Share News

ఎటు తిప్పుతారో..!

ABN , Publish Date - May 26 , 2024 | 02:10 AM

ఈసారి ఎన్నికల్లో ఉద్యోగులు భారీగా ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఆ విషయం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల పోలింగ్‌ సమయంలోనే తేటతెల్లమైంది. తదనుగుణంగా ఉద్యోగుల కుటుంబాల వారూ పెద్దసంఖ్యలో ఓటు వేశారు.

ఎటు తిప్పుతారో..!
చీమకుర్తిలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు వేసేందుకు బారులు తీరిన ఉద్యోగులు (ఫైల్‌)

కీలకంగా ఉద్యోగుల ఓట్లు

పెరిగిన పోస్టల్‌ బ్యాలెట్లు, సర్వీసు ఓట్లు

నువ్వా..నేనా? అన్న పోటీలో అవే అభ్యర్థి తలరాత మార్చే అవకాశం

కొనుగోలుపైనే వైసీపీ ఆశ

ప్రభుత్వ వ్యతిరేకతపై కూటమి నమ్మకం

ఈసారి ఎన్నికల్లో ఉద్యోగులు భారీగా ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఆ విషయం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల పోలింగ్‌ సమయంలోనే తేటతెల్లమైంది. తదనుగుణంగా ఉద్యోగుల కుటుంబాల వారూ పెద్దసంఖ్యలో ఓటు వేశారు. అలాగే సర్వీసు ఓట్లూ వస్తున్నాయి. దీంతో ఈ పర్యాయం అవి కీలకంగా మారనున్నాయి. ప్రత్యేకించి పోలింగ్‌ సరళిని బట్టి ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ నువ్వానేనా? అన్నట్లు జరిగిందని భావిస్తున్న నియోజకవర్గాల్లో గెలుపోటములపై ఈ ఓటర్ల ప్రభావం కనిపిస్తుందని భావిస్తున్నారు. వాటి విషయానికి వస్తే వైసీపీ కొనుగోలుపైనే ఆశగా ఉండగా, ఉద్యోగుల్లో పెల్లుబుకుతున్న ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని కూటమి శ్రేణులు గట్టిగా నమ్ముతున్నాయి. దీంతో తాజాగా ఉద్యోగుల ఓట్లు ఎక్కడెక్కడ ఎలా ప్రభావితం చూపొచ్చు అనే విషయంపై తర్జనభర్జనలు ఆరంభమయ్యాయి.

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

రాష్ట్రవ్యాప్తంగా ఈ ఎన్నికల్లో ఉద్యోగులు ఓటుహక్కు వినియోగించుకునేందుకు పెద్దఎత్తున ఆసక్తిచూపారు. గతంకన్నా రెండింతలు వారి ఓట్లు పోలయ్యాయి. జిల్లాలోనూ అదేస్థాయిలో పోలింగ్‌ పెరిగింది. కొత్త ప్రకాశం జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లోనే రమారమి 23వేల మందికిపైగా ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరుకాక మరో 6,693 మంది దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రధానంగా కేంద్రప్రభుత్వాల పరిధిలో పనిచేస్తున్న సర్వీసు ఓటర్లు ఉన్నారు. జిల్లాలోని ఉద్యోగుల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా నమోదైన ఓటర్లు 96శాతం హక్కు వినియోగించుకున్నారు. సర్వీసు ఓటర్ల పోలింగ్‌ వచ్చేనెల 3వతేదీకి గాని ఒక కొలిక్కి రాదు. ఇప్పుడున్న సమాచారం మేరకు వారిలో కూడా ఇప్పటి వరకూ 1,473 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. దీంతో జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో కొన్నిచోట్ల ఈ ఓటర్ల మనోగతం ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఒక్క పోస్టల్‌ బ్యాలెట్ల రూపంలోనే ఉద్యోగులు పోటీ పడటమే కాదు.. వారి కుటుంబసభ్యులు కూడా అదే స్థాయిలో ఓటుహక్కు వినియోగించుకు న్నారు. ఆ రకంగా చూస్తే జిల్లాలో ఉద్యోగుల కుటుంబీకులు సుమారు 80వేల నుంచి లక్ష వరకు ఉం డొచ్చని అంచనా. ఇక వీరిలో కొందరు వారికున్న పరిచయాలకు అనుగుణంగా ఓటర్లను వారి అభిప్రాయానికి అనుగుణంగా చైతన్యవంతం చేసే పనిలో కూడా కనిపించారు.

బహిరంగంగానే తేల్చిచెప్పారు

చీమకుర్తిలోని ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద గిరిజన సామాజికవర్గానికి చెందిన ఉపాధ్యాయురాలు ‘నేను జగన్‌ విధానాలు నచ్చక తొలిసారిగా టీడీపీ అభ్యర్థికి ఓటేశా’.. అని స్పష్టంగా చెప్పారు. పొదిలిలోని ఎస్సీలు మా కుటుంబాల్లో ఇంటికొక ఉద్యోగి ఉన్నారు. వారిద్వారా ప్రభుత్వ విధానాలు సరిగా లేవని తెలుసుకుని మా కుటుంబాల్లోని అందరం ఈసారి టీడీపీకి ఓటేస్తామని బహిరంగంగా చెప్పారు. మార్కాపురంలో అయితే పలువురు ఆర్టీసీ ఉద్యోగులు ఓటేసిన అనంతరం కూటమి అభ్యర్థిని కలిసి తమ మద్దతును ధైర్యంగానే చెప్పారు. ఒంగోలులో ఒక మహిళా ఉద్యోగి టీడీపీ కూటమి మద్దతు శ్రేణుల వద్దకు వెళ్లి చందా కూడా ఇవ్వడం తెలిసిందే. కొన్నిచోట్ల స్థానిక అభ్యర్థితో ఉన్న సంబంధాలు, పార్టీపరమైన అభిమానంతో గతంలో టీడీపీ ప్రభుత్వంలో స్థానికంగా ఆ పార్టీ నాయకుల ద్వారా ఎదురైన ఇబ్బందులను ప్రస్తావిస్తూ వైసీపీకి ఓటేశామని చెప్పారు. అయితే ఉద్యోగుల్లో కూటమి అనుకూల వాతావరణానికి, వైసీపీ మద్దతుకు మధ్య చాంతాడంత వ్యత్యాసం కనిపించింది.

96శాతంపైగా పోస్టల్‌ బ్యాలెట్ల పోలింగ్‌....

జిల్లాలో పోస్టల్‌ బ్యాలెట్ల పోలింగ్‌ 96శాతం వరకు జరగడం విశేషం. ఒంగోలు అసెంబ్లీలో అత్యధికంగా 4,128 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటుకు దరఖాస్తు చేసుకోగా 4,090 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత గిద్దలూరు నియోజకవర్గంలో అత్యధికంగా 3,456మందికిగాను 3,061మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేశారు. మార్కాపురంలో 2,869కిగాను 2,595మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. కనిగిరిలో 2,662కి 2,389మంది, సంతనూతలపాడులో 1,785కిగాను 1,726మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేశారు. దర్శి నియోజకవర్గంలో 1,747కిగాను 1,727 మంది, కొండపిలో 1,708కిగాను 1,648 మంది, ఎర్రగొండపాలెంలో 1,566కిగాను 1,407 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. సరాసరిన ఈ ఓట్లలో 70శాతం ఒక పార్టీకి అనుకూలంగా పోలైతే ప్రత్యర్థి పార్టీ 2వేల ఆధిక్యతతో ఉన్నా దెబ్బతినక తప్పదు. దీంతో వైసీపీలో నియోజకవర్గం మారి పోటీ చేసిన ఒక ప్రముఖ నాయకుని అనుచరులు ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్ల ఓట్లలో 500 ఓట్ల ఆధిక్యం వస్తుందని, అదే తమ గెలుపులో కీలకమవుతుందని భావిస్తున్నారు. ఉద్యోగుల ఓట్ల ఆధిక్యతకు కొనుగోలు అంశాన్నే కీలకంగా చెప్పుకుంటున్నారు. వారి అంచనా ప్రకారమే కొన్నిచోట్ల ఉద్యోగుల ఓట్లు కీలకంగా మారాయని అనుకున్నా, అది ఎవరికి ఉపయోగపడిందన్న విషయం జూన్‌ 4వ తేదీన తేటతెల్లమవుతోంది.

కూటమివైపు మొగ్గు

అటు పోస్టల్‌ బ్యాలెట్లు, ఆ తర్వాత జరిగిన పోలింగ్‌ సరళిని పరిశీలిస్తే.. ఉద్యోగులు, వారి కుటుంబీకుల ఓట్లు ఎక్కువగా టీడీపీ కూటమికే అనుకూలంగా పోలయ్యాయన్న విషయం స్పష్టమవుతోంది. ఉద్యోగుల్లో వైసీపీ ప్రభుత్వ విధానా లపై ఉన్న వ్యతిరేకతే అందుకు కారణంగా భావిస్తున్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే కొత్తగా ప్రయోజనం కలిగించే విధానాలు లేకపోయినా ప్రతి నెలా ఒకటో తేదీన జీతం వస్తుంది. అలాగే ఇతరత్రా ఆర్థిక ప్రయోజనాల్లో నష్టం ఉండదన్న భావన వారిలో వ్యక్తమైంది. అదేసమయంలో రాజకీయంగా లేక స్థానిక అభ్యర్థులకు అనుగుణంగా టీడీపీకి ఓటు వేసిన వారు కనిపించారు. వీటన్నింటికీ మిన్నగా ఉద్యోగుల ఓట్ల కొనుగోలుకు వైసీపీ శ్రేణులు ఎక్కువ ప్రాధాన్యమిచ్చాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఆ విషయంలో టీడీపీ వర్గం వారు వెనుకడుగు వేయకపోగా.. కొన్నిచోట్ల ఓటుకు రేటు విషయంలో మాత్రం తగ్గినట్లు కనిపించింది. అయితే ఇటు ఉపాధ్యాయుల్లోనూ, ఇతర శాఖల ఉద్యోగుల్లోనూ ప్రాతినిథ్యం వహించే సంఘాల వారు ఎక్కువగా కూటమి అభ్యర్థులను కలిసి మద్దతు పలకడం విశేషం. ఒక నియోజకవర్గంలో కొందరు ఉపాధ్యాయులు కలిసి చందాలు వేసుకుని డబ్బులు అడిగిన ఉద్యోగులకు వారే ఇచ్చి కూటమికి అనుకూలంగా ఓటు వేయించే ప్రయత్నం చేశారు.

మెజారిటీ తక్కువ ఉంటే..

పోలింగ్‌ అనంతరం సరళిని బట్టి ప్రధాన పార్టీల నాయకులు ఆయా నియోజకవర్గాల పరిస్థితులకు అనుగుణంగా వెయ్యి నుంచి పదివేల ఓట్ల ఆధిక్యతతో బయటపడగలమన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మూడు నాలుగు నియోజకవర్గాల్లో అయితే అటు వైసీపీ, ఇటు కూటమి శ్రేణుల్లో కూడా 5 వేలకుపైబడిన ఆధిక్యతతో గెలుస్తామన్న నమ్మకంతో ఉన్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ నేతలు, అభ్యర్థులు ఎక్కువ నియోజకవర్గాల్లో రెండు వేల నుంచి ఆరువేల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందుతామన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో చూస్తే ఒకటి రెండు చోట్ల మిన హా వైసీపీ అభ్యర్థులు వెయ్యి నుంచి ఆరు వేల ఓట్ల ఆధిక్యతతో బయటపడతామన్న ధీమాలో ఉన్నారు. టీడీపీ కూటమి శ్రేణులు రెండు, మూడు నియోజకవర్గాలు మినహాయిస్తే మిగిలిన చోట్ల పదివేలు, ఆపై ఆధిక్యత వస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలా రెండు ప్రధానపార్టీల నాయకుల, అభ్యర్థుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని చూసినా పలుచోట్ల ఉద్యోగుల ఓట్లు, మరీ ముఖ్యంగా కొన్నిచోట్ల పోస్టల్‌ బ్యాలెట్‌, సర్వీసు ఓట్లలో లభించే ఆధిక్యత గెలుపోటములపై ప్రభావం చూపించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

Updated Date - May 26 , 2024 | 02:10 AM