Share News

ప్రయాణికులకు నిలువ నీడేది?

ABN , Publish Date - Aug 24 , 2024 | 11:38 PM

పట్టణంలోని పెద్దబస్టాండ్‌ కూడలి నిత్యం ప్రయాణికుల రాకపోకలతో రద్ధీగా ఉంటుంది.

ప్రయాణికులకు నిలువ నీడేది?

పొదిలి, ఆగస్టు 24 : పట్టణంలోని పెద్దబస్టాండ్‌ కూడలి నిత్యం ప్రయాణికుల రాకపోకలతో రద్ధీగా ఉంటుంది. ఉదయం, సాయంత్రం సమయాల్లో అటు దర్శి, ఇటు చీమ కుర్తి, మర్రిపూడి మండలాలకు చెందిన వివిధ అవసరాలకోసం వచ్చే ప్రయాణికులతో జన సమర్ధంగా ఉంటుంది. గతంలో పంచాయతీ ఆధ్వర్యంలో ప్రయాణికులు వేచి ఉండేందుకు బస్టాండ్‌ కూడలిలో బాలికల ఉన్నత పాఠశాల దక్షిణం వైపు గోడకు పంచాయతీ రేకులుషెడ్డు నిర్మించింది. అప్పట్లో ప్రయాణికులు బస్సుల రాకపోకల కోసం రేకులషెడ్డులో వేచి ఉండేవారు. ఎండకు వానకు ఇబ్బంది పడకుండా ఆశ్రయం పొందే వారు. కాలక్రమేణ చిరువ్యాపారులు రేకుల షెడ్డును ఆక్రమించుకొని వ్యాపారం చేసుకోవడం మొదలైంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్నక్యాంటీన్‌ నిర్మాణం చేయాలనే ఉద్దేశ్యంతో ఆ ప్రాంతంలో ఉన్న భారీ వృక్షాలను రేకుల షెడును తొలగించి పునాదులు వేశారు. అయితే ప్రభుత్వం మారడంతో పునాదులకే అన్నా క్యాంటీన్‌ పరిమితమైంది. దర్శి, అద్దంకి, కురిచేడు, మర్రిపూడి, కొండపి, ఒంగోలు, చీమకుర్తి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో పాటు బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు వారివారి గ్రామాలకు వెళ్లేందుకు బస్సులకోసం బస్టాండ్‌లో వేచి ఉండాల్సి పరిస్థితి ఏర్పడు తోంది. దీంతో ఇక్కడ వేచి ఉండే ప్రయాణికులు ఎండుకు ఎండుతూ, వానకు తడుస్తూ ఇబ్బందులు పడుతున్నారు.

నిత్యం వందలాది మంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరేందుకు గంటల తరబడి ఇక్కడ వేచి ఉంటున్నారు. ఈ సమయంలో వ్యక్తిగత అవసరాలు తీర్చుకునేందుకు మరుగు దొడ్లు కూడా అందుబాటులో లేవు. దీంతో తమ అవస్థలు వర్ణాణాతీతంగా ఉన్నాయని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్‌ సమీపంలోని మరుగుదొడ్లను గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆక్రమించుకునేందుకు వైసీపీ నాయకులు మరుగుదొడ్లను కూల్చి వేసిన సంగతి తెలిసిందే. పట్టణం నడిబొడ్డులోని మరుగుదొడ్లు కూల్చినప్పటికీ, రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు చోద్యం చూశారు. ప్రజల కనీస అవసరాలు తీర్చాల్సిన అధికారులు ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించకపోవడం పై సర్వత్రా విమర్శిలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో పాలకులు ప్రజల అవససరాలకోసం బస్‌షెల్టర్‌ నిర్మాణంతోపాటు మరుగుదొడ్లను నిర్మించి మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Aug 24 , 2024 | 11:38 PM