Share News

వైసీపీ నేతల ‘చెత్త’ ఆలోచన

ABN , Publish Date - Apr 07 , 2024 | 01:41 AM

మార్కాపురం మున్సిపాలిటీలో వైసీపీ నేతల చెత్త ఆలోచనలతో సాధారణ పారిశుధ్య కార్మికులు చిన్నబుచ్చు కుంటున్నారు.

వైసీపీ నేతల ‘చెత్త’ ఆలోచన

మార్కాపురం వన్‌టౌన్‌, ఏప్రిల్‌ 4: మార్కాపురం మున్సిపాలిటీలో వైసీపీ నేతల చెత్త ఆలోచనలతో సాధారణ పారిశుధ్య కార్మికులు చిన్నబుచ్చు కుంటు న్నారు. ఒకరేమో నిత్యం చెత్త కుప్పుల వద్ద తమ జీవితాలు పణంగా పెట్టి పట్టణానికి స్వచ్ఛత సొబగులు అద్దుతుంటే కొందరేమో నేతల పంచన చేరి కడుపులో చల్ల కదలకుండా వారి సేవల్లో తరిస్తున్నారు.

మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 181 మంది ఒప్పంద పారిశుధ్య కార్మికులతో పాటు రెగ్యులర్‌ ఉద్యోగులు మరో 17మంది పనిచేస్తున్నారు. ఒప్పంద కార్మికులకు నెలకు రూ.21వేలు ప్రభుత్వం వేతనం ఇస్తోంది. ఒప్పంద కార్మికులను ఏ పార్టీ అధికారంలో ఉంటే వారు మార్చుకోవడం పరిపాటిగా మారింది. ముఖ్యనాయకులు ప్రాపకం ఉంటేనే ఉద్యోగం ఉంటుంది. ఇక ముఖ్యనేతలు సైతం తమ అనునాయకులకు మున్సిపాలిటీలో కొలువు చూపిస్తున్నారు. పేరుకు అక్కడ కొలువు ఉన్నా.. నిత్యం వారు మాత్రం ఈ నేతల వద్ద స్వామిసేవలో తరించాల్సిందే.

ముఖ్యనేతల ప్రాపకం కోసం ఆరాటం

పారిశుధ్య కార్మికులు నిత్యం చీపుర్లు పట్టి రోడ్లు ఊడ్చడం, పారలతో కాలువలు శుభ్రం చేయడం వంటి కష్టంతో కూడుకున్న పని చేయాలి. అదే నేతల వద్ద అయితే పని తక్కువగా ఉంటుందని భావించే కొందరూ అటువైపు మొగ్గు చూపుతున్నారు. వేతనం కోసం హాజరు, పారిశుధ్య విభాగ అధికారుల వద్ద ఉదయం వేయించుకోవటం ఆ వెంటనే నేతల వద్ద హాజరుకావటం ఆనవాయితీగా మారింది. ఈ విధంగా 30 మంది వరకు సిబ్బంది విధులకు డుమ్మా కొడున్నారు. వీరు అధికార పార్టీ ముఖ్య నాయకుల వద్ద పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు కారు డ్రైవర్లుగా, ఇంకొందరు ఇళ్లల్లో, మరి కొందరు వ్యక్తిగత సహాకులుగా పనిచేస్తున్నారు. ఒక అధికార పార్టీ నాయకుడి వద్ద ఒక కార్మికుడు డ్రైవర్‌గా కొనసాగుతున్నాడు. ఒక నాయకుడైతే సుమారు ముగ్గురిని వ్యక్తిగత సహాకులుగా పెట్టుకున్నట్లు సమాచారం. మరో మాజీ కౌన్సిలర్‌ అయితే సమీప బంధువుల ఇద్దరిని పారిశుధ్య విభాగంలో విధుల్లో చేర్పించారు. ఈ పరాన్నజీవులు గత పదేళ్ల నుంచి పురపాలక సంఘంలో వేతనాలు తీసుకుంటున్నా ఒక్క రోజు కూడా పనిచేసిన దాఖలాలు లేవు. ఉన్నతాఽ దికారులు ఎవరైనా పురపాలక సంఘానికి వచ్చినప్పుడు మాత్రమే అందరు కార్మికులు దర్శనమిస్తారు.

పర్యవేక్షన పెరిగినా మారని తీరు

గతంలో మున్సిపాలిటీ పర్యవేక్షణ విభాగం అంటే ఇద్దరు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు వారి కింద ప్రాంతాల వారీగా కొందరు సూపర్‌వైజర్లు ఉండేవారు. వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు తర్వాత పర్యవేక్షణ భారీ ఎత్తున పెరి గింది. 21 వార్డు సచివాలయాలు ఉండగా ప్రతి సచివాలయంలో శానిటరీ అసిస్టెంట్‌ పోస్టు ఉంది. మున్సిపాలిటీలోని కార్మికులందరినీ వార్డు పరిమాణాన్ని బట్టి కేటాయించి పనులు నిర్వహిస్తున్నారు. గతంలో పోల్చితే శానిటరీ అసిస్టెంట్‌ల ద్వారా పర్యవేక్షణ పెరిగినా విధులకు డుమ్మా కొట్టి నేతల వద్ద పనిచేసే వారిని మాత్రం అదుపు చేయలేకపోతున్నారు. ఎవరైనా శానిటరీ అసిస్టెంట్లు ఇదేంపద్దతి అని ప్రశ్నిస్తే అధికార నాయకుల నుంచి ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. దీంతో చేసేదేమి లేక వారు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో అంతిమంగా పురపాలక సంఘం పారిశుధ్యం పడకేసింది.

నానాటికి తీసికట్టుగా పారిశుధ్యం

మార్కాపురం పట్టణంలోని పారిశుధ్య పరిస్థితి నానా టికి తీసికట్టుగా మారుతోంది. ఏ ప్రాంతంలో చూసినా, చెత్త పేరుకుపోతోంది. కొన్ని వార్డుల్లో పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. ఆయా ప్రాంతాలలో తిరగాలంటేనే ముక్కు పుటాలు అదురుతున్నాయి. ఇంత జరుగుతున్నా పురపాలక పారిశుధ్య విభాగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. జనాభాకు అనుగుణంగా పారిశుధ్య సిబ్బంది ఉన్నా.., వారికి అసలు పనికంటే అధికార పార్టీ నేతల వద్ద సేవలకే సమయం సరిపోతుంది. పదుల సంఖ్యలో ఇలా సిబ్బంది పారిశుధ్య విధులకు దూరంగా ఉండటంతో పరిస్థితి అదుపు తప్పుతోంది. సాధారణంగా వేసవి కాలంలో ఏ ప్రాంతంలోనైనా దోమల ఉధృతి తక్కువగా ఉంటుంది. కానీ మార్కాపురం మాత్రం అందుకు మినహాయింపు. ఏడాది పొడువునా ఇక్కడ దోమలు రాజ్యమేలటం గమనర్హం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ సమస్యపై దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Apr 07 , 2024 | 01:41 AM