Share News

బిల్లులిస్తేనే తాళాలిస్తాం!

ABN , Publish Date - Jan 28 , 2024 | 11:47 PM

వైసీపీ పాలకుల మాటలు విని ప్రభుత్వ భవనాలు నిర్మించేందుకు ముందుకొచ్చిన కాంట్రాక్టర్లు, ఆపార్టీ నాయకులు బిల్లులు అందక లబోదిబోమంటున్నారు. నిర్మాణాల కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక అల్లాడుతున్నారు. ప్రభుత్వ అసమర్థ చర్యలతో నిండా మునిగామని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. బిల్లులు ఇస్తేనే కార్యాలయాల తాళాలు ఇస్తామని తేల్చిచెప్తున్నారు.

బిల్లులిస్తేనే తాళాలిస్తాం!
మోపాడులో అసంపూర్తిగా ఉన్న గ్రామ సచివాలయం(ఇన్‌సెట్లో)బిల్లులు చెల్లించాలని కోరుతున్న కాంట్రాక్టర్‌ వెంకటేశ్వర్లు

తెగేసి చెప్తున్న కాంట్రాక్టర్లు ఠ పోటీపడి ప్రభుత్వ భవనాల నిర్మాణం

అప్పులు తెచ్చి పనులు

వడ్డీలు చెల్లించలేక అవస్థలు

వైసీపీ నిండాముంచిందని ఆవేదన

పామూరు, జనవరి 28 : వైసీపీ పాలకుల మాటలు విని ప్రభుత్వ భవనాలు నిర్మించేందుకు ముందుకొచ్చిన కాంట్రాక్టర్లు, ఆపార్టీ నాయకులు బిల్లులు అందక లబోదిబోమంటున్నారు. నిర్మాణాల కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక అల్లాడుతున్నారు. ప్రభుత్వ అసమర్థ చర్యలతో నిండా మునిగామని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. బిల్లులు ఇస్తేనే కార్యాలయాల తాళాలు ఇస్తామని తేల్చిచెప్తున్నారు. మండలంలో ఒక్కో సచివాలయానికి రూ.40లక్షల వంతున 19 సచివాలయాలు, రూ.21.80లక్షల వంతున 19 ఆర్బీకే కేంద్రాలు, రూ.17.5లక్షల వంతున 18 హెల్త్‌ సబ్‌సెంటర్లు, రూ.17.67లక్షల వంతున 14 పాల కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది. గ్రామ సచివాలయాలకు డిజైన్‌లు మార్చడంతో రూ.40లక్షలతోపాటు అదనంగా మరో రూ.7లక్షల వరకు ఖర్చు పెరిగింది. ఉపాధి హామీ నిధులు రూ.40లక్షలు, అదనంగా రూ.7లక్షలు గ్రామ పంచాయతీ నిధులను ఖర్చుచేయాలని ప్రభుత్వం జీవో ఇచ్చింది. అసలే ఆర్థిక ఇబ్బందులు పడుతున్న గ్రామ పంచాయతీలు రూ.7లక్షలు ఇచ్చేందుకు సుముఖత చూపలేదు. దీంతో కొన్నిచోట్ల ఆ మొత్తాన్ని కాంట్రాక్టర్లే భరించారు. కానీ అందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి బిల్లులు రాలేదు. మరికొన్నిచోట్ల ఉపాధి బిల్లులు రాకపోవడం, వైసీపీ ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోవడంతో ఎక్కడ పనులు అక్కడే కాంట్రాక్టర్లు నిలిపివేశారు. బిల్లులు చెల్లిస్తేనే తాళాలు ఇస్తామని చెప్పడంతో పనులు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది.

ఐదు సచివాలయ భవనాలు మాత్రమే పూర్తి

జగన్‌రెడ్డి మాట తప్పడు.. మడమ తిప్పడు అన్న నమ్మకంతో ప్రభుత్వ భవనాలు నిర్మించేందుకు కాంట్రాక్టర్లు, వైసీపీ నాయకులు మొదట్లో పోటీపడ్డారు. 19 సచివాలయాల్లో ఈ నాలుగేళ్ల 9 నెలల్లో కేవలం పామూరు 1, వగ్గంపల్లి, నుచ్చుపొద, కంభాలదిన్నె. బొట్లగూడూరు సచివాలయ భవనాలు మాత్రమే పూర్తయి ప్రారంభించారు. మిగతా నిర్మాణాలు వివిధ దశల్లో అసంపూర్తిగా ఉన్నాయి. పామూరులోని 3 గ్రామ సచివాలయాలు పాత ప్రభుత్వ వైద్యశాల భవనాల్లోనే కొనసాగుతున్నాయి. పామూరు పట్టణానికి ఇప్పటికే సీహెచ్‌సీ ఉంది. దాన్ని కొత్తభవనంలోకి మార్చారు. పాత భవనాల్లో మూడు గ్రామ సచివాలయాలను నిర్వహిస్తున్నారు. సుమారు పది నెలల క్రితం పా మూరుకు మరో పీహెచ్‌సీ మంజూరైంది. అయితే సీహెచ్‌సీకి ఉన్న పాత భవనాల్లో సచివాయాలు నిర్వహిస్తుండంతో పీహెచ్‌సీకి గూడుకరువైంది. ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యుడు స్వగ్రామమైన మోపాడులో గ్రామ సచివాలయం అసంపూర్తిగా ఉంది. బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయని పంచాయతీరాజ్‌ అధికారులు తెలిపారు.

బిల్లులు చెల్లించి ఆదుకోవాలి

ఉపాధి హామీ, పంచాయతీ గ్రాంట్‌తో నిర్మించిన సిమెంట్‌ రోడ్లకు బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కొండారెడ్డిపల్లికి చెందిన వైసీపీ కాంట్రాక్టర్‌ పారా వెంకటేశ్వర్లు ఆవేదన వ్వక్తం చేశారు. తాను వగ్గంపల్లి పంచాయతీ పరిధి కొండారెడ్డిపల్లిలో 2018లో ఉపాధి హామీ, గ్రామ పంచాయతీ గ్రాంట్‌తో రూ.10లక్షల అంచనాలతో రెండు సిమెంట్‌ రోడ్లు నిర్మించారు. ఇప్పటివరకు రూ.6 లక్షలు చెల్లించగా, పంచాయతీ గ్రాంట్‌ నుంచి రూ.40 వేలు రావాల్సి ఉంది. సర్పంచ్‌ను అడిగితే తాను ఇవ్వలేనని తనకే డబ్బులు రావాలని చెప్తున్నారని వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతోపాటు ఉపాధి హామీ నుంచి రూ.2.64లక్షలు రావాలని తెలిపారు. అప్పులు తెచ్చి రోడ్లు నిర్మిస్తే నేటికీ బిల్లులు చెల్లించకపోవడంతో వడ్డీలు కట్టలేని పరిస్థితి నెలకొందన్నారు. వెంటనే బిల్లులు చెల్లించి ఆదుకోవాలని ఆయన కోరారు.

Updated Date - Jan 28 , 2024 | 11:47 PM