నాన్నకు ప్రేమతో..
ABN , Publish Date - Jul 28 , 2024 | 01:24 AM
తండ్రి చూపించిన మార్గం ఆమె విజయానికి పూలబాట వేసింది. ఆయన ప్రోత్సాహం తమీమ్ అన్సారియాను కలెక్టర్‌ను చేసింది. పిల్లల లక్ష్యసాధన విషయంలో తండ్రి సరైన పాత్ర పోషిస్తే.. వారు అతని మాటకు, భావాలకు అనుగుణంగా ముందుకుసాగి ఘనమైన విజయంతో తమ జీవితాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకుంటారనేందుకు తమీమ్ ఒక చక్కని ఉదాహరణ.

బాధ్యతగా భవిష్యత్ చూపారు
ఐఏఎస్ లక్ష్యం నిర్ణయించారు
ఆపై అన్నీ తానై నడిపించారు
అందిపుచ్చుకుని ముందుకు సాగా..
మొదట ఇంజనీరింగ్.. అక్కడే ఉద్యోగం
మళ్లీ సచివాలయంలో గ్రేడ్-3 పోస్టు
తర్వాత సివిల్స్‌కు సిద్ధమై సాధించా
ఐఏఎస్ కావడంతో ఆనందానికి అవధుల్లేవ్
ప్రజలకు సేవచేయడం నాకు ఇష్టం
కలెక్టర్ తమీమ్ అన్సారియా
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
తండ్రి చూపించిన మార్గం ఆమె విజయానికి పూలబాట వేసింది. ఆయన ప్రోత్సాహం తమీమ్ అన్సారియాను కలెక్టర్‌ను చేసింది. పిల్లల లక్ష్యసాధన విషయంలో తండ్రి సరైన పాత్ర పోషిస్తే.. వారు అతని మాటకు, భావాలకు అనుగుణంగా ముందుకుసాగి ఘనమైన విజయంతో తమ జీవితాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకుంటారనేందుకు తమీమ్ ఒక చక్కని ఉదాహరణ. ఆమెను వెన్నంటి ఉండి ముందుకు నడిపించిన తండ్రి అబ్దుల్లా అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. తండ్రీ బిడ్డలు కలిసికట్టుగా అనుకుని ముందుకు సాగితే సాధించలేనిదేమీ లేదని నిరూపించారు. కలెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టి తనకంటూ ప్రత్యేక శైలితో ముందుకెళ్తున్న తమీమ్ అన్సారియా మరోకోణం..
3వ తరగతిలోనే ఐఏఎస్ కల
తమీమ్ అన్సారియాకు 3వతరగతి చదివే రోజుల్లోనే ఐఏఎస్ కావాలన్న బీజం పడింది. అప్పటికి ఆ చిన్నారికి ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని కూడా తెలియదు. కానీ చిల్డ్రన్స్‌డే సందర్భంగా మీరు పెద్దయితే ఏమవుతారో తెలుసుకుని రండి అని ముందుగానే స్కూల్ టీచర్ తెలిపారు. మరుసటి రోజు పాఠశాలకు బయల్దేరే సమయంలో అన్సారియా తన తండ్రిని డాడీ ఏం చెప్పాలని అడిగారు. ఆయన సమాధానం విని ఆమె ఎగురుకుంటూ స్కూల్‌కి వెళ్లి తాను ఐఏఎస్ అవుతానని చెప్పారు. ఆ తర్వాత తండ్రీకుమార్తెలకు ఆ హోదాపై మమకారం పెరిగింది. అన్సారియా ఇంజనీరింగ్ పూర్తిచేసే సమయానికి ఆమె తండ్రి ఐఏఎస్ అధికారుల పనితీరు, సమాజంలో ప్రజాసేవలో వారికుండే అవకాశాలు తెలిపి సివిల్స్ పట్ల ఆమెలో ఆసక్తిని పెంచారు. అందుకే 2010లో తాను ఇంజనీరింగ్ చదివిన అన్నా యూనివర్సిటీలో చేస్తున్న ఉద్యోగాన్ని, 2011లో తమిళనాడు సచివాలయంలో చేపట్టిన పోస్టును ఆమె వదిలేశారు. తండ్రి ఆశను నెరవేర్చాలనే ఏకైక లక్ష్యంతో 2013లో సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. 2015లో లక్ష్యాన్ని సాధించారు. దీంతో అబ్దుల్లా ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. జిల్లా కలెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన అన్సారియా తాను ఐఏఎస్ అధికారి అయ్యేందుకు తండ్రి ఇచ్చిన స్ఫూర్తిని, ప్రోత్సాహాన్ని మననం చేసుకున్నారు.
జీవిత భాగస్వామిని వారే ఎంపిక చేశారు
ఉన్నత విద్యాభ్యాసం చేసి ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్నా వ్యక్తిగత జీవిత విషయాల్లో కూడా పెద్దల మాటకే అన్సారియా ప్రాధాన్యం ఇచ్చారు. వివాహమనే కీలక నిర్ణయంలో కూడా తల్లిదండ్రుల ఆలోచనకు అనుగుణంగా నడి చారు. తండ్రి సూచించిన హర్యానాకు చెందిన ఐఏఎస్ అధికారి డాక్టర్ మంజిల్ జిలానీ సామన్‌ను వివాహం చేసుకున్నారు. వైద్య విద్య పూర్తిచేసిన ఆయన తర్వాత ఐఏఎస్ అధికారి అయ్యారు. సామన్ కుటుంబసభ్యులు తమిళనాడులోని వేలూరులో వైద్య వృత్తిలో ఉన్నారు. వారి ద్వారా సామన్‌తో వివాహన్ని తండ్రి నిశ్చయం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో కేడర్ అధికారులుగా ఉన్న ఇద్దరు 2020లో మన రాష్ట్రానికి బదిలీ అయ్యా రు. ఆతర్వాత ఇక్కడే అంచెలంచెలుగా ఎదుగు తూ జిల్లాకు తమీమ్ కలెక్టర్‌గా వచ్చారు.
పుట్టింది.. పెరిగింది చెన్నైలోనే..
కలెక్టర్ తమీమ్ అన్సారియా పుట్టింది, పెరిగింది, విద్యాభాసం చేసింది అంతా తమిళనాడు రాజధాని అయిన చైన్నెలోనే. ప్రఖ్యాతిగాంచిన అన్నామలై యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదవి అక్కడే ఉద్యోగం చేశారు. ఆతర్వాత మరింత జీతంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చినా వదులుకున్నారు. 2011లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాసి గ్రేడ్-3 ఉద్యోగం సాధించారు. తమిళనాడు సచివాలయంలో ఉద్యోగంలో చేరారు. సొంతూరులో మంచి ఉద్యోగం వచ్చినా తండ్రి చెప్పిన ఐఏఎస్ కాలేదన్న వెలితి ఆమెను వెంటాడింది. దీంతో 2013లో సివిల్స్‌వైపు దృష్టి సారించారు. 2015లో ఐఏఎస్‌కు ఎంపికై ఉత్తరప్రదేశ్‌లో ఉద్యోగం పొందారు. ఆతర్వాత 2013 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సమూల్‌తో వివాహమైంది. ఉత్తరప్రదేశ్‌లో పనిచేస్తున్న ఇద్దరూ 2020లో ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు బదిలీ అయ్యారు. విశాఖ అదనపు కమిషనర్‌గా, ఆతర్వాత శ్రీశైలం ప్రాజెక్టు ప్రత్యేక అధికారిగా, అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన అన్సారియా గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు శ్రీకాకుళం మునిసిపల్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. అక్కడే ఆమె భర్త కలెక్టర్‌గా ఉన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్సారియాకు మన జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు ఇచ్చిన ప్రభుత్వం ఆమె భర్తను మార్క్‌ఫెడ్ ఎండీ, శాప్ సీవోగా నియమించింది.
పట్టుదలతో తెలుగు భాష నేర్చుకున్నారు
ఏరాష్ట్రంలో పనిచేస్తుంటే అక్కడి ప్రజలు మాట్లాడే భాషను నేర్చుకోవడం అనేది విధివిధానాల్లో ఒక భాగం. దానిని చక్కగా అనుసరించి అనర్గళంగా తెలుగు మాట్లాడటం, చదవడం అన్సారియా వంటబట్టించు కున్నారు. ప్రస్తుతం ఆమె తెలుగు సులువుగా చదవగలుగుతున్నారు. అంతకన్నా సులువుగా మాటను అర్థం చేసుకోవడమే కాక మాట్లాడుతున్నారు. తెలుగును అంత సులువుగా నేర్చుకునేందుకు అన్సారియా పెద్ద ప్రయత్నమే చేశారు. తెలుగు సినిమాలు చూడటం, సంగీతాన్ని వినడం ద్వారా ఆమె భాష విషయంలో విజయం సాధించారు.
నిర్ధిష్ట లక్ష్యంతో ముందడుగు
తండ్రి చెప్పినట్లు ఐఏఎస్ సాధించడమే కాక ఒక అధికారిగా ప్రజలకు ఎలాంటి సేవ చేయాలనే విషయంలో నిర్ధిష్టమైన విధానాన్ని తమీమ్ అన్సారియా ఎంచుకున్నారు. పదిమందికి సేవ చేసి సంతృప్తి చెందాలన్న లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నట్లు ఆమె చెప్పారు. జిల్లాకు కలెక్టర్‌గా వచ్చిన కొద్దిరోజుల్లోనే అనేక విషయాల్లో సంతృప్తికరమైన నిర్ణయాలు తీసుకోగలిగానని ఆనందంగా తెలిపారు. ఒక మహిళ ఇటీవల కలెక్టర్‌ను కలిశారు. భర్త చనిపోయి ప్రభుత్వపరంగా అందాల్సిన సహకారం అందక ఏళ్లతరబడి ఇబ్బందుల్లో ఉన్నట్లు ఆమె చెప్పారు. దీనిపై వెంటనే కలెక్టర్ స్పందించారు. సంబంధిత అధికారులందరినీ అప్రమత్తం చేసి ఆమె సమస్యకు వారంరోజుల్లోనే పరిష్కారం చూపారు. ఒక విద్యా సంస్థ నుంచి మరోచోటకు మారి తన సర్టిఫికెట్ల విషయంలో ఇబ్బందిపడుతున్న ఒక విద్యార్థి కూడా అన్సారియాను కలిశాడు. అప్పటికప్పుడు ఆ విద్యాసంస్థ యాజమాన్యంతో మాట్లాడి సదరు విద్యార్థి సమస్యను ఆమె పరిష్కరించారు. అందుకే కాబోలు తన వద్దకు వచ్చిన ప్రతి మనిషి సమస్య ప్రభుత్వ పరిధిలో ఉంటే రోజుల్లోనే పరిష్కరించాలని ఆమె నిర్ణయించుకున్నారు.
చివరి వరకు ఇలాగే ఉంటా..
నా తండ్రి చిరు వ్యాపారి. కష్టపడి మమ్మల్ని చదివించి ఉన్నంతలో ఎలా సంతృప్తిగా జీవించాలో నేర్పించారు. ఇప్పుడు నేను, నా భర్త కూడా ప్రభుత్వ ఉద్యోగులమే. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుగిగా ఉంటే మరింత జీతం రావచ్చు. కానీ ఆనందం ఉండదు. ఐఏఎస్ అధికారిగా సమాజానికి సేవచేస్తూ ఆదాయం కన్నా అధికమైన ఆత్మసంతృప్తి పొందగలుగుతున్నా. నాకు, నా భర్తకు వచ్చే జీతం మాకు సరిపోతుంది. సమాజానికి సేవచేయడం ద్వారా మరింత సంతృప్తి చెందడమే మా లక్ష్యం. అందుకే చివరి వరకూ ఇలాగే కొనసాగుతా.. అంటూ కలెక్టర్ అన్సారియా ఆంధ్రజ్యోతి ప్రతినిధితో తన భావాన్ని వ్యక్తం చేశారు.