Share News

రూ.లక్ష ఇస్తారా.. కేసు పెట్టమంటారా!

ABN , Publish Date - Apr 02 , 2024 | 11:39 PM

అనుమతులు లేకుండా బ్యారన్‌ నిర్మిస్తున్న వైసీపీకి చెందిన ఓ రైతుపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన టీడీపీకి చెందిన గ్రామ సర్పంచ్‌ తనయుడిపై ఎస్సై జులుం ప్రదర్శించారు. ఆయన్ను నానా దుర్భాషలాడారు. ఫిర్యాదు కూడా తీసుకోకుండా పంపించారు. అదేసమయంలో నిబంధనలకు విరుద్ధంగా బ్యారన్‌ నిర్మిస్తున్న రైతు నుంచి సర్పంచ్‌ కుమారులు బెదిరిస్తున్నారని ఫిర్యాదు తీసుకున్నారు.

రూ.లక్ష ఇస్తారా.. కేసు పెట్టమంటారా!
మాట్లాడుతున్న డీఎస్పీ శ్రీనివాసరావు

టీడీపీ సర్పంచ్‌ తనయులకు ఎస్సై హెచ్చరిక

రూ.70వేలు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ

టంగుటూరు, ఏప్రిల్‌ 2 : అనుమతులు లేకుండా బ్యారన్‌ నిర్మిస్తున్న వైసీపీకి చెందిన ఓ రైతుపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన టీడీపీకి చెందిన గ్రామ సర్పంచ్‌ తనయుడిపై ఎస్సై జులుం ప్రదర్శించారు. ఆయన్ను నానా దుర్భాషలాడారు. ఫిర్యాదు కూడా తీసుకోకుండా పంపించారు. అదేసమయంలో నిబంధనలకు విరుద్ధంగా బ్యారన్‌ నిర్మిస్తున్న రైతు నుంచి సర్పంచ్‌ కుమారులు బెదిరిస్తున్నారని ఫిర్యాదు తీసుకున్నారు. అనంతరం ఆమె పెద్ద కుమారుడిని స్టేషన్‌కు పిలిపించారు. రూ.లక్ష ఇస్తే కేసు లేకుండా చేస్తానని బేరానికి దిగారు. చివరికి రూ.70వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకీ చిక్కారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కాకుటూరివారిపాలెంలో వైసీపీకి చెందిన ఓ రైతు అనుమతి లేకుండా పొగాకు బ్యారన్లు నిర్మిస్తుండటంపై కొద్దిరోజుల క్రితం అప్పటి పంచాయతీ కార్యదర్శి సాంబయ్య ఎస్‌ఐకి ఫిర్యాదు చేశారు. అయితే సర్పంచ్‌ ఫిర్యాదు చేస్తేనే చర్యలు తీసుకుంటానని ఎస్‌ఐ స్పష్టం చేశారు. టీడీపీకి చెందిన సర్పంచ్‌ వృద్ధురాలు కావడంతో ఆమె తరఫున కుమారుడు వెంకట్రావు స్టేషన్‌కు వెళ్లగా ఆయనపై ఎస్‌ఐ సీరియస్‌ అయ్యారు. ‘నువ్వెవడ్రా.. నువ్వెందుకొచ్చావు’ అని దుర్భాషలాడాడు. తాను సర్పంచ్‌ కుమారుడినని, తన తల్లి ఏడు పదుల వయస్సులో ఉండి రాలేకపోవడంతో ఆమె తరఫున ఫిర్యాదు తెచ్చానని వెంకట్రావు చెప్పాడు. దీంతో ఎస్‌ఐ మరింత రెచ్చిపోయాడు. వెంకట్రావును తీవ్రంగా అవమానించి నేరుగా సర్పంచ్‌ వచ్చి ఫిర్యాదు ఇస్తేనే తీసుకుంటానని స్పష్టం చేశాడు. దీంతో వెంకట్రావు వెళ్లిపోయారు. ఇంతలో అక్రమంగా బ్యారన్‌ నిర్మిస్తున్న మార్టూరి వెంకట్రావు తనను సర్పంచ్‌ తనయులు కొమ్మినేని వెంకట్రావు, శ్రీనివాసరావు బెదిరిస్తున్నారని ఎస్‌ఐకు ఫిర్యాదు చేశారు. దీంతో సర్పంచ్‌ తనయుడు వెంకట్రావును స్టేషన్‌కు పిలిపించిన ఎస్సై.. ‘బ్యారన్లు నిర్మిస్తున్న వెంకట్రావును మీరు బెదిరిస్తున్నట్లు అతని నుంచిఫిర్యాదు వచ్చింది. దీనిపై కేసు నమోదు చేస్తున్నా’ అని స్పష్టం చేశారు. కేసు పెట్టకుండా ఉండేందుకు రూ.లక్ష డిమాండ్‌ చేశాడు. అందుకు ఆయన అంగీకరించాడు. సర్పంచ్‌ రెండో కుమారుడైన శ్రీనివాసరావు తొలివిడత గతనెల 29న ఎస్సైకి రూ.30వేలు ఇచ్చారు. ఆ మొత్తాన్ని బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్ల వద్ద ఉన్న ఓ కేఫ్‌లో ముట్టజెప్పారు. మిగిలిన డబ్బులు త్వరగా ఇవ్వాలని ఎస్‌ఐ హుకుం జారీ చేశారు. దీంతో సర్పంచ్‌ తనయులు వెంకట్రావు, శ్రీనివాసరావు ఈనెల 1న ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు మంగళవారం సర్పంచ్‌ రెండో కుమారుడు శ్రీనివాసరావు టంగుటూరు వచ్చారు. అనంతరం ఎస్‌ఐకి ఫోన్‌ చేశారు. డబ్బులు తెచ్చాను, ఎక్కడికి రమ్మంటారని ఆయన్ను అడిగారు. స్థానిక చెల్లమ్మతోటలోని తన నివాసానికి రావాలని ఎస్‌ఐ సూచించారు. దీంతో శ్రీనివాసరావు నేరుగా అక్కడికి వెళ్లారు. ఎస్‌ఐకు రూ.70వేలు ఇవ్వగా ఆ మొత్తాన్ని ఆయన కారులో పెట్టుకున్నాడు. అప్పటికే అక్కడ మాటువేసి ఉన్న ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఆయన తీసుకున్న రూ.70వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐని అరెస్ట్‌ చేసి ఏసీబీ కోర్టుకు హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ వి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు అపర్ణ, శేషు, ఎస్సైలు జేబీఎన్‌ ప్రసాద్‌, మస్తాన్‌షరీ్‌ఫ ఉన్నారు.

Updated Date - Apr 02 , 2024 | 11:39 PM