Share News

వలంటీర్లూ.. రాజీనామా చేయాల్సిందే..!

ABN , Publish Date - Apr 16 , 2024 | 01:38 AM

వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది. వచ్చేనెలలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వలంటీర్ల సహకారం లేకుండా ప్రజల్లోకి వెళ్లలేమని భావించినఆ పార్టీ నేతలు వారి చేత బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారు.

వలంటీర్లూ.. రాజీనామా చేయాల్సిందే..!
11వ డివిజన్‌ కార్పొరేటర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో రాజీనామా చేసిన వలంటీర్లు

వైసీపీ ప్రచారం కోసం కార్పొరేటర్ల ఒత్తిడి

ఇష్టం లేకపోయినా చేస్తున్న వైనం

ఒంగోలు (కార్పొరేషన్‌), ఏప్రిల్‌ 15 : వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది. వచ్చేనెలలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వలంటీర్ల సహకారం లేకుండా ప్రజల్లోకి వెళ్లలేమని భావించినఆ పార్టీ నేతలు వారి చేత బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారు. సోమవారం నగరంలోని11, 13, 15, 24 డివిజన్లలో పలువురు వలంటీ ర్లు తమ సేవలకు స్వస్తిపలికారు. ఈమేరకు ఆయా డివిజన్‌ పరిధిలోని సచి వాలయాల అడ్మిన్‌లకు రాజీనామా పత్రాలు సమర్పించారు. ఆ కార్యక్రమంలో స్థానిక డివిజన్‌ కార్పొరేటర్లు ప్రవీణ్‌కుమార్‌, కమలమ్మ, చింతపల్లి గోపి, బేతంశెట్టి శైలజ, ఇతర కార్పొరే టర్లు స్వయంగా పాల్గొన్నారు. అయితే వైసీపీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు వెళ్లినప్పుడు డివిజన్లలోని ఇళ్లలో ఏమేమి పథకాలు ఇస్తున్నారు, ఎన్ని ఓట్లు ఉన్నాయి, పార్టీకి అనుకూలమా? లేదా? అనే అంశాలపై వైసీపీ కార్పొరేటర్లకు అవగాహన అంతంతమాత్రంగా ఉంది. దీంతో వలంటీర్లేకీలకమన్న భావనకు వచ్చారు. వలంటీర్లకు ఇప్పటి వరకు గౌరవ వేతనంగా కార్పొరేషన్‌ అధికారులు అందిస్తున్న రూ.5వేలకు మూడు రెట్లు ఇస్తామని ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అంతేకాకుండా నెలరోజులు పనిచేస్తే మరిన్ని బహుమతులు ఇస్తామని వారికి ఆశపెడుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని, తిరిగి మిమ్మల్నే వలంటీర్లుగా పెడతామని కార్పొరేటర్లు నమ్మబలుకుతున్నారు. కాగా కొందరు ఉన్నత చదువులు చదువుకుని కూడా ఏ ఉద్యోగం దొరక్క వలంటీర్‌ సేవలను అందిస్తున్నారు. అయితే తమకు ఇష్టం లేకపోయినా కార్పొరేటర్ల ఒత్తిడితో తప్పుకుంటున్నారు. రాజీనామా లేఖలకు సచివాలయ అడ్మిన్‌లకు ఇస్తున్నారు.

రాజీనామా చేస్తే సేవలకు శాశ్వతంగా స్వస్తి

స్థానిక వైసీపీ కార్పొరేటర్లు బలవంతంగా రాజీనామా చేయాలని ఆదేశిస్తున్నా, కొందరు వలంటీర్లు వెనుకడుగు వేస్తున్నారు. తమకై తాము సేవల నుంచి తప్పుకుంటున్నట్లు లిఖితపూర్వకంగా రాసిస్తే తిరిగి తీసుకునే అవకాశం లేదని కార్పొరేషన్‌ అధికారులు వెల్లడిస్తున్నారు. సస్పెండ్‌ అయినా మూడు, నాలుగు నెలలు సేవల నుంచి దూరంగా ఉంచి, మరలా తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ, ఏకంగా సేవలు చేయమని చెబుతూ రాజీనామా చేస్తే ఇక ఎప్పటికీ విధుల్లోకి తీసుకునే అవకాశం లేదన్న విషయాన్ని కొందరు వలంటీర్లు గుర్తించారు. దీంతో వైసీపీ కార్పొరేటర్లకు, ఆ పార్టీశ్రేణుల ఒత్తిళ్లను తిరస్కరించినట్లు సమాచారం. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఈ రెండు నెలలు మౌనంగా ఉంటే సరిపోతుందని, టీడీపీ అధికారంలోకి వస్తే రూ.10వేలు గౌరవ వేతనం లభిస్తుందనే ఆలోచనలో ఉన్నారు. లేదంటే ఇదే వేతనంతో కొనసా గవచ్చని భావిస్తుస్తున్నారు.

Updated Date - Apr 16 , 2024 | 01:38 AM