Share News

హ్యాట్రిక్‌ విజయంతో కొండపి మరింత అభివృద్ధిలోకి..

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:52 PM

కొండపి నియోజకవర్గ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్‌ విజయం సాధించి, రాబోయే టీడీపీ ప్రభుత్వంలో కొండపి నియోజవకర్గాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం కొండపిలో నామినేషన్‌ వేసిన అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కొండపి నియోజకవర్గం గురించి మాట్లాడుకోవాలంటే దివంగత మంత్రి దామచర్ల ఆంజనేయులు హయాంకు ముందు, తర్వాత అని మాట్లాడుకోవాలన్నారు. పూర్తిగా వెనుకబడిన కొండపి నియోజకవర్గాన్ని దివంగత మంత్రి దామచర్ల ఆంజనేయులు అభివృద్ధి చేస్తే, దాన్ని తాను దామచర్ల కుంటుంబం సహకారంతో కొనసాగించానన్నారు.

హ్యాట్రిక్‌ విజయంతో కొండపి మరింత అభివృద్ధిలోకి..
సభకు భారీగా హాజరైన జనం (ఇన్‌సెట్లో) మాట్లాడుతున్న స్వామి

కొండపి, ఏప్రిల్‌19: కొండపి నియోజకవర్గ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్‌ విజయం సాధించి, రాబోయే టీడీపీ ప్రభుత్వంలో కొండపి నియోజవకర్గాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం కొండపిలో నామినేషన్‌ వేసిన అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కొండపి నియోజకవర్గం గురించి మాట్లాడుకోవాలంటే దివంగత మంత్రి దామచర్ల ఆంజనేయులు హయాంకు ముందు, తర్వాత అని మాట్లాడుకోవాలన్నారు. పూర్తిగా వెనుకబడిన కొండపి నియోజకవర్గాన్ని దివంగత మంత్రి దామచర్ల ఆంజనేయులు అభివృద్ధి చేస్తే, దాన్ని తాను దామచర్ల కుంటుంబం సహకారంతో కొనసాగించానన్నారు. నాలుగు దఫాలుగా ఇక్కడ నుంచే తాను పోటీ చేస్తున్నానన్నారు. ఒకసారి ఓడిపోయాను, రెండుసార్లు గెలిచాను. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి వంద మందిని గుర్తించగలనని, పేర్లు చెప్పి మాట్లాడగలనని అన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు ఎటువంటివారో, వారి అవసరాలేవో? తనకు తెలుసునన్నారు. రైతు,కూలీలు అధికంగా ఉండే నియోజకవర్గంలో తాను ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటున్నానని స్వామి అన్నారు. టీడీపీ హయాంలో నియోజవర్గంలో అన్ని గ్రామాలకు రోడ్లు, ఎస్సీ కాలనీలకు సీసీరోడ్లు, సైడు కాల్వలు నిర్మించుకున్నామన్నారు. నియోజకవర్గంలోని మూడు మండలాలకు సాగరు నీరు అందిస్తున్నామని, రాబోయే టీడీపీ ప్రభుత్వంలో నియోజవర్గంలోని అన్ని గ్రామాలకు తాగునీరు ఇంటింటికీ అందిస్తామన్నారు. నాలుగోసారి తాను పోటీచేస్తుంటే నలుగురు తనపై పోటీచేశారని, ఇక్కడ ప్రత్యర్థులు ప్రజలకు జవాబుదారీగా ఏమి ఉంటారని ఆయన ప్రశ్నించారు. కొత్తగా వచ్చిన మంత్రి సురేష్‌ ఒకసారి అవకాశం ఇవ్వమని అడుగుతున్నాడని, నియోజవకర్గాన్ని నంబర్‌వన్‌ చేస్తానంటున్నాడన్నారు. మరి సురేష్‌ ఎర్రగొండపాలెం, సంతనూతలపాడు నియోజకవర్గాలను ఎందుకు నంబర్‌వన్‌ చేయలేదని ఆయన ప్రశ్నించారు. మంత్రి అసత్యాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. తనను గెలిపిస్తే కొండపి నియోజవకర్గ అభివృద్ధిని మరింతగా కొనసాగిస్తానని స్వామి అన్నారు. ఎంపీ మాగుంట తనయుడు రాఘవరెడ్డి మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తేనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందన్నారు. అధికార పార్టీ ఎంతకైనా తెగబడుతుందని, కార్యకర్తలు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. ఎంపీగా తనతండ్రిని, ఎమ్మెల్యేగా స్వామిని గెలిపించాలని కోరారు. టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి దామచర్ల సత్య మాట్లాడుతూ కొండపికి స్వామి శాశ్వత ఎమ్మెల్యేగా కొనసాగుతాడన్నారు. ప్రజల్లో స్వామికి మంచిపేరు ఉన్నందునే ఇదిసాధ్యమన్నారు. దామచర్ల కుటుంబం కాని, ఎమ్మెల్యే స్వామి కాని నిస్వార్థంగా, అవినీతి రహితంగా పనిచేస్తున్నామన్నారు. అందువల్లే ప్రజల్లో స్వామికి ఆదరణ ఉందన్నారు. కొండపికి ప్రత్యర్థి పార్టీల నాయకులు నలుగురొస్తే అందరూ దోచుకో, దాచుకో అన్న విధంగా పనిచేశారన్నారు. కొండపి అభివృద్ధికి తాను, స్వామి కృషిచేస్తామని, తమకు మద్దతు పలుకున్న పార్టీకార్యకర్తలు, నాయకులు, ప్రజల నమ్మకాన్ని నిలబెడతామని అన్నారు. సమావేశంలో జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్‌, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త మనోజ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే గుండపనేని అచ్యుత్‌కుమార్‌, టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు అడకా స్వాములు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 11:52 PM