార్టీ కేడర్‌ను దారిలోకి తెచ్చుకోవడానికే రకరకాల ప్రలోభాలకు పాల్పడాల్సి వచ్చింది. ఆరంభంలోనే ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి ప్రోత్సాహంతో పార్టీ నేతలకు డబ్బులతో వల విసిరారు. పార్టీ కౌన్సిలర్లకు గిద్దలూరులో రూ.2లక్షలు, మార్కాపురంలో లక్ష ప్రకారం డబ్బులు ఇచ్చారు. మార్కాపురంలో ఒక్కొక్కరికీ మరో రూ.2లక్షలను, గిద్దలూరులో మరో లక్ష ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. కేవలం కౌన్సిలర్లకు డబ్బులు ఇవ్వడంతో ఆ వార్డుల్లోని పార్టీలోని క్రియాశీల రాజకీయ నాయకులు ఎదురుతిరిగారు. దీంతో మార్కాపురంలో కౌన్సిలర్లను పిలిచి ప్రతి వార్డులో ఐదుగురు కార్యకర్తలకు ఒక్కొక్కరికి రూ.10వేల ప్రకారం ఇవ్వమని చెప్పి ఆ మేరకు అందజేశారు. గిద్దలూరు నియోజకవర్గంలో గ్రామాల నుంచి పోటీపెరగడంతో ప్రస్తుతం వైసీపీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులకు కూడా భారీగా ముట్టజెప్పే పనిలో నిమగ్నమ య్యారు.

గిద్దలూరులో వలసలను ఆపేందుకు హత్య

గిద్దలూరులో బెదిరింపు రాజకీయాలకు వైసీపీ శ్రీకారం పలికింది. ఈ నియోజకవర్గంలో ఏడాదిన్నర నుంచి టీడీపీలోకి వలసలు పెరిగాయి. టీడీపీ అభ్యర్థి అశోక్‌రెడ్డి పకడ్బందీగా పెంచుకున్న ప్రజాసంబంధాలు అందుకు కారణమయ్యాయి. మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డిని వైసీపీ గిద్దలూరు అభ్యర్థిగా దింపడం, ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో వలసలు పెరిగిపోయాయి. దీంతో బెదిరింపు రాజకీయాలకు శ్రీకారం పలికారు. ఇటీవల మునయ్య అనే గిరిజన యువ నాయకుడిని వైసీపీకి చెందిన వారు పథకం ప్రకారం హత్యచేసిన విషయం విదితమే. మునయ్య ఏడాదిన్నర క్రితం వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. ఈ హత్యతో వలసలకు బ్రేక్‌ పడుతుందనే అధికారపార్టీ నేతల ఆశలు గల్లంతై చేరికలు ఇంకా రెట్టింపయ్యాయి.

టీడీపీలో చేరే వారికి బెదిరింపులు

ఇటీవల వైసీపీలోని ఒక బీసీ, ఒక రెడ్డి సామాజికవర్గానికి చెందిన నాయకులు టీడీపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరిగింది. అందులో ఒకరితో వైసీపీ అభ్యర్థి సమీప బంధువు సమావేశమై.. ‘ఈసారికి పోటీ ఉంటుంది. లారీ వచ్చి ఢీకొంటుంది. కట్‌ చేస్తే అందులో మీరు ప్రాణాలతో ఉండరు’ అంటూ ఒక సినిమా కథ చెప్పి బెదిరించినట్లు తెలిసింది. దీనికి ఆ నాయకుడు కూడా దీటుగానే స్పందించినట్లు తెలిసింది. మనందరి ప్రాణాలు ఎప్పుడైనా పోయావే.. కానీయండి చూద్దామని గట్టిగా సమాధానమిచ్చినట్లు సమాచారం. ఇదేసమయంలో ఆదివారం బేస్తవారపేటలో ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన ప్రముఖులంతా టీడీపీలో చేరారు. ఉదయం అశోక్‌రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరినా రాత్రి ఎంపీ మాగుంట, అశోక్‌రెడ్డి కలిసి పాల్గొన్న కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దీంతో బిత్తరపోయిన వైసీపీ అభ్యర్థి, ముఖ్య నాయకులు హుటాహుటిన బేస్తవారపేట చేరారు. ఆర్యవైశ్యులంటే చులకనభావం కాబోలు పార్టీ మారిన వారిని వెనక్కు రండి అంటూ హుకుం జారీచేసినట్లు తెలిసింది. తదనుగుణంగా పలురకాలుగా బెదిరింపు సంకేతాలు వెళ్లినట్లు సమాచారం. సోమవారం ఉదయాన్నే అభ్యర్థి నాగార్జురెడ్డి, ఆయన సోదరుడు కృష్ణమోహన్‌రెడ్డి మరికొందరు ముఖ్య నాయకులు బేస్తవారపేటకు చేరారు. కొంతసేపటికి వారు పార్టీ మారిన బొంతల లక్ష్మణ్‌ అనే నాయకుడి ఇంటికి వెళ్లారు. ఒక అర్ధగంట తర్వాత ఆయన మెడలో తిరిగి వైసీపీ కండువా వేశారు. అనంతరం ఆయన, ఆయన సతీమణి పార్టీలోనే ఉంటున్నట్లు ప్రకటింపజేసి సోషల్‌ మీడియాలో సమాచారం ఇచ్చారు. ఈ బెదిరింపు చర్యలను ఈసడించుకున్న మిగిలిన ఆర్యవైశ్య ప్రముఖులు వారి ఇంటికి వెళ్లేసరికి అక్కడ లక్ష్మణ్‌ దంపతులు కనిపించలేదు. వారిని వైసీపీ నాయకులే ఎవరికీ అందుబాటులో ఉంచకుండా తీసుకెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.

నీటి సరఫరాలోనూ రాజకీయం

మార్కాపురంలో నీళ్ల రాజకీయం తారస్థాయికి చేరింది. ఇక్కడ ఎమ్మెల్యేను గిద్దలూరు పంపిన జగన్‌.. అక్కడి ఎమ్మెల్యే రాంబాబును మార్కాపురం అభ్యర్థిగా రంగంలో దించారు. మార్కాపురం పట్టణానికి మంచినీటి సరఫరా చేసే పైప్‌లైన్‌ కొద్దిరోజుల క్రితం దెబ్బతింది. దానిపై స్పందించి వెంటనే మరమ్మతులు చేసే వారు కరువయ్యారు. నీటి సమస్య తీవ్రమవడంతో ప్రచారానికి వెళ్లిన వైసీపీ నాయకులకు నిలదీతలు ఎదురయ్యాయి. మా ఎమ్మెల్యే ఎక్కడ అంటూ పట్టణవాసులు ప్రశ్నించారు. సమాధానం చెప్పలేకపోయిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. చివరకు ఎంపీ అభ్యర్థి రంగంలోకి వచ్చి ట్యాంకర్‌ ఏర్పాటు చేశారు. ఉభయకుశలోపరి అన్నట్లుగా కౌన్సిలర్లు, ఇతర ముఖ్యనాయకులను పిలిచి ‘మీరే వాహనం పెట్టుకోండి, నేను ఒక్కో ట్రిప్పునకు రూ.450 ఇస్తా, వార్డుకు రోజువారీ 10 ట్రిప్పులు సరఫరా చేయాలి. అందులో వచ్చే ఆదాయంతో మీరు జల్సా చేయండి’ అంటూ ఆదేశాలు ఇచ్చా రు. ఆ తర్వాత ట్రిప్పునకు రూ.450కాదు, రూ.300 ఇస్తానంటూ మాటమార్చారు. అలాగైతే తమకు నష్టం వస్తుందంటూ కౌన్సిలర్లు, నాయకులు ఎదురుతిరిగారు. మధ్యవర్తుల రాయబారాల అనంతరం ట్రిప్పునకు రూ.400 ప్రకారం చెల్లించేందుకు అంగీకారం కుదిరింది. ఆవిధంగా నీటి ట్యాంకర్‌ అద్దె, డ్రైవర్‌ ఖర్చుతో రూ.300కు తోలేందుకు యజమానులతో మాట్లాడుకున్నారు. అయితే నీటిని మారుమూల రైతుల పొలాల్లో కొనుగోలు చేస్తే ఖర్చవుతుందని మున్సిపాలిటీ బోర్ల నుంచే ఇచ్చేవిధంగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ నీరు ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుందో కానీ ఒక్కో ట్రిప్పునకు రూ.400 ఇస్తే అందులో రూ.100 కౌన్సిలర్లు, స్థానిక నాయకులు జేబులోకి వెళ్తాయి. అయితే రోజుకు ఒక్కొక్కరు 10 ట్రిప్పులు మించి నీటి సరఫరా చేయకూడదంటూ షరతు విధించారు. మంచినీటి సరఫరాకు ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోకపోగా ఈ నీళ్ల రాజకీయం ఏంటి అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - Apr 03 , 2024 | 01:24 AM