వామ్మో.. చిరుతపులి
ABN , Publish Date - Jun 27 , 2024 | 12:09 AM
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని దేవనగరం గ్రామ సమీపంలో బుధవారం సాయంత్రం చిరుతపులి సంచారం భయాందోళనలు రేకెత్తించింది.

దేవనగరం పరిసరాల్లో సంచారం
గుంతలో పడడంతో అక్కడే బంధించిన అధికారులు
గిద్దలూరు టౌన్, జూన్ 26 : ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని దేవనగరం గ్రామ సమీపంలో బుధవారం సాయంత్రం చిరుతపులి సంచారం భయాందోళనలు రేకెత్తించింది. ప్రజలు దాన్ని చూసి హడలిపోయారు. అయితే చిరుతపులి అకస్మాత్తుగా గ్రామ సమీపంలోని ఓ గుంతలో పడిపోయింది. దీంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే చీకటి పడడంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించేందుకు అటవీశాఖ సిబ్బందికి ఇబ్బందులు ఎదురయ్యాయి. రాత్రివేళ దానిని బయటకు తీయకుండా గుంతలో నుంచి బయటకు వెళ్లకుండా వలతో కట్టుదిట్టంగా కంచె ఏర్పాటు చేశారు. చిరుతపులిని రక్షించి అడవిలో విడిచి పెట్టేందుకు వీలుగా తిరుపతి నుంచి గురువారం ఉదయం ప్రత్యేక రెస్క్యూ టీంను తీసుకొస్తున్నట్లు స్థానిక అటవీశాఖ అధికారులు తెలిపారు. మొత్తం మీద చిరుత గుంతలో పడడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. రెండు రోజులక్రితం గిద్దలూరు-నంద్యాల మధ్యలోని నంద్యాల అటవీ ప్రాంతంలో వంటచెరకు తెచ్చుకొనేందుకు పచ్చర్ల సమీపంలో అడవిలోకి వెళ్లిన మహిళపై చిరుత దాడి చేసి చంపిన విషయం విదితమే. గుంతలో చిక్కుకున్నది ఆ చిరుతేనా? అన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.