అక్రమ రిజిస్ట్రేషన్‌తో.. హాంఫట్
ABN , Publish Date - Jun 19 , 2024 | 11:37 PM
మార్కాపురం ప్రాంతంలో గత ఐదేళ్ల కాలంలో వైసీపీ మూకలు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా అది పట్టా భూమా, ప్రభుత్వ భూమా, చెరువు తొట్టా, పంట కాలువలా అనే తేడా లేకుండా విలువైన అన్నింటినీ దర్జాగా కబ్జా చేశారు. ఐదేళ్ల రాక్షస పాలనకు ప్రజలు చరమగీతం పాడటంతో అన్యాయానికి గురైన వాళ్లు ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న నాధుడేలేడు. ప్రస్తుతం భూములు కోల్పోయిన బాధితులు అధికార పార్టీ నాయకులకు గోడును వెల్లబోసుకుంటున్నారు.
దొంగ పత్రాలు సృష్టించి అనధికార వారసుడితో తతంగం
బయటికి పొక్కడంతో రిజిస్ట్రేషన్ రద్దుచేసుకున్న వైనం
మార్కాపురం, జూన్ 19 : మార్కాపురం ప్రాంతంలో గత ఐదేళ్ల కాలంలో వైసీపీ మూకలు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా అది పట్టా భూమా, ప్రభుత్వ భూమా, చెరువు తొట్టా, పంట కాలువలా అనే తేడా లేకుండా విలువైన అన్నింటినీ దర్జాగా కబ్జా చేశారు. ఐదేళ్ల రాక్షస పాలనకు ప్రజలు చరమగీతం పాడటంతో అన్యాయానికి గురైన వాళ్లు ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న నాధుడేలేడు. ప్రస్తుతం భూములు కోల్పోయిన బాధితులు అధికార పార్టీ నాయకులకు గోడును వెల్లబోసుకుంటున్నారు. స్థానిక ఎస్‌వీకేపీ కళాశాల ఎదురుగా వైసీపీ నాయకులు వేసిన వెంచర్ అంతా అక్రమాలమయమే. అవి పట్టా భూములే అయినా విలువైనవి కావడంతో యజమానులను నయానో భయానో బెదిరించడం, లేదంటే అక్రమ కేసులు పెట్టడం తదితర చర్యల ద్వారా రూ.100 కోట్ల విలువ గల స్థలాన్ని తక్కువ ధరకే కొట్టేశారు. ఈ క్రమంలో ఎలాంటి ఆధారాలు లేని వారి భూములను తప్పుడు పత్రాలు సృష్టించి బినామీలతో దొంగ రిజిస్ర్టేషనల్‌కు కూడా తెగబడ్డారు. అంతేకాక ఆ వెంచర్‌కు అడ్డుగా ఉన్నారని ఆర్‌అండ్‌బీ మార్జిన్‌లో చిన్నపాటి గుడిసెలు వేసుకుని బతుకుతున్న వారిని సైతం వదలకుండా వారి గృహాలను కూల్చేశారు. ఆ వెంచర్‌లో జరిగిన దొంగ రిజిస్ట్రేషన్లు, పలురకాల అక్రమాలపై కొందరు బుధవారం ఒంగోలు వెళ్లి కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
రికార్డులు మార్చి.. అధికారులను ఏమార్చి దోపిడీ
స్థానిక ఎస్‌వీకేపీ కళాశాల ఎదురుగా 889 సర్వే నెంబర్‌లో 6.63 ఎకరాల భూమి ఉంది. మొత్తం పట్టా భూమే. ఆ సర్వే నెంబర్‌లో పలువురికి భూములు ఉన్నా వారసులు ఎవరూ లేకపోవడంతో వైసీపీ ముఖ్య నాయకుని సోదరుడు మరికొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలిసి అక్రమానికి తెరలేపారు. ఆ భూమికి ముందు ఆర్‌అండ్‌బీ స్థలంలో పేదలు నివస్తుండటాన్ని అడ్డుపెట్టుకుని దారి లేకుండా చేసి బేరానికి దిగారు. పెద్దలతో మనకెందుకులే అని కొందరు సుమారు 2 ఎకరాల మేర అమ్మారు. ఆ క్రమంలోనే సర్వే నెంబర్ 889/బి2/ఎ లో 25 సెంట్ల భూమిపై దృష్టి పెట్టారు. వాస్తవానికి ఆ భూమి మద్దెల వెంకటరత్నం అనే వ్యక్తిది. ఆయన 1937వ సంవత్సరంలో ఆ సర్వే నెంబర్‌లో మొత్తం 3.09 ఎకరాలను మద్దెల వెంకటరత్నం, మిట్టపల్లి సుబ్బరాయుడులు ఇద్దరు కలిసి కొన్నారు. 1962వ సంవత్సరంలో ఇరువురు కలిసి 2.59 ఎకరాలను అమ్ముకున్నారు. ఇక ఇరువురికి చెరి 25 సెంట్ల చొప్పున భూమి ఉండేది. కాలక్రమంలో మిట్టపల్లి సుబ్బరాయుడు 25 సెంట్లను అమ్ముకున్నాడు. కానీ వెంకటరత్నం మాత్రం ఆ భూమిని ఎవరికీ విక్రయించలేదు. అంతేకాక ఆయనకు ఎవరూ వారసులు లేరు. భార్య చనిపోయింది. ఆయన కూడా 1984లో మృతిచెందారు. వారసులు ఎవరూ లేకపోవడంతో ఆ స్థలం జోలికి ఎవరూ వెళ్లలేదు. సుమారు రూ.15 కోట్ల విలువైన ఆ భూమిపై కన్నేసిన వైసీపీ ముఖ్య నాయకుని సోదరుడు తన వ్యాపార భాగస్వామితో మద్దెల వెంకటరత్నం కుమారున్ని సృష్టించారు. పట్టణానికి చెందిన మద్దెల అంపయ్య కుమారుడు ప్రసాద్‌ను వెంకటరత్నం కూమారునిగా మార్చి అధికారం చేతిలో ఉండటంతో రికార్డులన్నీ క్షణాల్లో తయారు చేయించారు. 2020లో వెంకటరత్నం డెత్ సర్టిఫికేట్, ఆయన కుమారుడు ప్రసాద్‌గా ప్రాపర్‌పర్సన్ సర్టిఫికేట్ తయారు చేయించారు. అంతేకాక ఆధార్ కార్డును కూడా దొంగది తయారు చేయించి ముందుగా ఖాతా నెంబర్ 2843ను సృష్టించి ప్రసాద్ పేరున పాస్‌బుక్ పొందారు. మద్దెల ప్రసాద్ ద్వారా తొలుత నాయకుని వ్యాపార భాగస్వామి కుటుంబసభ్యులు ఇరువురిపై 2021 ఫిబ్రవరి 13న డాక్యుమెంటు నెంబర్‌లు 8294/2021, 8295/2021లతో రిజిస్ట్రేషన్ చేయించారు. అనంతరం 2023 మార్చి 27న కుటుంబ సభ్యులు ఇరువురితో ముఖ్య నాయకుని సోదరుని వ్యాపార భాగస్వామి గొలమారి లక్ష్మీరెడ్డి డాక్యుమెంట్ నెంబర్ 2364/2023, 360/2023 లతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. తర్వాత ఈ విషయం బయటకు పొక్కి మద్దెల వెంకటరత్నం బందువులకు చేరింది. ఆయనకు ఎలాంటి వారసులు లేరని రెవిన్యూ, రిజిస్ర్టేషన్ శాఖల అధికారులకు తెలిపినా బుట్టదాఖలు చేశారు. దొంగ రిజిస్ర్టేషన్ అని ప్రచారం జరగడంతో అక్కడ స్థలాలు కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో గొలమారి లక్ష్మిరెడ్డితోపాటు ముగ్గురు బందువుల పేరున ఉన్న డాక్యుమెంట్లను 2023 డిసెంబర్ 12న సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రద్దు చేసుకున్నారు.
రిజిస్ర్టేషన్ రద్దు సరే.. స్థలం మాటేమిటి..
అక్రమంగా చేయించుకున్న రిజిస్ర్టేషన్‌లను రద్దుచేయించుకున్న సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారి లక్ష్మిరెడ్డి స్థలాన్ని మాత్రం నేటికీ ఆయన ఆధీనంలోనే పెట్టుకున్నారు. ఈ క్రమంలో మరో నూతన అక్రమానికి తెరలేపాడు. తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మున్సిపల్ నాయకునికి ఈ సైట్‌లో నుంచి వెళ్తేనే ఆయన నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్‌కు, ఓపెన్ సైట్‌లకు విలువ వచ్చేది. ఈ విషయంలో రెండు పార్టీల నాయకులు ఏకమయ్యారు. మద్దెల వెంకటరత్నం స్థలం మాకు కావాలంటూ ఎవరూ వచ్చే అవకాశాలు లేనందున ఆ స్థలాన్ని టీడీపీ నాయకుని అపార్ట్‌మెంట్‌కు వెళ్లే దారికి మళ్లించారు. దీంతో సదరు టీడీపీ నాయకుడు కూడా ఆరు మాసాల క్రితం సిమెంట్ రహదారి నిర్మించుకున్నారు. ఇంతా చేసినా మద్దెల వెంకటరత్నం స్థలం 25 సెంట్లు ఎవరు తేలుస్తారో ఆ దేవునికే తెలియాలి.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లీలలు అన్నీ ఇన్నీ కావు..
889 సర్వే నెంబర్‌లోని వెంచర్‌లో దొంగ రిజిస్ర్టేషన్ చేయించుకున్నది ఒక ఎత్తయితే. అక్కడ వైసీపీ ముఖ్య నాయకుని సోదరుడు, వారి అనుయాయులు చేసిన మోసాలు అన్నీ ఇన్నీ కావు. మార్కాపురం చుట్టుపక్కల సుమారు 5 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా వ్యవసాయ పొలం కింద రిజిస్ర్టేషన్‌లు చేయరు. అన్నీ గజాల్లోనే జరుగుతున్నాయి. కానీ పట్టణంలో అత్యంత ఖరీదైన ఎస్‌వీకేపీ కాలేజీ రోడ్డులోని 889 సర్వే నెంబర్‌లో మాత్రం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అధికారులు అధికారపార్టీ నాయకులకు స్వామిభక్తిని చాటుకొని వ్యవసాయ భూముల కింద రిజిస్ర్టేషన్ చేశారు. ఆ విధంగా కూడా సుమారు రూ.కోటి వరకు రిజిస్ట్రార్ కార్యాలయం ఆదాయం కోల్పోయినట్లు తెలుస్తోంది. అంతేకాక 889 సర్వే నెంబర్‌ను ఆనుకుని ఆర్‌అండ్‌బీ రోడ్డువైపు 207 బి 2, బి 3 సర్వే నెంబర్‌లు ఉన్నాయి. 207లో మొత్తం 60 సెంట్లు ఉండగా ఈ రెండు సబ్ డివిజన్ నెంబర్‌ల ద్వారా మరో 25 సెంట్ల భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా రెవిన్యూ అధికారులు 889, 207 సర్వే నెంబర్‌లలో జరిగిన అక్రమాలను క్షుణ్ణంగా పరిశీలించి వెలికితీసి అక్రమార్కులకు బుద్ధి చెప్పాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.