Share News

దిగువ ఆయకట్టుకు నీరివ్వాలి

ABN , Publish Date - Oct 06 , 2024 | 11:24 PM

అధికారులు సమన్వయంతో పనిచేసి దిగువ ఆయకట్టు వరకు నీటి విడుదల అయ్యేలా పనిచేయాలని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. ఏబీసీ 18వ మైలు వద్ద ఆదివారం నీటి విడుదలను ఆయన పరిశీలించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన రైతులు మేజర్‌ కాలువలలో చిల్లచెట్లు, పూడికతో నిండిపోయి నీటి ప్రవాహం లేకుండా పోయిందని మంత్రి రవికుమార్‌కు వివరించారు.

దిగువ ఆయకట్టుకు నీరివ్వాలి
ఎన్నెస్పీ అధికారులతో మాట్లాడుతున్న మంత్రి రవికుమార్‌

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

వారంలో అన్ని మేజర్‌ కాలువలలో పూడికతీత, చిల్లచెట్ల తొలగింపు

తాత్కాళిక పద్ధతిలో లస్కర్‌లను నియమించాలి

మంత్రి గొట్టిపాటి ఆదేశం

అద్దంకి, అక్టోబరు 6 : అధికారులు సమన్వయంతో పనిచేసి దిగువ ఆయకట్టు వరకు నీటి విడుదల అయ్యేలా పనిచేయాలని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. ఏబీసీ 18వ మైలు వద్ద ఆదివారం నీటి విడుదలను ఆయన పరిశీలించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన రైతులు మేజర్‌ కాలువలలో చిల్లచెట్లు, పూడికతో నిండిపోయి నీటి ప్రవాహం లేకుండా పోయిందని మంత్రి రవికుమార్‌కు వివరించారు. వెంటనే స్పందించిన రవికుమార్‌ ఆయా పరిధిలోని అధికారులు అన్ని మేజర్‌లను పరిశీలించి అవసరమైన అన్నిచోట్లా ఎక్స్‌కవేటర్‌లను ఏర్పాటు చేసి వారం రోజులలో పూడికతీత పనులు పూర్తి చేయాలని మంత్రి రవికుమార్‌ ఆదేశించారు. రైతులు స్వయంగా పర్యవేక్షించి పనులు చేయించుకోవాలన్నారు. ఏబీసీలో పల్నాడు జిల్లా పరిధిలో పలు మేజర్‌లకు తలుపులు, షట్టర్‌లు లేకపోవడంతో నీటి వృథా అవుతున్న విషయాన్ని, పలు మేజర్‌లో పొర్లిపోతున్న విషయాన్ని రైతులు రవికుమార్‌ దృష్టికి తీసుకు రాగా, అవసరమైన చోట్ల తలుపులు, షట్టర్‌లను ఏర్పాటు చేసి నీటి వృథాను అరికట్టాలన్నారు. పర్చూరు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలతో పాటు అద్దంకి నియోజకవర్గంలోని దిగువ ఆయకట్టుకు కూడా నీటి విడుదల జరిగేలా సమన్వయంతో పనిచేయాలన్నారు. ఏబీసీ హెడ్‌ వద్ద 2100 క్యూసెక్కుల నీటిని విడుదల చేయించడంతో పాటు బాపట్ల జిల్లా సరిహద్దు 18వ మైలు వద్ద 1200 క్యూసెక్కులు విడుదలయ్యేలా దిగువ ఆయకట్టుకు సరిపడా నీటి విడుదలకు ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. నీటి విడుదలలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా వ్యవహరించాలన్నారు. అద్దంకి డివిజన్‌లో 125 మంది లస్కర్‌లు ఉండాల్సి ఉండగా, 20 మంది మా త్రమే ఉన్న విషయాన్ని తెలుసుకున్న మంత్రి వెంటనే ఈఎస్‌తో ఫోన్‌లో మాట్లాడారు. తాత్కాళిక పద్ధతిన లస్కర్‌లను నియమించాలన్నారు. రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. గుండ్లకమ్మ రిజర్వాయర్‌ గేట్ల ఏర్పాటు పనుల గురించి ఈఈ అబుతలేమ్‌తో చర్చించారు. ఇప్పటికే 10 గేట్ల ఏర్పాటు పూర్తయిందని, మిగిలిన రెండు గేట్ల పనులు పూర్తవుతాయని ఈఈ వివరించారు. నెలాఖరు నాటికి 1.8టీఎంసీల నీరు గుండ్లకమ్మ రిజర్వాయర్‌లో నింపుతామన్నారు. వచ్చేనెలలో పూర్తిస్థాయిలో నింపి ఆయకట్టుకు నీరందిస్తామని తెలిపారు. రైతులకు పరిహారం అందించి చినపోలిరెడ్డి కొరిశపాడు ఎత్తిపోతల పథకం పనులు వేగవంతం చేస్తామని రవికుమార్‌ అన్నారు. భవనాసి రిజర్వాయర్‌ పనులు కూడా వేగవంతం చేస్తామన్నారు. లింగంగుంట్ల మానిటరింగ్‌ ఈఈ మల్లికార్జున, సంతగుడిపాడు, సంతమాగులూరు, అద్దంకి డీఈలు రామారావు, లక్ష్మీనారాయణ, రామకృష్ణ, ఏఈలు వే ణు, అనిల్‌, ప్రతిమ, విశ్వమోహన్‌, క్రాంతి, సునీల్‌, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. అడవిపాలెంలో విద్యుత్‌ స్తంభాలు దెబ్బతిని విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని, వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌లు మంజూరు చేయించాలని గ్రామస్థులు రవికుమార్‌ దృష్టికి తీసుకు వచ్చారు. రోడ్డు మరమ్మతులకు నిధులు మంజూరు చేయించాలని కోరారు.

Updated Date - Oct 06 , 2024 | 11:24 PM